జగన్ రెడ్డి కోటరీని టార్గెట్ చేసి బయటకు వచ్చిన విజయసాయిరెడ్డి ఇప్పుడు .. సజ్జలను జగన్ దూరం పెడుతున్న సూచనలు కనిపించడంతో ఇప్పుడు తన విధేయను చూపించడానికి ఏ అవకాశం వచ్చినా వదిలి పెట్టడం లేదు. రాజ్యసభలో రేణుకాచౌదరి అమరావతి బిల్లుపై జరిగిన చర్చలో జగన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆమెను అడ్డుకునేందుకు ఒక్క వైసీపీ ఎంపీ కూడా ప్రయత్నించలేదు. ఇది విజయసాయిరెడ్డికి మంచి అవకాశంగా మారింది.
వెంటనే ట్విట్టర్ తీసుకుని ఓ ట్వీట్ పెట్టేశారు. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ ఒకరు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసినా, అక్కడే ఉన్న ఇతర వైసీపీ ఎంపీలు మౌనంగా ఉండటంపై విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మీ అధ్యక్షుడిని ఒకరు నోరు పారేసుకుంటుంటే.. మీకు చీమ కుట్టినట్లైనా అనిపించలేదా? అంటూ ఆయన సంధించిన ప్రశ్నలు నేరుగా జగన్ చుట్టూ ఉన్న కోటరీ *ని లక్ష్యం చేసుకున్నట్లు స్పష్టమవుతోంది.
విజయసాయిరెడ్డి ట్వీట్ వెనుక ఒక బలమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. గతంలో జగన్ పై ఈగ వాలనివ్వకుండా అడ్డుకున్న వ్యక్తిగా తనకు ఉన్న గుర్తింపును ఆయన గుర్తు చేస్తూనే, ప్రస్తుతం జగన్ పక్కన ఉన్న నాయకుల విశ్వసనీయతను ఆయన బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. జగన్ రెడ్డిని అడ్డగోలుగా తిడుతున్నా పట్టించుకోని వారంతా అసలు పార్టీకి విధేయులేనా? అనే అనుమానాన్ని ఆయన రేకెత్తిస్తున్నారు. తన ట్వీట్ల ద్వారా జగన్ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేయడంతో పాటు, ప్రస్తుత కోటరీ తీరు వల్ల పార్టీ ప్రతిష్ట గంగలో కలుస్తోందని ఆయన పరోక్షంగా హెచ్చరిస్తున్నారు.
పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, ముఖ్యంగా ఢిల్లీ స్థాయిలో పోరాడాల్సిన ఎంపీలు మౌన ప్రేక్షకులు’ గా మిగిలిపోవడంపై విజయసాయిరెడ్డి చేస్తున్న దాడి..కోటరీ నిజాయితీని ప్రశ్నిస్తున్నట్లుగా ఉంది. విజయసాయిరెడ్డి పర్ ఫార్మెన్స్ ను జగన్ చూస్తున్నారా లేదా అన్నదే అందరికీ డౌట్. చూస్తే మాత్రం వీసారెడ్డికి మళ్లీ మంచి రోజులు రావొచ్చు.
