కొండా ఫ్యామిలీతో మైండ్‌గేమ్‌? ఆడేది- ఆడించేది ఎవ‌రు?

రేవంత్ ఎపిసోడ్ త‌ర్వాత తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ప్ర‌స్తుతం తె.రా.స‌లో కాస్త అసంతృప్తితో ఉన్న‌ట్టు ఎవ‌రు క‌నిపించినా వారికి చేయి అందించే ప్ర‌య‌త్నం విస్త్రుతంగా చేస్తోంది. ఇదే క్ర‌మంలో ర‌క‌ర‌కాల మైండ్ గేమ్‌లు సైతం వ్యాప్తిలోకి వ‌స్తున్నాయి. ప్రస్తుతానికి ప‌లు పేర్లు తెలంగాణ కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యే జాబితాలో వినిపిస్తుండ‌గా, గురువారం సాయంత్రం మొద‌లై శుక్ర‌వారం బాగా ఊపందుకున్న అలాంటి పేర్ల‌లో కొండా ఫ్యామిలీ ప్ర‌ముఖంగా ఉంది.

గ‌తంలో వైఎస్ ప్ర‌భుత్వంలో మంత్రిగా సైతం ప‌నిచేసిన కొండాసురేఖ‌… ఆ త‌ర్వాత ప‌రిణామాల‌లో ఆయ‌న త‌న‌యుడికి అండ‌గా నిల‌బ‌డ‌డం, వైసీపీ స‌మైక్య రాగం తీయ‌డంతోనే ఆ పార్టీతో తెగ‌తెంపులు చేసుకోవ‌డం వంటివి అంద‌రికీ తెలిసిన‌వే. ఆ త‌ర్వాత త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో తె.రా.స‌లో చేరిన కొండా సురేఖ‌-ముర‌ళి దంప‌తులు… అక్క‌డ బాగానే కుదురుకున్నారు. ఈలోగా వీరి పార్టీలోకి వారి బ‌ద్ధ శ‌తృవు, తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు కూడా వ‌చ్చి చేర‌డంతో మ‌రోసారి కొండా ఫ్యామిలీకి ఇబ్బందులు స్టార్ట‌య్యాయి.

ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితి ప్ర‌కారం… 3 ద‌శాబ్ధాలుగా ఎర్ర‌బెల్లితో కొండా ఫ్యామిలీకి ఉన్న‌ ఆధిప‌త్య పోరు వ‌రంగ‌ల్ జిల్లా వేదిక‌గా ముదిరి పాకాన ప‌డింది. కొండా ఫ్యామిలీకి చెక్ పెట్ట‌డానికి ఎర్ర‌బెల్లి త‌న సోద‌రుడి ద్వారా చ‌క్రం తిప్పుతున్నార‌ని స‌మాచారం. కొండా వ్య‌తిరేకులంద‌రినీ కూడ‌గ‌డుతూ ఆయ‌న ప్రాబ‌ల్యానికి గండికొట్టే ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేశారు. దీంతో సురేఖ సైతం త‌న కుమార్తెను సైతం రాజ‌కీయ ర‌ణ‌ రంగంలోకి దించుతున్నారు.

ఈ నేప‌ధ్యంలోనే కొండా కుటుంబం త‌మ మాతృసంస్థ‌ కాంగ్రెస్‌లోకి జంప్ కానుంద‌ని గ‌త రెండ్రోజులుగా ప్ర‌చారం ఊపందుకుంది. కాంగ్రెస్‌లోకి రావ‌డానికి సురేఖ 2 అసెంబ్లీ సీట్లు కావాల‌నే ష‌ర‌తు పెట్టార‌ని, అయితే ఒక‌దానికి మాత్ర‌మే కాంగ్రెస్ హామీ ఇచ్చింద‌ని, దీనిపై ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి వ‌రంగ‌ల్ కాంగ్రెస్ నేత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారని… వార్త‌లు వెల్లువెత్తుతున్నాయి.

అయితే దీనిని కొండా దంప‌తులు నిర్ధ్వందంగా ఖండించారు. తాము తెరాస‌ను వ‌దిలి వెళ్లేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. త‌మ‌కు రాజ‌కీయ జ‌న్మ నిచ్చింది వైఎస్ అయితే పున‌ర్జ‌న్మ ఇచ్చింది కెసియార్ అని అలాంటి పార్టీని వ‌దిలి వెళ్లే ప్ర‌స‌క్తే లేద‌న్నారు. ఇదంతా కాంగ్రెస్ నేత‌లు ఆడుతున్న మైండ్ గేమ్ అన్నారు. నిజానికి కొండా ఫ్యామిలీ అంత తేలిక‌గా మాట‌లు మార్చే ర‌కం కాదు… అయితే శ‌ర‌వేగంగా మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాల్లో అంత త్వ‌ర‌గా ఎవ‌రినీ న‌మ్మే పరిస్థితి క‌నిపించ‌డం లేద‌న్న‌ది నిజం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.