స్వాతంత్ర్య యోధుల కుటుంబం నుంచి అల్ ఖైదాలోకి !

కొన్ని వార్తలు చేదుగా ఉంటాయి. ఇలా ఎలా జరిగిందబ్బా ! అంటూ ఆశ్చర్యపోతూనే గుండె బరువెక్కేలా బాధపడుతుంటాము. అలాంటి వార్తే ఇది. దేశ రాజధానికి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న శాంభాల్ లో స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న ఒక ముస్లీం కుటుంబం నుంచి చాలా సంవత్సరాల క్రిందట ఒక కుర్రాడు ఇల్లు విడిచివెళ్ళిపోయి ఇప్పుడు ఉగ్రవాద సంస్థ (అల్ ఖైదా)లో పెద్ద ర్యాంక్ లో చేరిపోయాడు. ఇప్పుడతను అల్ ఖైదా భారత శాఖకు చీఫ్ గా నియమితులయ్యాడని నిఘావర్గాలు చెబుతున్నాయి. ఈ కుర్రాడు మనదేశంలో ఉన్నప్పుడు అతని పేరు సాన్యుల్ హక్. దేశం విడిచివెళ్ళినప్పుడు కుర్రాడే కానీ ఇప్పుడు అతనికి 40ఏళ్లు. పేరుమార్చుకున్నాడు. అతనిప్పుడు AQIS (అల్ ఖైదా భారత ఉపఖండశాఖకు) ప్రధాన నాయకుడయ్యాడట. భద్రతా దళాలు గాలిస్తున్న మోస్ట్ వాంటెడ్ వ్యక్తి .

ఈ విషయం తెలియగానే ఉత్తరప్రదేశ్ లోని శాంభాల్ లోని హక్ కుటుంబం అంతగా ఆశ్చర్యపోలేదు. షాక్ కి గురికాలేదు. ఎందుకంటే, వాళ్ల దృష్టిలో ఇతగాడు ఆరేళ్ల క్రిందటే చనిపోయినట్లు లెక్క. అప్పట్లో స్థానిక ఇంటిలిజెన్స్ వర్గాలు ఈ కుర్రాడు ఉగ్రవాద సంస్థలో చేరిపోయాడని చెప్పినప్పుడే కుటుంబసభ్యులు వాడిపై ఆశలు వదులుకున్నారు. ఇతని తల్లికి ఇప్పుడు 70ఏళ్లు. తండ్రికి 75 ఏళ్లు. 2009నాటికే ఈ కుర్రాడు ఇంటినుంచి తప్పిపోయి 14ఏళ్లయింది. కనిపించకుండా పోయిన కుర్రాడు పాకిస్తాన్ లో ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాలో చేరాడని 2009లో తెలుసుకున్ననాటి నుంచి తమకు కొడుకు పుట్టలేదనే అనుకుంటున్నారు తల్లిదండ్రులు.

సాన్యుల్ హక్ చిన్నప్పటి నుంచి పుస్తకాల పురగు. ఒకరోజు తాను మదరసాలో ఖురాన్, అరబిక్ భాష అధ్యయనం చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. అప్పటినుంచి అతనిలో మార్పు వచ్చింది. 1995లో ఇంట్లోవాళ్లను లక్షరూపాయలు ఇమ్మని సతాయించడం మొదలుపెట్టాడు. ఆ డబ్బుతో తాను పైచదువుల కోసం మక్కాకు వెళతానని అనేవాడని తండ్రి ఇర్ఫాన్ ఉల్ హక్ చెప్పారు. స్థానిక కాలేజీలో చదువుకోమనో, లేదా ఉద్యోగం చేసుకోమనో కుటుంబసభ్యులు చెప్పేవారు. కానీ ఈ కుర్రాడు వినలేదు. అతని మేనమామ చావగొట్టాడు. అయినా ప్రయోజనం లేదు. ఇతగాడి మొండితనం చూసి వీడేమవుతాడోనని భయపడ్డారు. ఈ భయంలో నిజం ఉన్నదని తర్వాత తేలిపోయింది. తర్వాత కొద్దిరోజులకే ఇంటినుంచి వెళ్ళిపోయాడు. 14ఏళ్ల తర్వాత ఇతనిపై ఉగ్రవాద ముద్రపడిందని సెక్యూరిటీ నిఘావర్గాలు చెప్పేవరకు వారికి తమ కుర్రాడి జాడే తెలియలేదు. ఎప్పుడైతే తమ కొడుకు ఉగ్రవాద సంస్థలో చేరిపోయాడని తెలుసుకున్నారో, అప్పటినుంచి అతను చచ్చినట్లే అనుకున్నారు. పాకిస్తాన్ వెళ్ళిన సాన్యుల్ హక్ అంచెలంచెలుగా ఉగ్రవాద సంస్థల్లో ఎదుగుతూ అల్ ఖైదా లో కీలకస్థానానికి చేరుకున్నారని నిఘావర్గాలు ఇప్పుడు చెబుతున్నా, ఆ వృద్ధ తల్లిదండ్రుల్లో చలనం లేదు. ఆ చూపులు నిస్తేజంగా ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com