చంద్ర‌బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో అదే కీల‌కాంశ‌మా..?

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 2న ఢిల్లీ వెళ్తున్నారు. ఆ మ‌ర్నాడు కూడా అక్క‌డే ఉంటారు. కేంద్రంతో పోరాటం చేస్తున్నారు కాబ‌ట్టి, గ‌తంలో మాదిరిగా ఈ ప‌ర్య‌ట‌న ఉండ‌దు. కేంద్ర‌మంత్రుల‌తో భేటీలు లాంటివి ఉండ‌వు. అందుకే, ఈసారి చంద్ర‌బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌నపై ఇప్ప‌ట్నుంచే ఆస‌క్తి ఏర్ప‌డుతోంది. నిజానికి, ఆయ‌న వెళ్తున్న‌ది ఏపీ ప్ర‌యోజ‌నాల విష‌య‌మై అన్ని పార్టీల నేత‌ల్ని క‌లిసేందుకు. ఇదే విష‌య‌మై తాజాగా జ‌రిగిన అఖిల ప‌క్ష భేటీలో ముఖ్య‌మంత్రి వెల్ల‌డించారు.

కేంద్రంతో విభేదించిన ద‌గ్గ‌ర నుంచీ చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా దేశంలోని ఇత‌ర ప్ర‌ముఖ పార్టీలు కూడా ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. భాజ‌పా స‌ర్కారుపై టీడీపీ అవిశ్వాసం ప్ర‌క‌టించ‌గానే చాలా పార్టీలు మ‌ద్ద‌తుగా నిలిచాయి. అంతేకాదు, ఈ నేప‌థ్యంలో కేంద్రంలో మూడో ఫ్రెంట్ కి చంద్ర‌బాబు నాయ‌క‌త్వం వ‌హిస్తార‌నే క‌థ‌నాలు వినిపించాయి. దానికి అనుగుణంగా 11 పార్టీల నేత‌ల‌తో సీఎం చ‌ర్చించిన‌ట్టు జాతీయ మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో సీఎం ఢిల్లీకి వెళ్ల‌డం, అన్ని పార్టీల నేత‌ల‌తో భేటీ కావ‌డాన్ని కీల‌క ప‌రిణామంగానే చూడొచ్చు.

ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ మంగ‌ళ‌వారం ఢిల్లీ వెళ్లారు. తెరాస‌తో స‌హా డీఎంకే, ఎన్సీపీ, శివ‌సేన‌, ఆర్జేడీలు చెందిన నేత‌ల‌తో మమతా భేటీ అయ్యారు. యూపీలో అఖిలేష్‌, మాయావ‌తి ఐక‌మ‌త్యంగా ఉండాల‌ని కోరారు. అంటే, భాజ‌పాయేత‌ర ఫ్రెంట్ ఏర్పాటుకు సంబంధించి జ‌రుగుతున్న ప‌రిణామంగానే దీన్ని చూడాలి. మ‌మ‌తా ప‌ర్య‌ట‌న త‌రువాత చంద్ర‌బాబు ఢిల్లీకి వెళ్తున్నారు. అయితే, చంద్ర‌బాబు తాజా ప‌ర్య‌ట‌న‌ను మూడో ఫ్రెంట్ ఏర్పాటు కోణం చూడొద్ద‌ని టీడీపీ నేత‌లు కొంతమంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం ఏపీ స‌మ‌స్య‌లపై సీఎం ఆలోచిస్తున్నార‌నీ, ఈ కూట‌ములూ ఫ్రెంట్లూ లాంటివి ఇప్ప‌టి ప్రాధాన్య‌తాంశాలు కాద‌ని అంటున్నారు. టీడీపీ నేత‌లు ఇలా చెబుతున్నారు. కానీ, ప్ర‌ముఖ పార్టీల‌తో చంద్ర‌బాబు భేటీ అయి మాట్లాడితే, ఆ అంశం చ‌ర్చ‌కు రాకుండా ఎలా ఉంటుంది..? ప్రాంతీయ పార్టీల ఉనికినే స‌వాలు చేస్తూ, రాష్ట్రాల‌ను కేంద్రం చిన్న చూపు చూస్తున్న నేప‌థ్యంలో భాజ‌పా వ్య‌తిరేక శ‌క్తుల‌న్నీ ఐక్యం కావాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఆ దిశ‌గా ఒక కీల‌క‌మైన ముంద‌డుగు పడేందుకు చంద్ర‌బాబు ఢిల్లీ టూర్ వేదిక కాబోతుంద‌నే అంచ‌నాలు చాలానే ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.