లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశం ఇప్పుడు దేశ రాజకీయాల్లో కీలకంగా మారింది. మహిళా బిల్లు ముసుగులో కేంద్రం ఈ ప్రక్రియను పూర్తి చేయాలనుకుంటోంది. కానీ దీనిపై విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. జాతీయస్థాయిలో కాంగ్రెస్ తరపున కీలక నేతగా మారుతున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాము వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు. జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు జరిగితే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుందని.. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న సమాన శాతం పెంపు వల్ల కూడా అలాంటి అన్యాయమే జరుగుతుందంటున్నారు.
50 శాతం సీట్ల పెంపులోనూ దక్షిణాదికి అన్యాయమే!
కేంద్రం ప్రతిపాదిస్తున్న 50 శాతం పెంపు ఫార్ములా పైకి చూడటానికి న్యాయంగానే కనిపిస్తుంది. అంటే 80 సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్‌కు 120 సీట్లు, 17 సీట్లు ఉన్న తెలంగాణకు 25-26 సీట్లు రావచ్చు. కానీ, ఇక్కడే ఒక సంక్లిష్టమైన గణితం దాగి ఉంది. 50 శాతం పెంచినప్పుడు తక్కువ సీట్లు ఉన్న రాష్ట్రాలకు, ఎక్కువ సీట్లు ఉన్న రాష్ట్రాలకు మధ్య ఉండే సంఖ్యాపరమైన వ్యత్యాసం భారీగా పెరుగుతుంది. ఇది లోక్‌సభలో నిర్ణయాత్మక శక్తిని కేవలం కొన్ని పెద్ద రాష్ట్రాల చేతుల్లోనే కేంద్రీకృతం చేస్తుందన్నది రేవంత్ రెడ్డి లెక్క. దీనివల్ల భవిష్యత్తులో కేవలం ఉత్తరాది రాష్ట్రాలను గెలుచుకుంటే చాలు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరిస్తున్నారు.
రేవంత్ డిమాండ్లలలో రెచ్చగొట్టే రాజకీయం కూడా
రేవంత్ రెడ్డి చేస్తున్న వాదనలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాలన్నీ ఎప్పుడూ ఒకే పార్టీకి ఓటు వేయవు. అక్కడ కూడా ప్రాంతీయ పార్టీలు, విభిన్న రాజకీయ సమీకరణలు ఉంటాయి. అలాగే, దక్షిణాది ఆర్థికంగా బలంగా ఉందన్న కారణంతో,కుటుంబ నియంత్రణ పాటించామన్న సాకుతో.. జనాభా నిష్పత్తిని కాదని అత్యధిక సీట్లు ఆశించడం కూడా ప్రజాస్వామ్య సూత్రాలకు కొంత విరుద్ధంగా అనిపిస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఒక ఓటు – ఒకే విలువ అనే రాజ్యాంగ ప్రాతిపదికను కాదనడం సంక్లిష్టమైన చర్చకు దారితీస్తుంది.
హైబ్రీడ్ మోడల్ ప్రతిపాదించిన రేవంత్
రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్ జనాభాతో పాటు జీఎస్డీపీని పరిగణనలోకి తీసుకోవడం ఒక కొత్త ఆలోచనకు పునాది వేసింది. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న రాష్ట్రాలకు రాజకీయంగా ప్రాధాన్యత తగ్గకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. కేవలం జనాభాను పెంచుకుంటూ పోయే రాష్ట్రాలకే రాజకీయ అధికారం దక్కుతుందనే సంకేతం వెళ్తే, అది అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల ఉత్సాహాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. మహిళా రిజర్వేషన్ బిల్లు ముసుగులో కేంద్రం డీలిమిటేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలనుకోవడంపై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. ఏ ప్రాతిపదికన సీట్లు పెంచాలనే విషయంలో అన్ని రాష్ట్రాలతో, రాజకీయ పక్షాలతో సుదీర్ఘమైన చర్చ జరగాలి. ఉత్తరాది, దక్షిణాది అనే భావజాలం బలపడటం దేశ సమగ్రతకు మంచిది కాదు.
డీలిమిటేషన్ అనేది కేవలం అంకెల గారడీ కాదు, అది దేశ రాజకీయ సమతుల్యతకు సంబంధించిన అంశం. రేవంత్ రెడ్డి మాటలు ఈ విషయంలో విస్తృత చర్చ జరగాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించి, దక్షిణాది రాష్ట్రాల్లో నెలకొన్న అభద్రతా భావాన్ని తొలగించకపోతే .. పరిష్కరించలేని పెద్ద సమస్యలే వస్తాయి.
