అప్పట్లో రజినీ…ఆ తర్వాత పవన్…ఇప్పుడు ప్రభాస్…ఏంటీ సినిమా పాలిటిక్స్?

శివాజీ సినిమా రిలీజ్ టైంలో జరిగిన రాజకీయం గుర్తుందా? 2009నాటికి చిరు పొలిటికల్ రంగప్రవేశం ఖాయం అని తెలుసుకున్న చంద్రబాబు రజినీకాంత్ సినిమాతో చాలా పెద్ద రాజకీయ డ్రామానే నడిపాడు. పనిలో పనిగా ఆ సినిమాలో అవినీతికి వ్యతిరేకంగా ఉన్న సందేశాన్ని కూడా బాగానే క్యాష్ చేసుకున్నాడు. చిరంజీవిని చిన్న గీతను చేయడం కోసం పెద్దగీతగా రజినీని ప్రొజెక్ట్ చేయడం కోసం అప్పట్లో టిడిపి భజన మీడియా చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. రజినీ-శంకర్ స్థాయి అంచనాలను తమిళ్‌లోనే అందుకోలేకపోయిన ఆ సినిమాకు ఈ పాలిటిక్స్ పుణ్యమాని తెలుగునాట గొప్ప ప్రచారం దొరకింది. కానీ ఆ ప్రచారం చిరంజీవిని తక్కువ చేయడానికి మాత్రమే ఉపయోగపడింది. చంద్రబాబును గద్దెనెక్కించలేకపోయింది.

ఇక 2014 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్‌ని దేవుడ్ని చేస్తూ మరోసారి టిడిపి భజన మీడియా సూపర్ హంగామా చేసింది. ఈ సారి ఆ ప్రచారం వర్కవుట్ అయింది. ఇక ఇప్పుడు టిడిపితో సావాసం చేస్తున్న బిజెపి కూడా అలాంటి ట్రిక్కునే ఉపయోగించబోతోందా అన్న అనుమానాలు రాజకీయ నాయకుల్లో వినిపిస్తున్నాయి. బాహుబలి సినిమాకు జాతీయ ఉత్తమ చిత్రం అవార్డ్ వచ్చినప్పుడే రాజకీయ పలుకుబడి ఏదో ఉందని ఎక్కువ మంది అనుమానించారు. బాహుబలి సినిమా సగం కథే….అట్టే మాట్లాడితే జస్ట్ పాత్రల పరిచయం మాత్రమే అని ఆ సినిమా డైరెక్టర్ రాజమౌళి, కథకుడు విజయేంద్రప్రసాద్ కూడా చెప్పారు. అలాంటి సినిమాకు జాతీయ ఉత్తమ చిత్రం అవార్డ్ ఎలా ఇచ్చారు? అదే సమయంలోనే ప్రభాస్ కుటుంబం మొత్తం కూడా కృష్ణంరాజుతో కలిసి వెళ్ళి మోడీతో ప్రత్యేకంగా కలిశారు.

ఇక బాహుబలి-2కోసం వెంకయ్యనాయుడులాంటి నాయకులు ప్రచారం చేసిపెట్టినంత హంగామా చేశారు. ఇప్పుడు తాజాగా పాలిటిక్స్‌లో ప్రభాస్ అన్న వార్తలు మీడియాలో కనిపిస్తున్నాయి. 2019 ఎన్నికల ప్రచారం కోసం ప్రభాస్ వాడకం అయితే కచ్చితంగా ఉండేలానే కనిపిస్తోంది. మరి ఆ వాడకం బిజెపికి మాత్రమేనా? లెకపోతే టిడిపికి కూడా కలిపి ఉంటుందా అనేది చూడాలి. ఇక ఇప్పటికే చిరంజీవి, పవన్, బాలకృష్ణలాంటి మహామహుల పొలిటికల్ ప్రచార హీరోయిజాలు, ఆ తర్వాత ప్రజల తరపున ప్రశ్నించడం, పనిచేయడం మానేసి వాళ్ళ సినిమాలు వాళ్ళు ఎంచక్కా చేసుకుంటూ మళ్ళీ ఎన్నికల వరకూ టైం పాస్ చేస్తున్న తీరు చూశాక కూడా ప్రభాస్ ప్రచారానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓట్లేస్తారా? లేదా అన్నది కూడా చూడాలి మరి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com