ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అగ్రనేతలు మళ్లీ పాత పద్ధతిలోనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అసభ్య పదజాలంతో వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల మాజీ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసి, ఆపై జరిగిన ఘర్షణలతో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అయితే, జైలు నుంచి వచ్చిన తర్వాత ఆయన తన తప్పును సరిదిద్దుకోకపోగా.. “నన్ను కొట్టారు, నా కారు ధ్వంసం చేశారు అంటూ సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారు. జైలుకు వెళ్లడాన్ని కూడా ఒక అర్హతగా, ప్లస్ పాయింట్‌గా చెప్పుకుంటూ తిరగడం వైసీపీ నేతల మానసిక స్థితిని సూచిస్తోంది.
అంబటి బాటలోనే రోజా !
అంబటి బాటలోనే ఇప్పుడు మరో మాజీ మంత్రి ఆర్కే రోజా కూడా వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. ఒక మహిళా నేతగా ఉండి, ప్రత్యర్థుల కుటుంబ సభ్యులపై ఆమె వాడుతున్న భాష అత్యంత దారుణంగా ఉందనే విమర్శలు వస్తున్నాయి. పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రోజా, తనపై ప్రభుత్వం ఏవైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటే, దానిని రాజకీయ వేధింపు గా చిత్రీకరించి సానుభూతి పొందాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్దేశపూర్వకంగానే నోరు పారేసుకోవడం ద్వారా పోలీసుల చర్యను ఆహ్వానించడం, ఆపై బాధితురాలిగా కలర్ ఇవ్వడం వైసీపీ పక్కా వ్యూహంగా కనిపిస్తోంది.
అంతా జగన్ డైరక్షనే
ఈ బూతుల రాజకీయాల వెనుక వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి డైరెక్షన్ ఉందనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపేందుకు, ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి రెచ్చగొట్టే ధోరణిని ఆయన ప్రోత్సహిస్తున్నట్లు అర్థమవుతోంది. తిట్టించడం.. కొట్టించుకోవడం.. ఏడ్చి సానుభూతి పొందడం అనే ఫార్ములాను జగన్ నమ్ముకున్నారని, అందుకే ఒకరి తర్వాత ఒకరు వైసీపీ నేతలు మళ్లీ బూతు పురాణం అందుకుంటున్నారు.
ప్రజలు ఏమనుకుంటున్నారో కనీసం తెలుసుకోరా?
ఇలాంటి క్షుద్ర రాజకీయాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారనే కనీస జ్ఞానం వైసీపీ నేతలకు ఉండటం లేదు. జగన్ రెడ్డి వేస్తున్న ఈ సింపతీ ట్రాప్ లో సీనియర్ నేతలు సైతం బలి పశువులుగా మారుతున్నారు. ప్రభుత్వం పక్కా ఆధారాలతో అవినీతిపై చర్యలు తీసుకుంటుంటే, దానిని కప్పిపుచ్చుకోవడానికి ఈ బూతు బాటను ఒక కవచంగా వాడుకుంటున్నారు. ప్రజల అసహ్యాన్ని మూటగట్టుకుంటున్నా సరే, అధినేత మెప్పు కోసం నేతలు చేస్తున్న ఈ ప్రయత్నాలు వైసీపీని మరింత పాతాళానికి తొక్కుతాయనడంలో సందేహం లేదు.
