ఇప్పుడు అత్యధిక మంది అపార్టుమెంట్లు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఆపార్టుమెంట్ శాశ్వతం కాదు. ఆ మాటకు వస్తే ఇండిపెండెంట్ హౌస్ కూడా శాశ్వతం కాదు. ఎప్పటికైనా కొత్తగా నిర్మించాల్సి రావచొచ్చు.కానీ అపార్టుమెంట్ మొత్తం కూలగొట్టి మళ్లీ నిర్మించాల్సి వస్తే.. అది కొనుగోలు చేసిన వారికి పెను భారమే అవుతుంది. సాధారణంగా అపార్టుమెంట్ల కల్చర్ ప్రారంభమయ్యాక.. ఇప్పటి వరకూ అలా గడువు ముగిసిందని కూల్చేసే పరిస్థితులు రాలేదు.
కానీ నిర్మాణ లోపాల వల్ల ఎప్పటికప్పుడు పలు చోట్ల అపార్టుమెంట్లు కూల్చేయడం చూస్తూనే ఉన్నాం. మంచి నాణ్యతతో నిర్మించిన రీన్ఫోర్స్డ్ కాంక్రీట్ (RCC) భవనం సాధారణంగా 50 నుండి 100 సంవత్సరాల వరకు ఉపయోగపడుతుంది. భారతీయ బిల్డింగ్ కోడ్ ప్రకారం, RCC నిర్మాణాలు 50-70 సంవత్సరాల డిజైన్ లైఫ్‌ను కలిగి ఉంటాయి. సరైన నిర్వహణతో ఇది 100 సంవత్సరాలకు పైగా కొనసాగవచ్చు.
కానీ ప్రాక్టికల్స్ గా ఆలోచిస్తే బెంగళూరు, హైదరాబాద్. వంటి నగరాల్లో ఐదు అంతస్తుల వరకూ అపార్ట్మెంట్లు సాధారణంగా 60 సంవత్సరాలు సమర్థవంతంగా ఉంటాయి. ఆ తర్వాత పునరుద్ధరణ లేదా పునర్నిర్మాణం అవసరం కావచ్చు. భవనం రూపకల్పన చేసిన లోడ్ కంటే ఎక్కువ బరువును అంటే అదనపు అంతస్తులు నిర్మిస్తే జీవిత కాలం తగ్గుతుంది.
కానీ బెంగళూరు, హైదరాబాద్ లలో 30-40 సంవత్సరాల తర్వాత భవనాలను “పాతవి”గా చెబుతారు. వాటికి రియల్ ఎస్టేట్ విలువ ఉండదు. కూల్చేసి మళ్లీ కొత్తగా నిర్మించుకోవాల్సిఉంటుంది.