ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీలో ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. సమావేశం ప్రారంభానికి ముందే కేబినెట్ ఎజెండాలోని ముఖ్యాంశాలు బయటకు రావడంపై ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రహస్యాలు, కీలక నిర్ణయాలు అధికారికంగా వెల్లడించకముందే మీడియాకు ఎలా చేరుతున్నాయని ఆయన మంత్రులను ప్రశ్నించారు. సమాచారం లీక్ కావడం అనేది ప్రభుత్వ క్రమశిక్షణకు విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు.
ఈ లీకుల వ్యవహారంపై మంత్రులకు ముఖ్యమంత్రి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. గతంలో ఇలాంటి లీకుల కారణంగానే ఎన్టీఆర్ తన మంత్రివర్గాన్ని రద్దు చేసిన ఉదంతాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన కీలక సమాచారం లీక్ అయితే, దానికి సంబంధిత మంత్రులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని తేల్చి చెప్పారు.ఎవరు కేబినెట్ ఎజెండాను లీక్ చేశారో తెలుసుకోవడం ఇప్పుడు పెద్ద విషయం కాదన్నారు.
మరోవైపు, కేబినెట్ సమావేశం ప్రారంభమైనా మంత్రులకు ఎజెండా కాపీలు అందకపోవడంపై కూడా చర్చ జరిగింది. మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ అంశాన్ని ప్రస్తావించగా, అధికారుల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎజెండా అంశాలను మంత్రులు ముందుగానే అధ్యయనం చేసే అవకాశం ఉండాలని, వ్యవస్థలు మరింత సరళంగా ఉండాలి కానీ క్లిష్టంగా మారకూడదని అధికారులను మందలించారు. గతంలో కార్యదర్శులు సబ్జెక్టులపై పూర్తి అవగాహనతో ఉండేవారని, ప్రస్తుతం ఆ చొరవ తగ్గడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.
లీకుల అంశంపై క్లాస్ తీసుకున్న అనంతరం, ప్రభుత్వ పథకాల అమలుపై మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. జలధార , సూర్యఘర్ , పీఎం కుసుమ్ వంటి పథకాలపై మంత్రులు వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగా పాల్గొని ప్రజలకు జవాబుదారీగా ఉండాలని ఆదేశించారు. రాబోయే మూడు నాలుగు నెలల్లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నందున, ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రులను ఆదేశించారు.
