పగలు ఏసీ గదుల్లో కూర్చుని సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా కనిపించే వ్యక్తి, చీకటి పడగానే మాస్క్ తగిలించి ఇళ్ల తాళాలు పగలగొట్టే కిలాడీ దొంగగా మారుతాడని ఎవరూ ఊహించలేదు. హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగి అచ్చి మహేష్ రెడ్డి అలియాస్ సన్నీ ఇదే పని చేస్తూ దొరికిపోయాడు. వీక్ డేస్‌లో ఉద్దయోగం.. వీకెండ్స్ లో సైడ్ బిజినెస్‌గా వైజాగ్‌లో వరుస చోరీలు చేస్తూంటాడు.
అచ్చి మహేష్ రెడ్డి పీజీ పూర్తి చేసి ఐటీ రంగంలో స్థిరపడినా జీవితమంతా దొంగతనాలే. చిన్నప్పుడే దొంగతనాలుచేసి జువైనల్ హోమ్‌కు వెళ్లాడు. మొత్తంగా ఏపీ వ్యాప్తంగా సుమారు 60కి పైగా చోరీలకు పాల్పడ్డాడు. గాజువాకలో జరిగిన ఒక దొంగతనమే ఇతన్ని పట్టించింది. 17 తులాల బంగారం దోచుకున్న సమయంలో సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు, నంబర్ ప్లేట్ లేని స్కూటీలు వాడటం వంటి తెలివైన ఎత్తుగడలు వేసినా పట్టుకునేలా చేసింది.
వైజాగ్ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి దొంగతనాలను సీరియస్‌గా తీసుకున్నారు. చోరీల నమూనాను విశ్లేషించిన క్రైమ్ విభాగం, నిందితుడు ఎక్కడా ఫింగర్ ప్రింట్స్ లేదా కనీస ఆధారాలు దొరక్కుండా జాగ్రత్తపడటం చూసి ఆశ్చర్యపోయింది. కిలోన్నర బంగారం, ఆరు కిలోల వెండిని మాయం చేసిన సన్నీని పట్టుకోవడానికి సీసీ కెమెరాల నెట్వర్క్, లేటెస్ట్ టెక్నాలజీని వాడారు. చివరికి మాధవధారలోని అతడి ఇంటిని గుర్తించిన పోలీసులు, అక్కడ దొరికిన ఖరీదైన వస్తువులను చూసి విస్తుపోయారు.
జైలు నుండి విడుదలైన ప్రతిసారీ తన నేరాల వేగాన్ని పెంచే సన్నీ, రాజమండ్రి సెంట్రల్ జైలులో 14 నెలలు గడిపినప్పటికీ తన పంథా మార్చుకోలేదు. సంపాదించిన దొంగ సొమ్ముతో BMW కారు కొని, సమాజంలో పెద్ద మనిషిలా చలామణి అవుతూ రాత్రిపూట దొంగతనాలు చేస్తున్నాడు. బయటకు వచ్చినా మారుతాడన్న గ్యారంటీ ఉండదు. కొంత మంది అంతే అన్నట్లుగా ఉంటారు. ఆయన బయటకు వస్తే జనం జాగ్ర్తత పడాల్సిందే.