వైసీపీ రాజకీయాల్లో ఒక విచిత్రమైన ధోరణి కనిపిస్తోంది. జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాలను తప్పుబట్టిన వారు సొంత చెల్లెలు షర్మిల అయినా, తల్లి విజయమ్మ అయినా, చివరకు సిద్ధాంతాలతో సంబంధం లేకుండా ప్రశ్నించే సీపీఎం లాంటి పార్టీలైనా.. వారందరినీ వెంటనే చంద్రబాబు ఏజెంట్లు గా ముద్ర వేయడం ఆ పార్టీకి అలవాటుగా మారింది. జగన్ కి వ్యతిరేకంగా మాట్లాడితే చాలు, వారు కచ్చితంగా చంద్రబాబు స్క్రిప్ట్ నే అనుసరిస్తున్నారని వైసీపీ నేతలు చేసే విమర్శలు ఇప్పుడు హాస్యాస్పదంగా మారుతున్నాయి. సొంత రాజకీయ అస్తిత్వం కోసం పోరాడే వారిని కూడా ప్రత్యర్థి ఖాతాలో వేయడం అంటే, తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి వెతికే అడ్డదారి వెదుక్కోవడమే .
చంద్రబాబు వెనుక ఎంతకాలం దాక్కుంటారు?
ప్రభుత్వంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రతికూల పరిస్థితులకు చంద్రబాబునే బాధ్యుడిని చేయడం వైసీపీ మార్క్ రాజకీయం. పరిపాలనలో విఫలమైనప్పుడు లేదా ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు ఆ వైఫల్యాన్ని అంగీకరించకుండా ఇదంతా బాబు కుట్ర అని సానుభూతి పొందే ప్రయత్నం గత ఐదేళ్లుగా సాగింది. వివేకా హత్య కేసు లాంటి అత్యంత సున్నితమైన అంశాల్లో కూడా, సాక్ష్యాధారాలతో సంబంధం లేకుండా నెపాన్ని చంద్రబాబు మీదకు నెట్టేయడం ఆ పార్టీ నైతికతను ప్రశ్నార్థకం చేస్తోంది. అబద్ధాన్ని పదే పదే చెబితే నిజమవుతుందనే పాత పద్ధతి ఇప్పుడు సోషల్ మీడియా కాలంలో చెల్లదని వారు గుర్తించడం లేదు.
సొంత అజెండా ఉండదా?
రాజకీయాల్లో ఎవరికైనా సొంత సిద్ధాంతాలు, ప్రయోజనాలు ఉంటాయి. షర్మిల కాంగ్రెస్లో చేరి తన ఉనికి కోసం పోరాడుతుంటే, దానిని కూడా బాబు ఆదేశాల మేరకే జరుగుతోందని అనడం ఆమె వ్యక్తిత్వాన్ని తక్కువ చేయడమే. జగన్కు అనుకూలంగా ఉండకపోవడమే నేరమన్నట్లుగా వైసీపీ కేడర్ వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో సొంత కుటుంబ సభ్యులను కూడా వదలకుండా విమర్శలకు దిగడం ప్రజల్లో అసహనాన్ని కలిగిస్తోంది. అందరూ చంద్రబాబు కోసమే రాజకీయం చేస్తున్నారనే భ్రమలో నుంచి వైసీపీ బయటకు రానంత కాలం, ఆ పార్టీ పతనాన్ని ఆపడం కష్టమే.
పతనానికి దారితీస్తున్న స్క్రిప్ట్ రాజకీయం
ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారు. ఒకప్పుడు ‘నిప్పు లేనిదే పొగ రాదు’ అని నమ్మేవారు, కానీ ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి చంద్రబాబు పేరు వాడటం వల్ల వైసీపీ మాటలకు విలువ తగ్గిపోయింది. రైల్వే జోన్ రాకపోవడానికి బాబు కారణమని, ప్రాజెక్టులు ఆగిపోవడానికి బాబు అడ్డుపడ్డారని చెప్పే సాకులు ఇప్పుడు పని చేయడం లేదు. వాస్తవాలను వదిలేసి, ప్రతిపక్ష నేతనే సర్వశక్తివంతుడిగా చిత్రికరిస్తూ తమ అసమర్థతను దాచుకోవాలని చూడటం వైసీపీ పతనానికి ప్రధాన కారణమైంది. ఇప్పటికైనా ఆ చంద్రబాబు భ్రమ నుంచి బయటపడి వాస్తవ రాజకీయాలు చేయకపోతే, ఆ పార్టీకి పుట్టగతులు ఉండవన్నది నగ్న సత్యం.
