జగన్ రెడ్డి బీజేపీతో చేతులు కలిపి వైఎస్ ఆశయాలకు తిలోదకాలిచ్చారని ఆయన వైఎస్ వారసుడు కాదని షర్మిల చేస్తున్న విమర్శలకు వైసీపీ దగ్గర సమాధానం లేకపోయింది. షర్మిల మాటల ప్రజల్లోకి బలంగా వెళ్తూండటంతే ఆమె చంద్రబాబుతో చేతులు కలిపారన్న వింత వాదనతో ఎదురుదాడి చేస్తున్నారు. షర్మిల చంద్రబాబుతో ఎప్పుడు చేతులు కలిపారు.. ఎలా చేతులు కలిపారో వారు చెప్పరు. కానీ చంద్రబాబు ముద్ర వేస్తే తమ రాజకీయం నడిచిపోతుందని.. షర్మిల క్యారెక్టర్ ను తప్పు పట్టవచ్చని వారు దాడి చేస్తున్నారు.
షర్మిల ఏపీ పీసీసీ చీఫ్. ఆమె కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్నారు. జగన్ రెడ్డి అనుభవిస్తున్నదంతా.. కాంగ్రెస్ పార్టీదే. చివరికి చెల్లిని కూడా మోసం చేయడంతో ఆమె తన సొంత బాట ఎంచుకుని కాంగ్రెస్ లో చేరి రాజకీయం చేసుకుంటున్నారు. జగన్, షర్మిల మధ్య ఆస్తుల గొడవులు కూడా ఉన్నాయి. ఈ మధ్యలో చంద్రబాబు ఎక్కడినుంచి వస్తారు?. జగన్ రెడ్డి చేసే క్షుద్ర రాజకీయంలో చంద్రబాబు వస్తారు. వివేకానంద రెడ్డి ఘోరమైన హత్యను కూడా చంద్రబాబుమీద వేశారు. ఇప్పుడు షర్మిల అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చంద్రబాబుతో చేతులు కలిపారని అంటున్నారు.
షర్మిలపై వైసీపీ మహిళా నేతలు రోజా, వరుదు కల్యాణి స్వతహాగా విమర్శలు చేయరు. ఖచ్చితంగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఎటాక్ చేయాలని స్క్రిప్ట్ వస్తేనే వారు ట్వీట్లు చేస్తారు. లేదంటే వారి ట్విట్టర్ అకౌంట్లను వైసీపీలోని సాక్షి జర్నలిస్టులు అయినా నిర్వహిస్తూ ఉండాలి. ఎలాంటి ట్వీట్లు వేసినా అది పార్టీ విధానం కాబట్టి వారు సమర్థించక తప్పదు. షర్మిల రాజకీయాలను.. ధైర్యంగా ఎదుర్కోలేక చంద్రబాబు వెనుక దాక్కున్నంత కాలం వైసీపీకి రాజకీయ సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి.


