బాబు గాలివాటం – హోదా సెంటిమెంటుకి ఒక మూలం!

రాష్ట్ర విభజన – అనంతర సమస్యలు- పరిష్కార మార్గాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి స్పష్టత వుంది. అయితే, విమర్శలకు భయపడి పరస్పర విరుద్ధమైన వైఖరులు ప్రకటిస్తూ ఆయన పలచన అవుతున్నారు. ప్రజలను చికాకుపెడుతున్నారు.

రాష్ట్రవిభజన ఖాయమని తేలిపోయాక రాజధాని నిర్మాణానికి కేంద్రం నాలుగైదు లక్షల కోట్ల రూపాయలు ఇస్తే విభజన నష్టాన్ని పూడ్చుకోవచ్చు అన్నారు. అది వాస్తవిక దృక్పధం. అదే డిమాండుకి కట్టుబడి వుంటే పరిస్ధితి మరోలా వుండేది. సమైక్యవాదుల లాబీయింగ్ సామర్ధ్యానికి కు భయపడిన కెసిఆర్ విభజన జరిగితే చాలు హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించినా అభ్యంతరం లేదనే సంకేతాలు పంపారన్న వార్తలు వచ్చాయి.

సీమాంధ్రు డిమాండ్లు నెరవేర్చుకోడానికి అవకాశాలు దగ్గరగా వచ్చిన ఆ సందర్భంలో చంద్రబాబు వాస్తవికమైన ప్రతిపాదననే జనం ముందు వుంచారు. కానీ, నాలుగైదు లక్షల కోట్లకు రాష్ట్రాన్ని అమ్మేస్తారా అన్న విమర్శ జగన్ పార్టీ నుంచి రావడంతో బాబు యూ టర్న్ తీసుకున్నారు.

రాష్ట్ర విడిపోయింది…తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. దాంతోపాటే ప్రత్యేక హోదా డిమాండూ తెరమీదికి వచ్చింది.ఆర్ధిక సంస్కరణలమీదా, పెట్టుబడుల వ్యవస్ధమీద విశేషమైన ఆసక్తీ, మోజూ వున్న ప్రధాని నరేంద్రమోదీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకీ ప్రత్యేక హోదా అనేది కాలంతీరిపోయిన కాన్సెప్టు అని నమ్మకం…హోదా ఇస్తే అది సంస్కరణలకు వ్యతిరేకమన్నది వారి విశ్వాసం…ఇందువల్లే ప్రత్యేక హోదా సంజీవని కాదని ఒక దశలో అన్నారు…దానిపై విమర్శలు మొదలయ్యాక, డిల్లీలో జగన్ ఉద్యమించాక ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం వైఖరికి రక్తం మరిగిపోతోందన్నారు.

వివరాలు లేని ప్రత్యేక ప్యాకేజీని కేంద్ర ఆర్ధిక మంత్రి చీకట్లో ప్రకటించగానే అర్ధరాత్రి అని కూడా చూసుకోకుండా రావలసిందంతా రాబట్టుకుందాము అంటూ ప్యాకేజీని స్వాగతించారు.

ప్రత్యేక హోదాకోసం పోరాడవలసిందేనని కాకినాడ సభలో పవన్ కల్యాణ్ ప్రకటించాక ప్యాకేజీ అందుకుంటూనే హోదాకోసం పోరాడుదాం అని చంద్రబాబు ప్రకటించారు.

వాస్తవాలకు దగ్గరగా మాట్లాడికూడా ప్రత్యర్ధుల విమర్శలకు భయపడో, క్రెడిట్ వారికి దక్కనీయ కూడదన్న ఆలోచనవల్లో ఒకోసారి ఒకో వైఖరి ప్రకటిస్తూ మాటనిలకడ లేని నాయకుడుగా ముఖ్యమంత్రి పలుకుబడి పలచబడిపోతోంది. ఆయన గాలివాటం ధోరణి కూడా ప్రత్యేక హోదా ప్రజల్లో సెంటిమెంటుగా బలపడటానికి ఒక కారణం!

ఈస్ధితిలో సెంటిమెంటుని నిర్వీర్యం చేయడం చాలాకష్టం. సెంటిమెంటు అలాగే వుంటే తెలుగుదేశానికి నష్టం! వచ్చే ఎన్నికలవరకూ సెంటిమెంటుని ఆరిపోకుండా చూసుకుంటూ మొత్తం పాపాన్ని బిజెపి మీదికి తోసెయ్యడమే తెలుగుదేశానికి సౌకర్యం! ఈలోగా గాలివాటమే తప్ప హోదా తప్ప ఏదీ వద్దనో ఇంకా మంచి ప్యాకేజీ ఇస్తే చాలుననో దృఢమైన వైఖరితో నిలబడటం తెలుగుదేశానికి దాదాపు అసాధ్యం!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com