మారుతికి అడ్డుప‌డ్డ త్రివిక్ర‌మ్‌

`శైల‌జా రెడ్డి అల్లుడు` త‌ర‌వాత‌… మారుతి సినిమా ఏంట‌న్న‌ది ఇంత వ‌ర‌కూ తేల‌లేదు. నిజానికి సినిమా త‌ర‌వాత సినిమాని ప‌ట్టాలెక్కించి.. తీరిక లేకుండా చూసుకోవ‌డం మారుతి స్పెషాలిటీ. ఈసారి మాత్రం అలా కుద‌ర్లేదు. మారుతి గీతా ఆర్ట్స్ లో ఓ సినిమా చేయాలిప్పుడు. ఆయ‌న దృష్టి అల్లు అర్జున్‌పై ఉంది. బ‌న్నీకి కూడా మారుతి అంటే గురి. `భ‌లే భ‌లే మ‌గాడివోయ్` చూశాక‌… `ఎప్పుడైనా స‌రే నాకు క‌థ చెప్పు… సినిమా చేయ‌డానికి నేను రెడీగా ఉన్నా` అంటూ ఓపెన్ ఆఫ‌ర్ ఇచ్చేశాడు. ఇప్పుడెలాగూ గీతా ఆర్ట్స్ లోనే సినిమా క‌దా, అని బ‌న్నీ కోసమే క‌థ రెడీ చేసే ప‌నిలో ప‌డ్డారు. అయితే… బ‌న్నీ ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో మారుతితో సినిమా చేయ‌లేడు. ఎందుకంటే.. ముందు త్రివిక్ర‌మ్ సినిమాని పూర్తి చేయాల్సివుంటుంది.

కానీ సీన్ రివ‌ర్స్ అయి.. త్రివిక్ర‌మ్ సినిమా వాయిదా ప‌డే ప‌రిస్థితులు క‌నిపించాయి. క‌థ సెట్ అవ్వ‌క‌పోవ‌డం, ముందుగా అనుకున్న రీమేక్ క‌థ‌ని ప‌ట్టాలెక్కించ‌డానికి త్రివిక్ర‌మ్ ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌డంతో… ఈ సినిమా ఉండ‌దేమో అనుకున్నారు. ఒక‌వేళ అటూ ఇటూ అయి రెండు మూడు నెల‌ల గ్యాప్ వ‌స్తే గ‌నుక‌.. ఈ మ‌ధ్య‌లో మారుతి సినిమాని ప‌ట్టాలెక్కించొచ్చ‌న్న‌ది బ‌న్నీ ప్లాన్‌. మారుతి కూడా ఆఘ‌మేఘాల పై స్క్రిప్టుని సిద్ధం చేసే ప‌నిలో ప‌డ్డారు. అయితే అనూహ్యంగా… త్రివిక్ర‌మ్ కి ఓ మంచి క‌థ దొరికేసింది. దానికి బ‌న్నీ కూడా ప‌చ్చ‌జెండా ఊపేశాడు. దాంతో బన్నీ – త్రివిక్ర‌మ్ లైన్ క్లియ‌ర్ అయిపోయింది. మారుతి మ‌ళ్లీ ఎదురు చూపుల్లో ప‌డిపోయాడు. బ‌న్నీతో మారుతి సినిమా త‌ప్ప‌కుండా ఉంటుంది. కానీ.. ఎప్పుడ‌న్న‌ది ఇప్పుడు చెప్ప‌లేని ప‌రిస్థితి. కానీ మారుతి ప్ర‌యత్నాలు మాత్రం ఆగ‌లేదు. బ‌న్నీ స్క్రిప్టుని పూర్తి చేశాకే… మ‌రో క‌థ‌పై కూర్చోవాల‌ని డిసైడ్ అయ్యార్ట‌. 2019లో ఎలాగైనా ఈ కాంబో ప‌ట్టాలెక్కుతుంద‌ని గీతా ఆర్ట్స్ వ‌ర్గాలు చెబుతున్నాయి. బ‌హుశా త్రివిక్ర‌మ్ సినిమా అయ్యాక‌.. మారుతికే ఛాన్స్ రావొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.