వైసీపీ ఇప్పుడు ఒక వింతైన స్థితిలో ఉంది. అమరావతిపై పార్లమెంటులో బిల్లు పాస్ అవుతుంటే, ప్రజల దృష్టి మళ్లించడానికి జగన్ రెడ్డి మావిగన్ అనే కొత్త పేరును తెరపైకి తెచ్చారు. ఇది చూసి కూటమి నేతలు షాక్ అయ్యారని, తన ట్రాప్‌లో పడిపోయారని వైసీపీ సోషల్ మీడియా బాట్లు తెగ ప్రచారం చేస్తున్నాయి. కానీ నిజం ఏమిటంటే, తనను తాను కొట్టుకునే పోతరాజులా.. జగన్ రెడ్డి అసంబద్ధమైన ప్రతిపాదనలతో తన పరువును తానే బజారున పెట్టుకున్నారు. ఒకప్పుడు మూడు రాజధానులు అని రచ్చ చేసి, ఇప్పుడు ఉన్నట్టుండి ఈ మావిగన్ ఏమిటో కనీసం ఆయన పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి కూడా అర్థం కావడం లేదంటే పరిస్థితి ఎంత హాస్యాస్పదంగా ఉందో ఊహించుకోవచ్చు.
కూటమి పడింది ట్రాప్ లో కాదు.. నవ్వుల లో!
వైసీపీ అంటున్నట్లు కూటమి డైవర్ట్ అవ్వలేదు, ఎంజాయ్ చేస్తోంది! జగన్ రెడ్డి గారు ఎంతలా దిగజారిపోయి మాట్లాడుతున్నారో ప్రజలకు చూపించడానికి ఇదొక మంచి అవకాశమని టీడీపీ భావిస్తోంది. అమరావతి పనులు ఆగలేదు, నిధుల ప్రవాహం తగ్గలేదు, పార్లమెంటులో చట్టబద్ధత ఆగిపోలేదు. మరి ట్రాప్ ఎక్కడ ఉంది? జగన్ రెడ్డి వేసిన ఈ జోకర్ వేషాల వల్ల అమరావతి క్రెడిట్ ఏమాత్రం తగ్గకపోగా, ఆయన రాజకీయ అపరిపక్వత మరోసారి బహిర్గతమైంది. పారిశ్రామికవేత్తలను భయపెట్టాలని చూసి, చివరకు తన పార్టీ క్యాడర్‌నే అయోమయంలోకి నెట్టేశారు.
మావిగన్.. అంటే మా వినాశనానికి మేమే గన్ !
ఐదేళ్ల పాటు అధికారం ఉన్నప్పుడు లేని ఈ మావిగన్ జ్ఞానోదయం, ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేని సమయంలో కలగడం విశేషం. మచిలీపట్నం నుంచి గుంటూరు దాకా కలుపుతామంటున్న ఈ 110 కిలోమీటర్ల కారిడార్ ఐడియా వినడానికి బాగున్నా, అది అమరావతిని చంపడానికి వేసిన కుట్ర అని సామాన్యుడికి కూడా అర్థమవుతోంది. సొంత పార్టీ వారే ఈ పేరు విని నవ్వుకుంటుంటే, ఇది ఒక మేధావి ఆలోచన అని నమ్మబలకడం జగన్ రెడ్డికే సాధ్యం. నిజానికి జగన్ తన చుట్టూ తానే ఒక ట్రాప్ గీసుకున్నారు. రేపు పొద్దున మళ్లీ ఎన్నికలకి వెళ్తే.. అమరావతి అంటారా? మూడు రాజధానులు అంటారా? లేక ఈ మావిగన్ అంటారా? అని ప్రజలు అడిగితే సమాధానం చెప్పలేక సతమతమవ్వాల్సింది ఆయనే.
చరిత్రలో మిగిలే జోకర్ అడుగులు
రాజకీయం అంటే ప్రజల కోసం చేసేది, కానీ జగన్ రాజకీయం మాత్రం పంతం కోసం చేసేదిలా కనిపిస్తోంది. పార్లమెంటులో అమరావతి బిల్లు ద్వారా రాష్ట్రానికి ఒక సుస్థిరత వస్తుంటే, దాన్ని స్వాగతించాల్సింది పోయి ఇటువంటి వింత ప్రతిపాదనలతో నవ్వులపాలు కావడం దురదృష్టకరం. కూటమి పదిలంగానే ఉంది, అమరావతి పనులు వేగంగానే ఉన్నాయి. కేవలం జగన్ రెడ్డి మాత్రమే తన మావిగన్ భ్రమల్లో ఊగుతూ, తనను తాను రాజకీయంగా ట్రాప్ చేసుకుని సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. రివర్స్ లో నా ట్రాప్ లో కూటమి పడిందని ప్రచారం చేయించుకుంటున్నారు. కిందపడినా నాదే పైచేయి అని ప్రచారం చేసుకోవడం అంటే ఇదే.
