భాజాపాకు చెల‌గాటం…బాబుకు ఓట్ల సంక‌టం

వ‌చ్చే ఏడాదిలో ఆంధ్ర ప్ర‌దేశ్ కూ ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉన్నట్టు వార్త‌లొస్తున్న‌ నేప‌ధ్యంలో భాజాపా బేర‌మాడే స్థితి నుంచి ఏది ఇస్తే అది తీసుకునే స్థితికి చేరాల‌న్నా, త‌మ‌తో మైత్రి ప‌ట్ల సానుకూలంగా ఆలోచించాల‌న్నా… గుజ‌రాత్‌లో భాజాపా ఓడిపోవాల‌ని తెలుగుదేశం పార్టీ మ‌న‌సా వాచా కోరుకుంద‌న్న‌ది సుస్ప‌ష్టం. ఇది ఎపిలో ఇరు పార్టీల నేత‌ల‌కూ తెలిసిన విష‌య‌మే. అయితే అలా జ‌ర‌గ‌లేదు. దీంతో ఎపిలో భాజాపా నేత‌లకు ఊపు వ‌చ్చింది. ఎప్ప‌టి నుంచో పంటి బిగువ‌న దాచుకుంటున్న కోపాన్ని తీర్చుకోవ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. దీనికి బ‌దులివ్వ‌డానికి తెలుగుదేశం నేత‌లూ సై అన‌బోవ‌డంతో… అగ్నికి ఆజ్యం పోసిన‌ట్ట‌యింది.

ఇలా ఉరుమురిమి మంగ‌ళం మీద ప‌డింద‌న్న‌ట్టుగా గుజ‌రాత్‌లో గెలుపు భాజాపా, తేదేపా ల మ‌ధ్య చిచ్చు పెట్టింది. ఈ వ్య‌వహారం స‌హ‌జంగానే తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబును ఇరుకున పెట్టింది. ఇప్ప‌టికే ఇంటా బ‌య‌టా బోలెడ‌న్ని త‌ల‌నొప్పులు త‌ట్టుకుంటున్న ఆయ‌న ఇప్పుడు భాజాపాతో శ‌తృత్వాన్ని ఎంత మాత్రం కోరుకోవ‌డం లేద‌నేది నిర్వివాదం. ఇప్పుడే కాదు గ‌త కొంత‌కాలంగానూ ఈ విష‌ష‌యంలో ఆయ‌న పార్టీ నేత‌ల‌ను సున్నితంగా వారిస్తున్నారు. ఇప్పుడు మ‌రింత బ‌లం పుంజుకున్న‌ కేంద్రంతో త‌గ‌వులు ప‌డితే ఏమ‌వుతుందో ఆయ‌న‌కు బాగా తెలుసు. అందుకే త‌న నేత‌ల్ని నోర్మూసుకోమంటూ గట్టిగానే హెచ్చ‌రించారు. అంతేకాదు సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి వంటి నేత‌ల్ని ఆఘ‌మేఘాల మీద రంగంలోకి దింపి దిద్దుబాటు ప్ర‌క‌ట‌న‌లు ఇప్పించారు. ఎన్‌డిఎలో త‌మ నాయ‌కుడు మోడీ అంటూ సోమిరెడ్డి ప్ర‌క‌టించారు. ఇరు పార్టీల‌కు చెందిన కీల‌క నేత‌లు సంయ‌మ‌నంతో ఉంటే, మ‌ధ్య‌లో రాజేంద్ర‌ప్ర‌సాద్‌, సోము వీర్రాజులు రెచ్చిపోవాల్సిన అవ‌స‌రం లేదంటూ హిత‌వుల ప‌లికారు. రెండు రాష్ట్రాల గెలుపు త‌మ మైత్రికి మేలే చేస్తుంద‌న్నారు.

ప్ర‌స్తుతానికి తెలుగుదేశం పార్టీ నేత‌లు బాబు సూచ‌న‌ల‌కు త‌లొగ్గి మౌనం వ‌హించే ప‌రిస్థితి క‌నిపిస్తున్నా… ఎప్ప‌టి నుంచో కాచుక్కూచున్న భాజాపా నేత‌లు మాత్రం వినేట్టు క‌నిపించ‌డం లేదు. తేదేపా నేత రాజేంద్ర‌ప్ర‌సాద్ ఎత్తిపొడుపుల‌పై మంగ‌ళ‌వారం బ‌దులిచ్చిన సోము వీర్రాజు చాలా సుదీర్ఘంగానే విమ‌ర్శ‌లు గుప్పించిన విష‌యం తెలిసిందే. పోల‌వ‌రం అవినీతి, కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు… ఇలా ఏ ఒక్క‌టీ వ‌ద‌ల‌కుండా ఆయ‌న మిత్ర‌ప‌క్షంపై సంపూర్ణ దాడి చేశారు. నంద్యాల ఎన్నిక‌ల్లో గెలుపును చూపించి త‌మ‌కెవ‌రి మ‌ద్ధ‌తు అక్క‌ర్లేద‌న్న‌ట్టు మాట్లాడిన తెదేపా నేత విమ‌ర్శ‌ను ప్ర‌స్తావిస్తూ… నోట్ల‌ర‌ద్దు చేసి తాము గెలిస్తే నోట్లు వెద‌జ‌ల్లి తేదేపా గెలిచిందంటూ ఆయ‌న చేసిన విమ‌ర్శ తేలిక‌గా తీస‌సుకునేది ఎంత మాత్రం కాదు.

అయిన‌ప్ప‌టికీ బాబు హెచ్చరిక‌ల‌తో తేదేపా నేత‌లు చ‌ల్ల‌బ‌డినా, భాజాపా శ్రేణుల విమ‌ర్శ‌లు బుధ‌వారం కూడా కొన‌సాగాయి. నెల్లూరుకు చెందిన భాజాపా నేత సురేష్‌రెడ్డి బుధ‌వారం తేదేపా మిత్ర‌ధ‌ర్మం పాటించ‌డం లేదంటూ మండిప‌డ్డారు. తాము, ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌హ‌క‌రించ‌క‌పోతే గ‌త ఎన్నిక‌ల్లో తెలుగుదేశం గెలిచేదే కాద‌ని స్ప‌ష్టం చేశారు. అయిన‌ప్ప‌టికీ తేదేపా త‌మ‌కు అన్ని ర‌కాలుగా అన్యాయం చేస్తోంద‌ని, మిత్ర‌ప‌క్షాల‌ను ముంచే చ‌రిత్ర ఆ పార్టీది అని తీవ్ర ప‌ద‌జాలంతో విరుచుకుప‌డ్డారు.

ఈ నేప‌ధ్యంలో.. బాబు త‌మ వారిని అపిన‌ప్ప‌ప‌టికీ… గ‌త కొంత‌కాలంగా మిత్ర ప‌క్షంపై విమ‌ర్శ‌లు చేస్తున్న త‌మ నేత‌ల్ని క‌ట్ట‌డి చేయ‌డానికి భాజాపా అథిష్టానం ఎంత మాత్రం ప్ర‌య‌త్నించ‌డం లేద‌నేది తెలిసిందే…. తేదేపాపై భాజాపా శ్రేణులు ఇలాగే దండెత్తుతూ ఉంటే… చంద్ర‌బాబు ఎంత కాలం త‌మ శ్రేణుల్ని ఆప‌గ‌ల‌రు? తాను సైతం ఎంత కాలం మౌనం వ‌హించ‌గ‌ల‌రు? అనేది మాత్ర‌మే ఇరు పార్టీల పొత్తుపై ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.