దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి తిరుగులేని అడ్డాగా ఉన్న పులివెందుల నియోజకవర్గంలో ఇప్పుడు పసుపు జెండా రెపరెపలాడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి క్షేత్రస్థాయిలో పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారు. చేపకింద నీరులా పార్టీని విస్తరిస్తున్నారు. పూర్తి సమయం నియోజకవర్గానికే పరిమితమయి రాజకీయాలు చేస్తున్నారు. ఇటీవల వేంపల్లె, ఇతర గ్రామాల్లో పెద్ద ఎత్తున వైసీపీ సానుభూతిపరుల్ని పార్టీలో చేర్చుకున్నారు. ముఖ్యంగా వైసీపీకి చెందిన కీలక నేత చిన్నతాజ్ క్యాట్ గౌస్‌తో పాటు సుమారు 200 కుటుంబాలు ఏకకాలంలో టీడీపీలో చేరడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత నియోజకవర్గంలో ఈ స్థాయి వలసలు జరగడం బీటెక్ రవి గ్రౌండ్ వర్క్ సక్సెస్ అవుతోందని సూచిస్తోంది.
జడ్పీటీసీ ఉప ఎన్నిక: ఒక భారీ మలుపు
బీటెక్ రవి కేవలం మాటలకే పరిమితం కాకుండా ఎన్నికల బరిలోనూ తన సత్తా చాటారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆయన, తన సతీమణి మారెడ్డి లతారెడ్డిని అభ్యర్థిగా బరిలోకి దింపి భారీ విజయం సాధించారు. వైసీపీ సానుభూతి పవనాలు ఉంటాయని భావించినా, టీడీపీ అభ్యర్థి గెలవడం ద్వారా పులివెందుల ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు వస్తోందని ఆయన నిరూపించారు. ఈ విజయం తర్వాత నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకుల్లో భయం పోయి, ధైర్యంగా టీడీపీ వైపు వస్తున్నారు.
కీలక సమస్యలు పరిష్కరించి పట్టు సాధించే ప్రయత్నం
కేవలం చేరికల మీదనే కాకుండా, స్థానిక సమస్యల పరిష్కారంపై కూడా బీటెక్ రవి దృష్టి పెట్టారు. ముఖ్యంగా తుమ్మలపల్లి యురేనియం కర్మాగార బాధిత గ్రామాల్లో ఆయన స్వయంగా పర్యటిస్తూ ప్రజల గోడు వింటున్నారు. యురేనియం వల్ల కలిగే కాలుష్యం, నష్టపరిహారం వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ఒప్పించి న్యాయం చేస్తామనే హామీతో ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకుంటున్నారు. ఇటు జనంబాట అటు సమస్యల పరిష్కారం రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఆయన తన నెట్‌వర్క్‌ను గ్రామగ్రామాన విస్తరిస్తున్నారు.
అడ్డుకోలేకపోతున్న అవినాష్ రెడ్డి
పులివెందులలో టీడీపీ ఎదుగుదలను అడ్డుకోవడానికి వైసీపీ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తాజాగా అమ్మగారిపల్లె గ్రామంలో బీటెక్ రవి పర్యటనకు వ్యతిరేకంగా కొందరు గ్రామస్థులు ఇళ్లకు తాళాలు వేసి నిరసన తెలపడం వంటి సంఘటనలు అక్కడ నెలకొన్న ఉద్రిక్తతకు అద్దం పడుతున్నాయి. నిజానికి ఆ గ్రామం వంద శాతం వైసీపీ మద్దతుదారులదే. మూడు కుటుంబాలు టీడీపీలో చేరాయి. అలాంటి గ్రామాల్లోకీ బీటెక్ రవి చొచ్చుకెళ్తున్నారు. బెంగళూరులో ఉండి, ఎన్నికలప్పుడు మాత్రమే పులివెందులకు వచ్చే నాయకులు కావాలా నిరంతరం ప్రజల్లో ఉండే నాయకుడు కావాలా అని ఆయన వేస్తున్న ప్రశ్నలు ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. జగన్ ను కన్నడ బిడ్డగా చెబుతూ ప్రజల్లోకివెళ్తున్నారు.
పులివెందులలో వైసీపీ ఏకఛత్రాధిపత్యానికి బీటెక్ రవి గట్టి సవాల్ విసురుతున్నారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ‘సైలెంట్ ఆపరేషన్’ ద్వారా కేడర్‌ను బలోపేతం చేస్తున్నారు. 2029 ఎన్నికల నాటికి పులివెందుల ఫలితం ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే స్థానిక సంస్థల ఎన్నికలోలనూ వైసీపీ పోటీ చేసే పరిస్థితి ఉండదని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి.
