ఎగ్జిబీటర్లు, నిర్మాతల మధ్య ఇప్పుడు చిన్న `గీత` ఏర్పడింది. వాళ్లేమో పర్సంటేజీ విధానం లేకుండా సినిమాల్ని ఆడనివ్వం అంటున్నారు. నిర్మాతలేమో.. రెంటల్ పద్ధతిలోనే సినిమాల్ని రిలీజ్ చేస్తామంటున్నారు. ఈ గొడవ తేలేలా లేదు. మంగళవారం ఎగ్జిబీటర్లు ఓ సమావేశం ఏర్పాటు చేసి, తమ షరతుల్ని కాస్త గట్టిగానే వినిపించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు నిర్మాతల వంతు వచ్చింది. ఈ విషయమై నిర్మాతలు కూడా తమ గొంతు విప్పుతున్నారు. అందులో భాగంగా ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియలో, ముఖ్యంగా ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.
”రూపాయి ఆదాయం అందరికీ పోయింది, పెద్ద సినిమాలకు కూడా ఆదాయం రూపాయి నుంచి అర్ధరూపాయికి పడిపోయింది. ఈరోజు సినిమాలు వందల కోట్లు కలెక్ట్ చేస్తున్నాయని మనం చూస్తున్నాం. కానీ ఆ కలెక్షన్లు నిజంగా ప్రేక్షకుల సంఖ్య పెరగడం వల్ల వచ్చినవి కాదు; టికెట్ రేట్లు, ఇతర ధరలు పెరగడం వల్ల వచ్చినవని మనందరం అర్థం చేసుకోవాలి. అంటే, సగటు ప్రేక్షకుడు థియేటర్‌కు రావడం తగ్గిపోయింది. వచ్చే కొద్దిమంది ప్రేక్షకుల మీదే అధిక భారం వేసి వసూళ్లు పెంచుకుని, దాన్నే భారీ కలెక్షన్లు అని చెప్పుకోవడం కన్నా పెద్ద తెలివితక్కువతనం ఇంకొకటి ఉండదు” అని ట్వీట్ చేశారు బన్నీ వాస్.
అంతే కాదు.. చిన్న సినిమాల పరిస్థితి ఇంకా దారుణంగా ఉందని, వారి ఆదాయం పావలా స్థాయికి పడిపోయిందని, ఇప్పుడు ఆ పావలాలో ఎవరు ఎంత తీసుకోవాలి అని మనం కొట్టుకుంటున్నామనీ, అసలు మన రూపాయి ఆదాయం ఎందుకు పోయిందో మాత్రం మర్చిపోతున్నామని వ్యాఖ్యానించారు.
”ఇక్కడ నిర్మాతలు నష్టపోతున్నారు. అదే విధంగా సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు కూడా నష్టపోతున్నారు, ఇది వాస్తవం. ఇందులో ఎలాంటి సందేహం లేదు.
కానీ ఈ పరిస్థితికి అసలు మూలకారణం ఏమిటి? ఉన్న ఆదాయంలో ఎవరు ఎంత పంచుకోవాలి అని వాదించుకోవడం కంటే, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది గుర్తించి దాన్ని సరిచేసుకోవడం ముఖ్యమా కాదా?” అని ప్రశ్నించారు బన్నీవాసు.
దాంతో పాటుగా కొన్ని కారణాలూ బయట పెట్టారు.
1. హీరోలు సినిమాలు పూర్తి చేయడానికి చాలా ఎక్కువ సమయం తీసుకోవడం. సగటు ప్రేక్షకుడిని థియేటర్‌కు తీసుకురావడంలో హీరోల పాత్ర చాలా ముఖ్యమని ఎవరు అవునన్నా, కాదన్నా ఇది నిజం. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమలో ప్రేక్షకుడిని థియేటర్‌కు రప్పించడంలో హీరోల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఇండస్ట్రీలో హీరోలు రెండు సంవత్సరాలకు ఒక సినిమా మాత్రమే చేస్తే, ప్రేక్షకుడికి సినిమాలపై ఆసక్తి క్రమంగా తగ్గిపోతుంది. దాని ప్రభావం కేవలం పెద్ద సినిమాలపైనే కాదు, చిన్న సినిమాల మీద కూడా పడుతుంది.
2. సినిమాలను కేవలం 27 రోజుల్లోనే OTTలో విడుదల చేయడం వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిపోవడం.
3. ప్రేక్షకులను ఆకట్టుకునే స్థాయి కంటెంట్ లేకపోవడం. “ఇంత ఖర్చు పెట్టి థియేటర్‌కు వెళ్లాల్సిన అవసరమా?” అనే భావన ప్రేక్షకుల్లో రావడం.
4. మల్టీప్లెక్సుల్లో అధిక క్యాంటీన్ ధరలు.
ఈ నాలుగు కారణాల్లో మూడు కారణాలు మన చేతిలోనే ఉన్నాయి. కంటెంట్ విషయం మాత్రమే పూర్తిగా మన నియంత్రణలో ఉండదంటూ కుండ బద్దలు కొట్టే ప్రయత్నం చేశారు. ఈ మూడు అంశాలను సరిచేయకుండా, ఎంత శాతం పంచుకోవాలి అని వాదించుకున్నా ఉపయోగం లేదని హితవు పలికారు. ”మూల సమస్యను సరిచేయకుండా, ఇప్పటికే తగ్గిపోయిన ఆదాయం మీదే పోరాడటం వల్ల ఏం లాభం చేకూరుతుంది?” అని సూటి ప్రశ్నలే సంధించారు బన్నీ వాసు. మరి దీనిపై నిర్మాతలు ఏమంటారు? హీరోలు స్పందిస్తారా? అసలు ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా, లేదా? అనేదే ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చనీయాంశం అవుతోంది.
