తెలంగాణలో అధికారం మారినప్పటి నుంచి కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య సాగుతున్న ప్రధాన రాజకీయం కేసీఆర్ కుటుంబం అరెస్టు చుట్టూనే సాగుతోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను కేంద్ర సంస్థలు ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. అలా చేయకపోవడం బీజేపీ-బీఆర్ఎస్ మధ్య ఉన్న రహస్య ఒప్పందానికి నిదర్శనమని ఆరోపించారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలోనూ అదే చెబుతున్నారు. కేంద్రం వారిని అరెస్టు చేయడం లేదంటున్నారు. కానీ అసలు అవకాశం వచ్చినా.. ఆధారాలు ఉన్నా అరెస్టు చేయనిదే రేవంత్ సర్కారేనని బండి సంజయ్ అంటున్నారు.
రేవంత్ అనుకుంటే రాత్రికి రాత్రే అరెస్టు
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఫోన్ ట్యాపింగ్ కేసు, ఫార్ములా-ఈ రేసు వంటి బలమైన కేసులు ఉన్నాయి. ముఖ్యంగా ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్‌ను విచారించేందుకు గవర్నర్ నుంచి అనుమతి కూడా లభించింది. ఏసీబీ విచారణ వేగవంతం చేసినట్లు కనిపిస్తున్నా, అది కేవలం నోటీసులకే పరిమితం కావడంపై విమర్శలు వస్తున్నాయి. కేటీఆర్ ఈ అంశంలో సుప్రీంకోర్టు వరకూ వెళ్లినా ఊరట లభించలేదు. ఆయనను అరెస్టు చేయడానికి ఆటంకాలే లేవు. రేవంత్ రెడ్డికి అరెస్టు చేసే అధికారం, సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదు. కానీ రాజకీయంగా అవసరం వచ్చినప్పుడు మాత్రం కేంద్రం వైపు వేలెత్తి చూపిస్తున్నారు. దీని ద్వారా రాజకీయంగా తనకు మైలేజ్ ఇస్తుందని భావిస్తున్నారు.
రేవంత్ తీరును ప్రశ్నిస్తున్న బండి సంజయ్
కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇదే అంశాన్ని పదే పదే ప్రశ్నిస్తున్నారు. అరెస్టు చేసే దమ్ము రేవంత్ రెడ్డికి లేదని, అందుకే కేంద్రంపై నెపం నెడుతున్నారని ఆయన ఎద్దేవా చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపినట్లు చెబుతున్నా, రాష్ట్ర ఏజెన్సీలతో అరెస్టులు చేసే అవకాశం ఉన్నా ఎందుకు వెనకడుగు వేస్తున్నారని బీజేపీ ప్రశ్నిస్తోంది. రేవంత్ రెడ్డి తను చేయాల్సిన పనిని చేయకుండా, బీజేపీకి బీఆర్ఎస్తో లింక్ పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారనేది కమలనాథుల వాదన. రాజకీయంగా రేవంత్ రెడ్డి వేస్తున్న ఎత్తుగడలు ప్రస్తుతానికి కాంగ్రెస్ శ్రేణులను ఉత్సాహపరిచినా, క్షేత్రస్థాయిలో చర్యలు లేకపోతే అది ప్రత్యర్థులకు ఆయుధంగా మారుతుంది. అరెస్టుల విషయంలో బంతి ఇప్పుడు రేవంత్ రెడ్డి కోర్టులోనే ఉంది.
మడత పేచీ రాజకీయాలు.. ఫలితం ఎటు?
ప్రతీసారి అరెస్టు చేయడం లేదు అంటే ఒప్పందం ఉన్నట్లే అనే లాజిక్ ప్రజల్లో ఎల్లప్పుడూ వర్కవుట్ కాకపోవచ్చు. నిజంగా అవినీతి జరిగితే, ఆ సాక్ష్యాలు ప్రభుత్వ పెద్దల వద్ద ఉంటే.. కాలయాపన చేయడం వల్ల ప్రజల్లో ప్రభుత్వం పట్ల నమ్మకం తగ్గే ప్రమాదం ఉంది. ఒకవైపు బీఆర్ఎస్ నేతలు తమపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపిస్తుంటే, మరోవైపు బీజేపీ తాము కఠినంగా ఉన్నామని చెబుతోంది. ఈ త్రిముఖ పోరులో అరెస్టుల అంశం కేవలం ఎన్నికల నినాదంగా మిగిలిపోతోంది.
