ఏప్రిల్, మేలపై టాలీవుడ్ బాక్సాఫీస్ గంపెడు ఆశలు పెట్టుకొంది. ఈ రెండు నెలల్లోనూ భారీగా సినిమాలు వస్తున్నాయి. వాటితో వసూళ్ల గలగల వినిపించడం ఖాయమనుకొంటోంది. కానీ ఫలితాలు ఆశించినంత గొప్పగా కనిపించడం లేదు. గతవారం ‘బైకర్’ విడుదలైంది. ఓకే అనిపించుకొంది. ఈవారం ‘డెకాయిట్’ వచ్చింది. నిర్మాతలకు ఈ సినిమా లాభాల్ని మిగిల్చింది. డబ్బింగ్ బొమ్మ `లిక్`ని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మరో వారం రిలీజులకు సిద్ధమైంది.
ఈవారం పెద్ద సినిమాల హడావుడి లేదు. ఉన్నవన్నీ చిన్న సినిమాలే. ‘తిమ్మరాజు పల్లి టీవీ’, ‘పాపం ప్రతాప్’. ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి. నాగశౌర్య నటించిన ‘బ్యాడ్ బోయ్’కి ఎలాంటి పబ్లిసిటీ లేదు. చాలా కాలంగా ఈ సినిమా సెట్స్‌పైనే ఉండిపోయింది. డిలే ప్రాజెక్ట్ అవ్వడం, నాగశౌర్యకు ఈమధ్య హిట్లు లేకపోవడం, పబ్లిసిటీ సరిగా లేకపోవడం ఇవన్నీ కలగలిపి ఈ సినిమాపై ఆసక్తి తగ్గించేశాయి. మిగిలిన రెండు సినిమాలకూ పబ్లిసిటీ బాగానే ఉంది. ‘పాపం ప్రతాప్’ ఈటీవీ విన్ నుంచి వస్తున్న సినిమా. బ్రాండ్ వాల్యూ బాగా పని చేస్తోంది. ‘తిమ్మరాజు పల్లి టీవీ’ కి హీరో కిరణ్ అబ్బవరం నిర్మాత. ఆయన ఈ సినిమాని జనంలోకి తీసుకెళ్లడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. వీటితో పాటు డబ్బింగ్ సినిమా ‘పల్లి చట్టంబి’ రిలీజ్ అవుతోంది. గతవారం విడుదల కావాల్సిన సినిమా ఇది. కాస్త ఆలస్యంగా వస్తోంది.
బాక్సాఫీసుకు ఓ మంచి హిట్టు కావాలిప్పుడు. అది ఎప్పుడు ఎక్కడ నుంచి వస్తుందో ఎవ్వరికీ తెలీదు. చిన్న సినిమాలు, ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి, బాక్సాఫీసుని జయించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈవారం అలాంటి సినిమా ఏమైనా వస్తుందేమో అని ఆశ. భారీ విజయాలేం లేకపోయినా, కనీసం డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చినా.. థియేటర్లకు కాస్త మైలేజీ దొరుకుతుంది.
