వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వారి అధినాయకత్వం అయోమయంలో ఉంది. లిక్కర్ స్కామ్ చేసి అడ్డగోలుగా ప్రజల ఆరోగ్యాలను సైతం దోచుకున్న వ్యవహారం కళ్ల ముందు ఉన్న సమయంలో .. తమ చేతుల్లో పావులుగా మారిన నిందితులను టీడీపీకి సన్నిహితులని చెప్పేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు. టీడీపీ ఎంపీ శివనాథ్‌తో ఓ కంపెనీలో డైరక్టర్ గా ఉన్నారని రాజ్ కేసిరెడ్డిని టీడీపీకి సన్నిహితుడని డిక్లేర్ చేశారు. కొన్ని ఫోటోలు తీసుకొచ్చి వెంకటేష్ నాయుడ్ని కూడా టీడీపీ కి సన్నిహితుడ్ని చేశారు. కానీ వారిని కేసు ల నుంచి బయటకు తీసుకు రావడానికి మాత్రం వైసీపీకి చెందిన దిగ్గజ లాయర్లంతా చెమటోడుస్తున్నారు.
కోర్టుల దగ్గరే పడిగాపులు పడుతున్న వైసీపీ లీగల్ టీమ్
లిక్కర్ స్కామ్‌లో నిందితుల కోసం వైసీపీ చాలా పెద్ద టీమ్‌ను ఏర్పాటు చేసుకుంది. వారి లీడర్ నిరంజన్ రెడ్డి. జగన్ రెడ్డి దాకా కేసు వస్తే ఏం చేయాలో ఆయన తన పని తాను చేస్తూనే.. కింది కోర్టుల్లో ఇతర నిందితుల కోసం ఎలాంటి వాదనలు వినిపించాలో డిక్టేట్ చేస్తున్నారు. ఆయన నేతృత్వంలో పొన్నవోలు రెడ్డి దగ్గర నుంచి సుధాకర్ రెడ్డి వరకూ పదుల సంఖ్యలో లాయర్లు ఏసీబీ కోర్టు దగ్గర మోహరిస్తున్నారు. వారంతా తమకు చేతనైన వాదనలు వినిపిస్తున్నారు. వారెవరూ లిక్కర్ స్కామ్ లో భాగం కాలేదని అంటున్నారు. దొరికిన డబ్బులు లిక్కర్ స్కామ్ కు సంబంధం లేనివని ఆరోపించేందుకు వెనుకాడటం లేదు.
ఆ “పచ్చ దొంగల” కోసం ఇంత ఆత్రమెందుకు ?
ఆ నిందితుల్ని అడ్డగోలు వాదనలతో రక్షించేందుకు వైసీపీ లాయర్లు చేస్తున్న ప్రయత్నాలు అందరి కళ్ల ముందు ఉన్నా.. వారిని టీడీపీ నేతలకు సన్నిహితులు అని చెప్పేందుకు వైసీపీకి , సాక్షికి సిగ్గు పడటం లేదు. వారు నోరు విప్పితే తమ పరిస్థితి ఘోరంగా ఉంటుందని అందుకే తాము అండగా ఉంటామని చెప్పుకునేందుకు లాయర్లను పెడుతున్నారు. ఇప్పుడు జైళ్లలో ఉన్న వారు ఎవరు అసలు నిజాలు చెప్పినా.. వారితో ఆ స్కాములు చేయించిన వారికి శంకరగిరి మాన్యాలు తప్పవు.
వైసీపీ వింత నాటకాలకు నవ్వుకుంటున్న జనం !
ప్రజల ముందు తాము పత్తిత్తులమని చెప్పుకోవడం కన్నా.. టీడీపీ నేతలు కూడా అలాంటి వారే అన్న ముద్ర వేయడం ఈజీ అని వైసీపీ, సాక్షి అనుకుంటున్నాయి. విచిత్రమైన వాదనలతో తెరపైకి వస్తున్నారు. కానీ వారి కోసం వైసీపీ లాయర్లను పెట్టడం మాత్రం మానడం లేదు. ప్రజలు గుర్తించరని.. తాము చెప్పేదే నమ్ముతారన్న ఓ రకమైన వింత భ్రమలో మునిగి తేలుతున్నారు.