ఎడిటర్స్ కామెంట్ : నోరు మంచిదైదేనే రాజకీయం మంచిది !

” నువ్ పనికి మాలిన వాడివి ” అని ఎవరినైనా అని చూడండి. అతను మళ్లీ అంత కంటే రెండు మాటలు ఎక్కువే అంటాడు. అంటే అన్న వాడితో పాటు మాట పడినవాడూ అదే భాష వాడతాడు. ఒక వేళ వాడకపోతే వాడిని చేతకాని వాడిగా జత కట్టేస్తారు పక్కన వాళ్లు. అలాంటి పరిస్థితి తెచ్చుకోవాలని ఎవరూ అనుకోరు. రాజకీయాల్లో అసలు అనుకోరు. ఒకరు తమలపాకుతో ఒకటి అంటే మరొకరు తలుపుచెక్కతో రెండు అంటారు. అది అలా పెరిగిపోతూనే ఉంటుంది. ఎక్కడా అంతం ఉండదు. ప్రస్తుతం ఆ పరిస్థితి తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కనిపిస్తోంది. ఎంత దారుణంగా అంటే మద్యం దుకాణాల వద్ద పచ్చి తాగుబోతులు తిట్టుకునే తిట్లు కూడా దిగదిడుపే అన్నట్లుగా రాజకీయనేతలు నోటి దురుసు చూపించుకుంటున్నారు. నోరు మంచిది కాదు కాబట్టి తమ రాజకీయం కూడా మంచిది కాదని నిరూపిస్తున్నారు.

ప్రత్యర్థిని ఓడించడం అంటే తిట్టడం కొట్టడం కాదు..!

రాజకీయంలో ప్రత్యర్థిని ఓడించాలంటే ప్రజలను మెప్పించాలి. ప్రత్యర్థి కన్నా తను గొప్ప అని ప్రజలకు నమ్మకం కలిగించి ఓట్లు వేయించుకుని గెలవాలి. అది గెలుపు. అంతే కానీ ప్రత్యర్థిని బండబూతులు తిట్టేసి వీలైతే కొట్టేస్తానని బెదిరించి.. చచ్చిపో అని శాపనార్ధాలు పెట్టి అతన్ని మానసికంగా వేధిస్తున్నా అని సంబర పడిపోవడం రాజకీయం కాదు. దురదృష్టవశాత్తూ ప్రస్తుత రాజకీయాల్లో ప్రజల పాత్రను చాలా తక్కువగా రాజకీయ నేతలు అంచనా వేస్తున్నారు. ప్రజలు తమ ప్రవర్తనను పరిగణనలోకి తీసుకుని ఓట్లేయరని భావిస్తున్నారు. అందుకే గీత దాటిపోతున్నారు. గతంలో రాజకీయ విమర్శలు ఓ మాదిరి హద్దు దాటినా ప్రజల్లో విస్తృత చర్చ జరిగేది . కానీ ఇప్పుడు అందరు నేతలు అదే బాట పట్టారు. చివరికి ప్రజలు కూడా అసహ్యించుకునే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం రాజకీయ ప్రత్యర్థి అంటే వ్యక్తిగత శత్రువే. దానికి తగ్గట్లుగానే రాజకీయ విమర్శలు చేయాలి. చేస్తున్నారు. ఫలితంగా వారి మధ్య శుత్రత్వ స్థాయి దారుణమైన తిట్లు తిట్టుకునే వరకూ వెళ్తుంది. ఎంత వరకూ అంటే ఎదురుపడికే కొట్టడం ఖాయం అన్న హెచ్చరికలు కూడా అందులో ఉన్నాయంటే పరిస్థితి ఎక్కడి వరకూ వెళ్లిందో అర్థం చేసుకోవడం పెద్ద కష్టం కాదు.

“అమ్మనా బూతులు” తిట్టడమే రాజకీయ ప్రతీకారం !

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలుతమ స్వామిభక్తిని ప్రదర్శించుకునేందుకు వరుసగా రంగంలోకి దిగారు. తమకు తెలిసిన భాషా ప్రావీణ్యాన్ని ప్రయోగించారు. అంతకు ముందు తెలుగుదేశం పార్టీ నేత అయ్యన్నపాత్రుడు సీఎం జగన్‌ను ఏదో అన్నారంటూ చంద్రబాబు ఇంటి మీదకు అనుచరుల్ని తీసుకెళ్లిన జోగి రమేష్ అనబడే గౌరవనీయమైన ఎమ్మెల్యే .. అక్కడ మాట్లాడిన భాషను అన్ని చానళ్లు బీప్ సౌండ్ లేకుండానే ప్రసారం చేశాయి. ఆయన గురించి అందరికీ తెలిసేలా చేశాయి. ఇది మొదలు కాదు … కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ వంటి వారు నోరు తెరిస్తే టీవీ చానళ్లు పెట్టిన వారు కూడా మార్చుకోవాల్సిందే. అంత దారుణమైన భాషను ఎలా ఉపయోగిస్తారో.. ఎలా ఉపయోగించాలని అనుకుంటారో.. అంత దారుణమైన మనస్థత్వం ప్రజా సేవలో ఉన్న వారికి ఎలా వస్తుందో అంచనా వేయడం కష్టం.

దిగజారే కొద్దీ దిగజారిపోతున్న సంస్కారం !

” ఇంత కన్నా దిగజారడానికి ఏమీ లేదు అనుకున్న ప్రతీ సారి ఇంకా ఇంకా దిగజారిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ” ఓ సినిమాలో డైలాగ్‌. ప్రస్తుత రాజకీయ భాషకు అన్వయించుకుంటే ప్రతి ఒక్కరికి ఇదే భావన కలుగుతుంది. ఫలనా వాళ్లు అంత దారుణంగా తిట్టారు.. ఇక అంత కంటే ఘోరంగా ఎవరూ తిట్టలేరు అనుకుంటే అంచనాలను మించి ఎదుటి వాళ్లు తిట్లు వినిపిస్తున్నారు. సాధారణంగా ప్రతి రాజకీయ నేత…ఎంత రాజకీయప్రత్యర్థి అయినా సంబోధించేటప్పుడు గారు అనే సంభోధిస్తారు.కానీ ఇప్పుడు అది గాడు అయిపోయింది. మంత్రి హోదాలో గౌరవంగా మాట్లాడాల్సిన పేర్ని నాని గాడు..వాడు.. కాపు నా.. కో..అంటూ మీడియా ముందు చెలరేగిపోయారు. అవన్నీ ప్రత్యక్ష ప్రసారాలు. ఆ మత్రి మాటలు విని ఆయన పార్టీ అభిమానులు.. లైక్ మైండెడ్ పీపుల్ అహో.. ఒహో అనుకున్నారేమో కానీ.. సభ్యత సంస్కారం ఉన్న వారెవరూ హర్షించరు. ఇప్పుడు రాజకీయ విమర్శలు అనడం కన్నా రాజకీయ బూతులు అని చెప్పడం కరెక్ట్. విమర్శల కంటే ఎంతో దిగువన ఉంటున్నాయి అవి. దిగజారిపోయి తిట్ల స్థాయికి వచ్చాయి. ఒక్క పవన్ కల్యాణ్‌నే కాదు ప్రతిపక్ష నేత చంద్రబాబును ఎంత దారుణంగా తిట్టారో కళ్ల ముందే ఉంది. ఒక్కొక్కరు ఒక్కో రకమైన భాషా ప్రావీణ్యం ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా ప్రజల చెవులకు చిల్లులు పడేలా తిట్ల భాష వినపడుతోంది.

అసెంబ్లీలోనూ అదే భాషా సంస్కారం !

అసెంబ్లీ అంటే పవిత్రమైనది. అక్కడ మాట్లాడాలంటే ఎంతో రీసెర్చ్ చేసి వస్తారు. కానీ ఇప్పుడు అక్కడా పరిస్థితి మారిపోయింది. తన ఇష్టం లేని రాజకీయ నేతల్ని బండబూతులు తిట్టించేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ సాక్షాత్తూ శాసనసభలోనే సభలో సభ్యుడు కాని వ్యక్తి.. దేశ అత్యున్నత చట్టసభ అయిన లోక్‌సభలో సభ్యుడు అయిన రఘురామపై మద్యం దుకాణాల వల్ల మాట్లాడుకునే భాషను ప్రయోగించారు. అసెంబ్లీ సమావేశాలు చూస్తున్న వారు… మనం వింటున్నది నిజమేనా … అని తమను తాము గిల్లి చూసుకోవాల్సిన భాష. వైసీపీ నేతలు ప్రెస్‌మీట్లలో టీడీపీ నేతలపై వినిపించే నాటు తెలుగు కన్నా దారుణమైన పదాలు అందులో ఉన్నాయి. ఆయనను ముఖ్యమంత్రి కూడా అదుపు చేయలేదు. ఆయన మాట్లాడుతున్నంత సేపు చిద్విలాసంగా చూస్తూ ఉండిపోయారు. దాని కోసమే కదా జోగి రమేష్ అలాంటి మాటలు మాట్లాడింది. అధినేతకే అలాంటివి ఇష్టం అయితే ఇక ఫాలో అయిపోవడానికి అనుచరులు ఎందుకు మొహమాట పడతారు. వైసీపీ నేతలు ఇంటా బయటా… అలాగే పవిత్రమైన అసెంబ్లీలోనూ అలాంటి భాషను రెండేళ్ల నుంచి మాట్లాడుతున్నారు. రాజకీయ ప్రత్యర్థుల్ని అలా తిడితే ఏమొస్తుందో కానీ.. గతంలో కాస్త డిగ్నిటీ ప్రదర్శించేవారు కూడా ఆ పార్టీలో చేరిన తర్వాత దారుణమైన భాషను మాట్లాడుతూంటారు. అయితే.. అక్కడ హైకమాండ్‌ను మెప్పించాలంటే.. అలాగే మాట్లాడాలని వైసీపీ నేతలు చెబుతూ ఉంటారు. అలా మాట్లాడిన వారికే ప్రోత్సాహం ఉంటుందని కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి.

తెలంగాణ రాజకీయ నేతలదీ అదే భాష !

ఒక్క ఏపీలోనే కాదు.. తెలంగాణలోనూ అంతే ఉంది. గతంలో కేసీఆర్ మాత్రమే ఆ భాష వాడేవారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ అరవింద్ సహా అందరూ అదే భాష వాడుతున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే మాకు నేర్పింది కేసీఆరే అనడం ప్రారంభించారు. కేసీఆర్ ట్రేడ్‌ మార్క్ విమర్శ సన్నాసి. గతంలో ఆ మాట అనేవారు. ఇప్పుడు ఆయనను అందరూ అంటున్నారు. అలా అంటున్నారని .. ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహావేశాలకు లోనవుతున్నారు. అయితే మీరు నేర్పిన విద్యనే కదా నీరజాక్ష అంటున్నారు ఇతర నేతలు. అందుకే ఇప్పుడు తెలంగాణలోనూ తిట్ల భాష ఎక్కువగానే ఉంది. కానీ ఏపీలో మాత్రం ఇంకా ఇంకా హద్దులు మీరి పోతోంది. అధికార పార్టీల అగ్రనేతలు కూడా తమ వారిని వారించడం లేదు. అలాగే సమాధానం ఇవ్వాలన్నట్లుగా వారు సైలెంట్‌గా ఉండటంతో తమ భాషా ప్రావీణ్యాన్ని ప్రదర్శించే వారి సంఖ్య పెరిగిపోయింది. ముందు ముందు మరింత మంది అదే బాటలో పయనించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అదే జరిగితే రాజకీయం అంటేనే ప్రజలు అసహ్యించుకుంటారు. రాజకీయ నేతలంటే విలువ లేకుండా పోతుంది.

రాజకీయాన్ని గొప్ప స్థాయికి తీసుకెళ్లొద్దు.. కానీ దిగజార్చవద్దు ప్లీజ్ !

రాజకీయ వ్యవస్థ కుళ్లిపోయిందని.. దాన్ని బాగు చేస్తానని ప్రతిపక్ష నేత హోదాో పాదయాత్ర చేసినప్పుడు ప్రతీ చోటా తన ప్రసంగంలో జగన్మోహన్ రెడ్డి చెప్పేవారు. బహుశా ఆయన బాగు చేయడం అంటే… బూతులతో సంస్కరించడం ఏమో అని ఇప్పుడు ప్రజలు అనుకోవాల్సి వస్తోంది. తమ పార్టీ నేతల్ని తిట్టమని ప్రోత్సహించడం.. ఎవరైనా ఎదురు తిడితే వారిపై కేసులు పెట్టి లోపలేయించడమే .. గొప్ప రాజకీయ వ్యవస్థ కావొచ్చేమో కానీ.. రేపు అధికారం మారితే వారు తిట్టడం నుంచి అడ్వాన్స్ అయి కొట్టడం ప్రారంభిస్తే వ్యవస్థ మరింత దిగజారిపోతుంది. ప్రజాస్వామ్యం అధికారం ఉన్న వాడి చేతిలో బందీ అయిపోతే ఎవరికీ రక్షణ ఉండదు. ఇప్పుడు అలాంటి దుర్భర పరిస్థితే కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స్మూత్ గా ఓట్ల బదిలీ ఖాయం – ఫలించిన కూటమి వ్యూహం !

ఏపీలో ఎన్డీఏ కూటమి మధ్య ఓట్ల బదిలీ సాఫీగా సాగిపోయే వాతావరణం కనిపిస్తోది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలని అనుకున్నప్పుడు చాలా మంది ఓటు బదిలీపై...

బెట్టింగ్ రాయుళ్ల టార్గెట్ ప‌వ‌న్‌!

ఏపీ మొత్తానికి అత్యంత ఫోక‌స్ తెచ్చుకొన్న నియోజ‌క వ‌ర్గం పిఠాపురం. ప‌వ‌న్ క‌ల్యాణ్ అక్క‌డి నుంచి పోటీ చేయ‌డంతో పిఠాపురం ఒక్క‌సారిగా టాక్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్ అయ్యింది. గ‌త ఎన్నిక‌ల్లో భీమ‌వ‌రం,...

ప్రధాని రేసులో ఉన్నా : కేసీఆర్

ముఖ్యమంత్రి పదవి పోతే పోయింది ప్రధానమంత్రి పదవి కోసం పోటీ పడతానని కేసీఆర్ అంటున్నారు. బస్సు యాత్రతో చేసిన ఎన్నికల ప్రచారం ముగియడంతో .. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ...

ఎక్స్ క్లూజీవ్‌: ర‌ణ‌వీర్‌, ప్ర‌శాంత్ వ‌ర్మ‌… ‘బ్ర‌హ్మ‌రాక్ష‌స‌’

'హ‌నుమాన్' త‌రువాత ప్ర‌శాంత్ వ‌ర్మ రేంజ్ పెరిగిపోయింది. ఆయ‌న కోసం బాలీవుడ్ హీరోలు, అక్కడి నిర్మాణ సంస్థ‌లు ఎదురు చూపుల్లో ప‌డిపోయేంత సీన్ క్రియేట్ అయ్యింది. ర‌ణ‌వీర్ సింగ్ తో ప్ర‌శాంత్ వ‌ర్మ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close