రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న తిరుమల కల్తీ నెయ్యి వివాదంపై టీటీడీ మాజీ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ కల్తీకి కారకులు అయిన వారు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది ఘోర అపచారమని , ఈ దారుణానికి ఒడిగట్టి కూడా ఏం జరగలేదని బుకాయించడం శోచనీయమని అన్నారు. వెంకటేశ్వరస్వామికి ఎలాంటి అపచారం చేసినా శిక్ష పడదనే ఇదంతా చేసినట్లు ఉందని వ్యాఖ్యానించారు.
ఎవరైతే తప్పు చేశారని భావిస్తున్నామో వారే…సుప్రీంకోర్టుకు వెళ్ళారని కీలక వ్యాఖ్యలు చేశారు ఎల్వీ సుబ్రహ్మణ్యం. తిరుమల నెయ్యిని కల్తీ చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు. కల్తీ వ్యవహారంతో కోట్ల రూపాయలు కొల్లగొట్టారని, శ్రీవారి ప్రసాదం విషయంలో అత్యంత దుర్మార్గంగా వ్యవహరించారన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారు తప్పకుండా ప్రాయశ్చితం అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక, ముఖ్యమంత్రే స్వయంగా తిరుమల ప్రసాదంలో వాడిన నెయ్యి కలుషితమైందని, అందులో జంతు కొవ్వు కూడా కలిసి ఉండవచ్చని ప్రకటించిన విషయాన్ని ఎల్వీ సుబ్రహ్మణ్యం గుర్తుచేశారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను సంబంధించిన వ్యవహారం కావడంతో ప్రభుత్వం వెంటనే స్పందించి.. సిట్ ను ఏర్పాటు చేసిందని చెప్పుకొచ్చారు.
అయితే, కల్తీ వ్యవహారాన్ని చిన్నదిగా చూపించే ప్రయత్నం చేస్తూ రాష్ట్రంలో అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని పరోక్షంగా వైసీపీ రాజకీయాలపై ఫైర్ అయ్యారు. కల్తీ నెయ్యితో దోపిడీకి పాల్పడినవాళ్లు.. ఇప్పటికైనా తమకు వెంకటేశ్వర స్వామిపై నమ్మకం లేదు. డబ్బుపైనే నమ్మకం ఉందని బయటపెట్టాలన్నారు. ఈ దారుణానికి పాల్పడిన వాళ్లు క్షమాపణ చెప్పాలన్నారు. ఇందుకు ప్రాయశ్చితంగా అంగప్రదక్షిణ చేస్తారో…శిక్ష అనుభావిస్తారో మీకే వదిలేస్తున్నానని కీలక వ్యాఖ్యలు చేశారు ఎల్వీ సుబ్రహ్మణ్యం. సిట్ రిపోర్ట్ ను క్షుణ్ణంగా పరిశీలించి..బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని.. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా జాగ్రత్తలు చేపట్టాలని ఎల్వీ సుబ్రహ్మణ్యం.
