చంద్ర‌బాబు ముందున్న ‘ప్ర‌త్యేక’ స‌వాల్ ఇది..!

ప్ర‌త్యేక హోదా.. కేంద్రం ఇవ్వ‌దని తేలిపోయింది. పార్ల‌మెంటును స్తంభింప‌జేసినా చ‌ల‌నం లేని స్థితికి భాజ‌పా వ‌చ్చేసింది. అవిశ్వాసం తీర్మానం పెట్టినా మోడీ స‌ర్కారులో ఇసుమంతైనా చ‌ల‌నం రాలేదు. ఢిల్లీలో దీక్ష‌లూ, నిర‌స‌న‌లు కూడా అయిపోయాయి. ఇప్పుడు ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం రాష్ట్రానికి చేరుకుంది. ప్ర‌తిప‌క్షాలు బంద్ పిలుపునిచ్చాయి. అధికార పార్టీ టీడీపీ కూడా ఈ నెలాఖ‌రు వ‌ర‌కూ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించేసింది. సైకిల్ ర్యాలీలు, ధ‌ర్నాలు, విన‌తిప‌త్రాలు.. ఇలా చాలా కార్య‌క్ర‌మాలు పెట్టుకుంది. నెలాఖ‌రు వ‌ర‌కూ ఓకే.. ఆ త‌రువాత ప‌రిస్థితి ఏంట‌నేదే ఇప్పుడు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ముందుకు రాబోతున్న కొత్త స‌వాల్ అని చెప్పొచ్చు!

ఎన్నిక‌ల‌కు మ‌రో ఏడాది స‌మ‌యం ఉంది. ఈ ఏడాదిపాటూ ప్ర‌త్యేక హోదా అంశంపైనే విప‌క్షాలు ఉద్య‌మించే అవ‌కాశం ఉంటుంది. దీన్నే ఎన్నిక‌ల అజెండా అంశంగా మార్చేసుకుంటాయి. ప్ర‌త్యేక హోదా ఎవ‌రిస్తే వారితోనే పొత్తు ఉంటుంద‌ని ఇప్ప‌టికే వైకాపా చాలాసార్లు స్ప‌ష్టం చేసింది. నాలుగేళ్లుగా ఉద్య‌మిస్తున్నామ‌ని వైకాపా నేత‌లు చెప్పుకుంటున్నారు. మ‌రో ఏడాదిపాటు వారూ ఉద్య‌మిస్తారు. ఇక‌, జ‌న‌సేన కూడా ఇదే ఉద్య‌మాన్ని ప్ర‌ధానాంశంగా తీసుకుని… మరో ఏడాదిపాటూ వామ‌ప‌క్షాల‌తో క‌లిసి కార్య‌క్ర‌మాలు చేప‌డుతుంద‌నే చెప్పాలి. అయితే, ఇత‌ర పార్టీల త‌ర‌హాలోనే టీడీపీ కూడా ఉద్య‌మాల‌తోనే ఏడాదిపాటు కాల‌క్షేపం చేస్తుందా..? అధికార పార్టీ నేత‌లు ఇలా నిత్యం రోడ్ల మీదికి వ‌స్తుంటే… ప్ర‌జ‌ల‌కు ఎలాంటి సంకేతాలు వెళ్తాయ‌నేదే ఇప్పుడు టీడీపీలో చ‌ర్చ‌నీయంగా మారుతున్న అంశంగా తెలుస్తోంది.

దాదాపు ఏడాదిపాటు ప్ర‌త్యేక హోదా ఉద్య‌మాన్ని ఎలా న‌డిపించాల‌నే అంశంపై టీడీపీలో మ‌ల్ల‌గుల్లాలు మొద‌లైన‌ట్టు స‌మాచారం. అధికార పార్టీ నేత‌లు రోజూ రోడ్ల‌పైకి వ‌స్తే బాగుండ‌ద‌ని కొంత‌మంది అభిప్రాయ‌ప‌డుతుంటే, ఇది కేంద్రం తీర్చాల్సిన స‌మ‌స్య కాబ‌ట్టి, ఇదే మాట‌ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్ల‌డంలో త‌ప్పేముంద‌ని మ‌రికొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నార‌ట‌! మ‌ధ్యే మార్గంగా… హోదా ఉద్య‌మాన్ని క్షేత్ర‌స్థాయిలో తీవ్రంగా ఉంచితే స‌రిపోతుంద‌నీ, కేడ‌ర్ తో ఉద్య‌మాన్ని న‌డిపించం వ‌ల్ల పార్టీకి కూడా ప్ల‌స్ అవుతుంద‌నే అభిప్రాయం వినిపిస్తోంది. ఈ క్ర‌మంలో జె.ఎ.సి.ల‌ను వీలైనంత త్వ‌రగా ఏర్పాటు చేసి… ఉద్య‌మ ప్ర‌ణాళిక‌లను సిద్ధం చేసుకోవాల‌నే ఆలోచ‌న‌లో టీడీపీ ఉన్న‌ట్టు స‌మాచారం. ఏదేమైనా, ఏడాదిపాటు ప్ర‌త్యేక హెదా ఉద్య‌మాన్ని… ఇత‌ర పార్టీలు చేస్తున్న ఉద్య‌మాల‌ను త‌ట్టుకుంటూ టీడీపీ ఎలా ముందుకు తీసుకెళ్తుంద‌నేది ముఖ్య‌మంత్రి ముందున్న స‌వాలే!

ప్ర‌భుత్వాల‌కు వ్య‌తిరేకంగా పోరాడే వెసులుబాటు ప్ర‌తిప‌క్షాల‌కు స‌హ‌జంగానే ఉంటుంది. కానీ, రాష్ట్రంలో అధికారంలో ఉంటూ కేంద్రంపై ఉద్య‌మం సాగించ‌డం క‌చ్చితంగా టీడీపీ ముందున్న ఛాలెంజ్ అనే చెప్పాలి. ఇదే స‌మ‌యంలో రాబోయే ఏడాదిపాటు రాష్ట్రంపై కేంద్రం అనుస‌రించ‌బోయే వైఖ‌రి కూడా వేరేలా ఉంటుంది. రావాల్సిన నిధులూ, చెల్లించాల్సిన బిల్లులూ, ఇత‌ర కేటాయింపులూ… ఇలా ఏపీకి సంబంధించిన అన్ని అంశాల్లోనూ భాజ‌పా ధోర‌ణి గ‌తంలో మాదిరిగా సానుకూలంగా ఉండ‌దు! దాన్నీ త‌ట్టుకోవాల్సిన అవసరం టీడీపీకి ఉంటుంది క‌దా!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com