బిహార్ రాజకీయాల్లో సుదీర్ఘ కాలం పాటు ముఖ్యమంత్రిగా చక్రం తిప్పిన నితీశ్ కుమార్ యుగం ముగిసి, కొత్త అధ్యాయం మొదలవుతోంది. బిహార్ కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ నేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. నితీశ్ కుమార్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే, బీజేపీ అధిష్టానం సామ్రాట్ చౌదరి పేరును అధికారికంగా ప్రకటించనున్నట్లు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
పదే పదే ప్రభుత్వాలను మారుస్తూ పల్టీ మార్ అనే ముద్ర వేసుకున్న నితీశ్ కుమార్, ఈసారి అనూహ్యంగా క్రియాశీల రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పుకుని జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేశారు. తన చిరకాల కోరికైన రాజ్యసభ సభ్యత్వాన్ని నెరవేర్చుకునేందుకు ఆయన ఇటీవల ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేMejg. దీంతో బిహార్లోని ఎన్డీయే ప్రభుత్వంలో అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీ, తమ సొంత నేతను సీఎం పీఠంపై కూర్చోబెట్టేందుకు రంగం సిద్ధం చేసింది.
సామ్రాట్ చౌదరి బిహార్లో బలమైన ఓటు బ్యాంకు కలిగిన కుష్వాహ సామాజిక వర్గానికి చెందిన నేత. గత కొంతకాలంగా నితీశ్ కుమార్ కూడా బహిరంగ సభల్లో సామ్రాట్ చౌదరిని తన వారసుడిగా సంకేతాలిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా యువతలో మంచి పట్టు ఉండటం, పార్టీ విధేయుడిగా పేరుండటం సామ్రాట్ చౌదరికి కలిసొచ్చే అంశాలు. ఆయన నాయకత్వంలో బిహార్లో బీజేపీని మరింత బలోపేతం చేయాలని కమలం పార్టీ భావిస్తోంది.
ఢిల్లీలో జరిగే బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. నితీశ్ కుమార్ వారసుడిగా సామ్రాట్ చౌదరి పేరు దాదాపు ఖరారైనప్పటికీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ పేరు కూడా రేసులో వినిపిస్తోంది. అయితే, ప్రస్తుతం ఉన్న సమీకరణాల దృష్ట్యా సామ్రాట్ చౌదరికే అదృష్టం వరించే అవకాశం ఎక్కువగా ఉంది.
