దొంగే దొంగా.. దొంగ అనే పాలసీని వైసీపీ మొదటి నుంచి పాటిస్తోంది. ఇప్పుడు దాన్ని ప్రభుత్వం చేసిన పనులకూ అప్లయ్ చేస్తోంది. ప్రస్తుత ప్రభుత్వం పూర్తి చేస్తున్న పనులను తాము చేశామని చెప్పుకునేందుకు క్రెడిట్ చోరీకి పాల్పడేందుకు పక్కా ప్లాన్ అమలు చేస్తోంది. మొదట పూర్తయ్యే ప్రాజెక్టును ఎంపిక చేసుకుంటారు. ఆ ప్రాజెక్టు పూర్తవుతుందని తెలియగానే వెంటనే జగన్ పూర్తి చేశారని సాక్షిలో ప్రచారం చేస్తారు. సోషల్ మీడియాలో రుద్దుతారు. తర్వాత జగన్ ప్రెస్మీట్ పెట్టి మేమే దాన్ని పూర్తి చేశాం…ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందంటాడు. మేమే ప్రారంభించామని కూడా చెబుతారు. పూర్తి కాకుండా ఎలా ప్రారంభిస్తారన్నది చెప్పరు. ఇప్పుడు అదే వెలిగొండ ప్రాజెక్టు విషయంలోనూ జరుగుతోంది. అదే ప్లాన్ తో .. క్రెడిట్ చోరీకి పెద్ద స్కెచ్ వేస్తున్నారు.
ఎన్నికలకు ముందు జాతికి అంకితం చేసిన జగన్
వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తికాకుండానే, ఎన్నికల ముందు కేవలం రాజకీయ లబ్ధి కోసం మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆడిన జాతికి అంకితం డ్రామా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2024 మార్చి 6న పోలీసు పహారా మధ్య, నిర్వాసితులను ఇళ్లకే పరిమితం చేసి జగన్ నిర్వహించిన ప్రారంభోత్సవం చేశారు. అప్పటికి నిర్వాసితులకు డబ్బులు చెల్లించలేదు. ప్రాజెక్టులో ఇంకా వేల కోట్ల రూపాయల పనులు మిగిలి ఉండగానే పూర్తి అయిపోయిందంటూ ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజలను వంచించారు.
అసంపూర్తి పనుల చిట్టా:
వైసీపీ హయాంలో జగన్ పని పూర్తయిందని ప్రాజెక్టు జాతికి అంకితం చేసే నాటికి హెడ్ రెగ్యులేటర్ వద్ద ఇంకా 4,300 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని పెండింగ్లో ఉంది. అలాగే టన్నెల్-1లో 1.20 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించాల్సి ఉంది. టన్నెల్-2లో దాదాపు 7 కిలోమీటర్ల మేర లైనింగ్ పనులు అప్పట్లో అసలు ప్రారంభం కాలేదు. లైనింగ్ లేకుండా నీటిని వదిలితే సొరంగం కుప్పకూలిపోయే ప్రమాదం ఉన్నా, జగన్ ప్రభుత్వం ఆ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ప్రారంభోత్సవం పేరిట హడావుడి చేసింది.
నిర్వాసితులకు తీరని అన్యాయం
ప్రాజెక్టు కోసం భూములు త్యాగం చేసిన 11 గ్రామాల నిర్వాసితులకు సుమారు రూ. 886 కోట్ల నష్టపరిహారం చెల్లించకుండా జగన్ ప్రభుత్వం దగా చేసింది. పునరావాసం పనులను గాలికొదిలేసి, కనీసం కాలనీల నిర్మాణం కూడా పూర్తి చేయకుండా ప్రాజెక్టు ప్రారంభించినట్లుగా నాటకమాడారు. టన్నెల్-2లో చిక్కుకుపోయిన భారీ టీబీఎం మెషీన్ను తొలగించడానికి కనీస ప్రయత్నం చేయలేదు. ఫలితంగా నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడింది. ఓ ప్రాజెక్టుకు పెద్దగా నిధులు ఖర్చు పెట్టకుండా.. పూర్తి చేసినట్లుగా ప్రారంభించడమే జగన్ మనస్తత్వానికి నిదర్శనంగా కనిపిస్తోంది.
కూటమి వచ్చాక పనుల్లో వేగం.. త్వరలో పూర్తి
ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం టన్నెల్-2లో కేవలం 705 మీటర్ల లైనింగ్ మాత్రమే చేస్తే, కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ కొద్ది కాలంలోనే 3,644 మీటర్ల పనిని పూర్తి చేసింది. ప్రస్తుతం రూ. 456 కోట్లతో ఫీడర్ కాలువ పనులను, రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు. ఈ ఏడాది వెలిగొండ ప్రాజెక్టును వంద శాతం పూర్తి చేసి కరువు తీర్చనున్నారు.
ఈ అంశంపై స్పష్టత రావడంతో వెలిగొండ ప్రాజెక్టు క్రెడిట్ చోరీ కోసం స్కెచ్ ప్రారంభించారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు అవినీతికి పాల్పడటం అనే చోరీలో ఎక్స్పర్ట్స్ అనుకుంటే.. ప్రభుత్వం పోయాక… క్రెడిట్ చోరీ చేయడంలో మరింతగా ముదిరిపోయారు.
