ఆది శంకరాచార్యుల చరిత్ర , చతురామ్నాయ పీఠాల ఉనికిపై చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆధ్యాత్మిక, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. శతాబ్దాలుగా స్థిరపడిన నమ్మకాలను ప్రశ్నించడం వెనుక కుట్ర కోణం ఉందన్న విమర్శలు వస్తున్నాయి. ఆది శంకరాచార్యులు వైష్ణవుడని, ఆయన కేవలం విష్ణుతత్వాన్ని ప్రబోధించారని చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు ఒక ఎత్తు అయితే, నాలుగు దిక్కుల్లో ఆయన చతురామ్నాయ పీఠాలను స్థాపించలేదని చెప్పడం మరో సంచలనం.
చరిత్రను ప్రశ్నిస్తున్న చినజీయర్
శంకరుల కంటే ముందే ఈ పీఠాలు ఉండేవని లేదా ఈ క్రెడిట్ మరొకరికి చెందుతుందని ఆయన చేస్తున్న ప్రచారం అనాదిగా వస్తున్న స్మార్త సంప్రదాయాన్ని సవాలు చేస్తోంది. హిందూ ధర్మ రక్షణ కోసం శంకరులు దేశం నలుమూలల పీఠాలను స్థాపించి, వ్యవస్థీకృతం చేశారన్న జగమెరిగిన సత్యాన్ని ఇప్పుడు వివాదంలోకి నెట్టడం వెనుక వైష్ణవ ఆధిక్యతను చాటుకునే ప్రయత్నం ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
అద్వైత సిద్ధాంతం ద్వారా హరిహర భేదం లేదని చాటిన శంకరాచార్యులు
అద్వైత సిద్ధాంతం ద్వారా హరిహర భేదం లేదని చాటిన శంకరాచార్యులను కేవలం వైష్ణవుడి గా ముద్ర వేయడం ద్వారా ఆయన విశ్వవ్యాప్త తత్వాన్ని చినజీయర్ పరిమితం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. భజ గోవిందం రాసినంత మాత్రాన ఆయన శైవులను కాదని అర్థం కాదని, శివానందలహరి వంటి స్తోత్రాలను విస్మరించడం చరిత్రను వక్రీకరించడమేనని పండితులు మండిపడుతున్నారు. అందరూ ఆరాధించే ఒక గొప్ప గురువును ఒక వర్గానికి లేదా ఒక సిద్ధాంతానికే పరిమితం చేయడం ద్వారా సమాజంలో కొత్త విభజన రేఖలు గీస్తున్నారన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
చరిత్ర కంటే చినజీయర్‌కు ఎక్కువ తెలుసా?
ఇప్పటికే స్థిరపడిన చారిత్రక అంశాలపై వివాదాలు రేపడం ద్వారా చినజీయర్ ఏం సాధిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. రామానుజాచార్యుల సమతా మూర్తి స్ఫూర్తిని చాటుతూనే, మరోవైపు శంకరుల అస్తిత్వాన్ని ప్రశ్నించడం ద్వంద్వ వైఖరిగా కనిపిస్తోంది. ఈ వ్యాఖ్యల వల్ల వైష్ణవ, స్మార్త వర్గాల మధ్య సఖ్యత దెబ్బతినే ప్రమాదం ఉంది. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోసం లేదా తన సంప్రదాయమే ప్రాచీనమైనదని నిరూపించుకునే క్రమంలో ఇలాంటి వివాదాస్పద పాఠాలు చెబుతున్నారని ఆధ్యాత్మిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.
వివాదాలతో ఏం వస్తుంది?
శంకరాచార్యులు స్థాపించిన శృంగేరి, పూరి, ద్వారక, బద్రీనాథ్ పీఠాలకు వేల ఏళ్ల లిఖితపూర్వక చరిత్ర, గురు పరంపర ఉన్నాయి. ఎంతోమంది రాజులు, సామాన్యులు ఈ పీఠాలను దర్శించి తరించారు. ఇప్పుడు ఆధునిక కాలంలో ఆ పీఠాల ఉనికినే ప్రశ్నించడం వల్ల కలిగే ప్రయోజనం కంటే, ధార్మిక విద్వేషాలే ఎక్కువగా తలెత్తుతున్నాయి. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో మూల పురుషుల చరిత్రను వివాదాల్లోకి లాగడం వల్ల హిందూ ధర్మం బలపడకపోగా, అంతర్గత కలహాలతో బలహీనపడే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
