సిబిల్ స్కోర్ అంటే ఇప్పటి వరకూ కేవలం లోన్లు , ఆర్థిక వ్యవహారాలకు అనుకుంటారు. కానీ ఇపుడు అది కండక్ట్ సర్టిఫికెట్ గా మారుతోంది . ఈ స్కోర్ చాలా తక్కువగా ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా .. అన్ని పరీక్షల్లో ..ఇంటర్యూల్లో పాసైన అభ్యర్థికి ఉద్యోగం ఇచ్చేందుకు నిరాకరించింది. ఆ నిర్ణయాన్ని హైకోర్టు కూడా సమర్థించింది.
ఉద్యోగానికి ఎంపికైనా ..తనకు పోస్టింగ్ ఇవ్వడం లేదని ఓ వ్యక్తి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషనర్ SBIలో CBO పోస్టుకు దరఖాస్తు చేసి, రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేశాడు. మార్చి 16, 2021న నియామక పత్రం కూడా అందుకున్నాడు. కానీ అతని CIBIL రిపోర్టు పరిశీలనలో, రుణ చెల్లింపులలో దీర్ఘకాల డిఫాల్ట్ హిస్టరీ, వ్యక్తిగత రుణాలు , క్రెడిట్ కార్డులను వాడుకుని చెల్లించకపోవడం, ఒక రుణం రైట్-ఆఫ్ అయితే న్యాయపరమైన చర్యలు తీసుకోవడం వంటి రికార్డులు ఉన్నాయి. అలాగే ఐదేళ్లలో 50కి పైగా రుణ ఎంక్వైరీలు ఉన్నట్లు తేలింది. దీంతో SBI నియామకాన్ని రద్దు చేసింది.
కోర్టు వాదనల్లో తాను అన్ని రుణాలు , బకాయిలు చెల్లించానని వాదించాడు. కానీ ఎస్బీఐ సిబిల్ స్కోరును ప్రస్తావించింది. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోని క్లాజ్ 1(E) ప్రకారం ప్రతికూల క్రెడిట్ రిపోర్టు లేదా రుణ డిఫాల్ట్ హిస్టరీ ఉన్న అభ్యర్థులను అనర్హులుగా చేయవచ్చని హైకోర్టుకు చెప్పింది. బ్యాంక్ ఉద్యోగులు పబ్లిక్ డబ్బును నిర్వహించేందుకు కఠినమైన ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉండాలని, పిటిషనర్ క్రెడిట్ హిస్టరీ అటువంటి క్రమశిక్షణ లేనిదిగా ఉందని వాదించింది.
హైకోర్టు ఎస్బీఐ వాదనతో ఏకీభవించింది. బ్యాంకింగ్ సెక్టార్లో ఉద్యోగులు పబ్లిక్ డబ్బును నిర్వహిస్తారు కాబట్టి, SBI నిర్ణయం సమంజసమని తీర్పు ఇచ్చింది. ఇప్పుడు బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలు సాధించాలంటే సిబిల్ స్కోర్ చాలా ముఖ్యమని అర్థం చేసుకోవచ్చు.