చిత్రసీమలో పర్సంటేజీ – రెంటల్ విధానాలపై పీటముడి రోజు రోజుకీ బిగుసుకొంటోంది. రెంటల్ మీదే సినిమాలు ఆడిస్తామంటూ నిర్మాతలు, పర్సంటేజీ ఇస్తే తప్ప కుదరదని ఎగ్జిబీటర్లు పట్టుపట్టారు. ఉమ్మడి సమావేశాలు, చర్చలు, కమిటీ నియామకాలు జరిగినా.. ఒక రాజీకి రావడం వీలు కావడం లేదు. ఎగ్జిబీటర్లు మీటింగు పెట్టి… ‘పెద్ది’ కి కూడా పర్సంటేజీ కావాల్సిందే అంటూ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం ఇప్పుడు మెగాస్టార్ ముందుకు వెళ్లబోతోంది. ఈరోజు ఎగ్జిబీటర్లంతా చిరంజీవిని కలిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మెగాస్టార్ కి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. చిరు పెద్దరికంతో అయినా ఈ సమస్య పరిష్కారం అవుతుందన్నది వాళ్ల ఆశ.
ఈ పీటముడి విప్పడం చిరుకీ కష్టమే. ఎందుకంటే ముందున్నది తనయుడి సినిమా. ‘పెద్ది’ ని మినహాయించండి అని అడగలేరు. పర్సంటేజీ ఇవ్వాల్సిందే అంటూ ఎగ్జిబీటర్ల తరపున మాట్లాడలేరు. బరిలో మరో సినిమా ఉంటే.. చిరు దగ్గర పరిష్కారం దొరికేదేమో?
ఎగ్జిబీటర్లకు పర్సంటేజీ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే… ఎంత ఇవ్వాలి అనేదానిపై నిర్మాతల్లో చర్చలు జరుగుతున్నాయి. చాలామంది నిర్మాతలు పర్సంటేజీకి ఒప్పుకోవడం లేదు. ఒకవేళ ఇచ్చినా 10 నుంచి 15 శాతం మాత్రమే ఉండాలని పట్టుపడుతున్నారు. 15 శాతం ఇచ్చినా, బయ్యర్లకు, నిర్మాతలకు రావాల్సిన రాబడిలో కోత పడుతుంది. పెద్ద సినిమాలకు అది మరింత కష్టం.
ఎగ్జిబీటర్లతో పాటు నిర్మాతలు కూడా మెగాస్టార్ ని కలిసే అవకాశం ఉంది. పర్సంటేజీ ఇస్తే తమకు వాటిల్లే నష్టం గురించి మెగాస్టార్ కి వివరించడానికి నిర్మాతల బృందం ప్రయత్నిస్తోంది. మెగాస్టార్ కూడా కొంతమంది నిర్మాతలకు టచ్లో ఉన్నట్టు టాక్. ఛాంబర్ లో ఏం జరుగుతుంది? ఎవరు ఎటువైపు ఉన్నారు? అనే విషయాలపై చిరు కూడా ఆరా తీస్తున్నారు. కాకపోతే ఈ విషయమై ఆయన ఇప్పటి వరకూ నోరు మెదపలేదు.
