శ్రీలంక మారణహోమంలో 160 మంది దుర్మరణం..! ఎవరి పని..?

ఈస్టర్ పర్వదినాన శ్రీలంక వణికిపోయింది. చర్చిలను టార్గెట్ చేసుకుని కొలంబోలో.. వరుస బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ప్రార్థనలు జరుగుతున్న ప్రఖ్యాత చర్చిలు, స్టార్ హోటళ్లలో బాంబులు పేల్చారు. మొత్తం వరుసగా.. ఆరు భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ పేలుళ్లలో ప్రాథమికంగా 200 మందికిపైగా చనిపోయారు. కొన్ని వందల మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుళ్ల శ్రీలంక మాత్రమే కాదు.. ప్రపంచం మొత్తం ఉలిక్కి పడింది. శ్రీలంకలో… హైఅలర్ట్ ప్రకటించారు. స్కూళ్లు, కాలేజీలు, వ్యాపార సంస్థలు మొత్తాన్ని రేపటి వరకూ మూసేయాలని ఆదేశించారు. ఆరు పేలుళ్లలో రెండు పేలుళ్లు.. సూసైడ్ బాంబర్స్‌గా అనుమానిస్తున్నారు. ఓ స్టార్ హోటల్‌లో ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తిని జహహాన్ హషిమ్‌గా గుర్తించారు. మరో చర్చిలో దాడికి పాల్పడిన వ్యక్తిని అబూ మహమ్మద్‌ అనే వ్యక్తిగా అనుమానిస్తున్నారు.

శ్రీలంక ఇటీవలి కాలంలో కాస్త ప్రశాంతంగానే ఉంటోంది. రాజకీయ అస్థిరత తప్ప.. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్న ఉగ్రవాద దాడులు అయితే లేవు. ఎల్టీటీఈని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసి..ప్రభాకరన్‌ను అంతమొందించిన తర్వాత.. శ్రీలంకలో పరిస్థితులు మెరుగుపడ్డాయనుకున్నారు. అయితే.. పరిస్థితి ఒక్క సారిగా మారిపోయింది. తమ ఉనికి చాటాలనుకుంటున్న గ్రూపులు… కొలంబోపై గురి పెట్టాయి. దానికి ఈస్టర్ పండుగనే వేదిక చేసుకున్నారు. పెద్ద ఎత్తున జనం గుమికూడే ప్రదేశాలను ఎంపిక చేసుకుని పేలుళ్లకు పాల్పడ్డారు. శ్రీలంకలో పేలుళ్లకు పాల్పడాల్సిన అవసరం ఎవరికి ఉందో.. ప్రపంచదేశాలు… గుర్తించలేకపోతున్నాయి. ఐసిస్ లాంటి సంస్థలు.. శ్రీలంక మీద దృష్టి పెట్టాల్సిన పరిస్థితులు లేవు. అంతర్గతంగా.. అక్కడ మళ్లీ ఈలం గ్రూపులు.. బలపడి ఉంటాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా… ఈలం సానుభూతిపరులు ఉన్నారు. అయితే.. ప్రభాకరన్ ను మట్టుబెట్టిన తర్వాత ఎక్కడా.. ఈలం కార్యకలాపాలు జరిగినట్లుగా బయటకు రాలేదు. కానీ.. ఒక్క సారిగా.. కొలంబోలో ఇంత దారుణమైన పేలుళ్లకు పాల్పడ్డారంటే.. తమ ఉనికి బలంగా చాటి చెప్పే ఉద్దేశంతోనే చేశారని అనుకుంటున్నారు. ప్రపంచదేశాలన్నీ శ్రీలంక పేలుళ్ల ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. అవసరమైన సాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. శ్రీలంక పేలుళ్ల బాధితుల్లో తమ దేశస్తులు ఎవరైనా ఉన్నారేమోనని.. చూస్తున్నారు. పేలుళ్లకు పాల్పడిన వారు ఎవరు..? వారి బ్యాక్ గ్రౌండ్ ఏమిటి అన్నది బయటకు వచ్చిన తర్వాత అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com