కాంగ్రెస్- టీడీపీ పొత్తు ఆంధ్రాలో ఆమోదానికి ఇదే పునాది

తెలుగుదేశం, కాంగ్రెస్‌… ఈ రెండు పార్టీల మ‌ధ్యా పొత్తు కుదురుతుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. చివ‌రికి, కొంత‌మంది తెలుగుదేశం నేత‌లు కూడా తీవ్రంగా వ్య‌తిరేకించారు. ఒక‌వేళ పొత్తు కుదిరితే… దాన్ని ఆంధ్రా ప్ర‌జ‌లు ఆమోదిస్తారా..? ఇది ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు తీసుకుంటున్న మ‌రో పెద్ద రిస్కా..? ఇలా చాలా అనుమానాలు, టీడీపీ వ‌ర్గాల్లో అయితే ఒకింత భ‌య‌మూ ఉంద‌ని చెప్పాలి. కాంగ్రెస్ తో టీడీపీ పొత్తును ప్ర‌తిప‌క్ష పార్టీ వైకాపా పెద్ద ఎత్తున త‌మ‌కు అనుకూల ప్ర‌చారంగా మార్చుకుని, రాజ‌కీయంగా కొంత లాభ‌ప‌డుతుంద‌నే విశ్లేష‌ణ‌లూ చాలా వ‌చ్చాయి. అందుకు త‌గ్గ‌ట్టుగానే… జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కూడా పాద‌యాత్ర‌లో విమ‌ర్శ‌లు చేస్తున్నారు కూడా! అయితే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో టీడీపీకి ఒక మంచి అవ‌కాశం వ‌చ్చింద‌ని చెప్పాలి..! అదేంటంటే… కాంగ్రెస్ పార్టీతో పొత్తు అనివార్య‌త‌ను ఏపీ ప్ర‌జ‌ల‌కు వివ‌రించేందుకు… తెలంగాణలో చంద్ర‌బాబు ప్ర‌చారం కొంత‌మేర‌కు ప్ల‌స్ అయింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా రాహుల్ గాంధీ, చంద్ర‌బాబు నాయుడు ఒకే వేదిక మీదికి రావ‌డం, ఇద్ద‌రూ క‌లిసి రోడ్ షోలు చెయ్య‌డం, వ‌రుస‌గా కొన్ని స‌భ‌లు నిర్వ‌హించ‌డం… ఇవ‌న్నీ ఏపీ ప్ర‌జ‌ల మూడ్ ను కొంత‌వ‌ర‌కూ ప్ర‌భావితం చేస్తాయ‌నే చెప్పొచ్చు. అదెలా అంటే… రాహుల్‌, చంద్ర‌బాబు ఒకే వేదిక మీదికి రావ‌డం అనేది క‌చ్చితంగా రాజ‌కీయంగా ఒక ప్ర‌త్యేక‌మైన సంద‌ర్భం కదా. అయితే, ఇది తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా జ‌రిగిపోయింది. ఒక‌వేళ‌, ఇది ఇక్క‌డ జ‌రిగి ఉండ‌క‌పోతే… లేదా, ఇదే త‌ర‌హా తొలి భేటీ లేదా స‌మావేశం లాంటిది ఆంధ్రాలో జ‌రిగి ఉంటే.. అక్క‌డ ఉండే ఫోక‌స్ వేరేలా ఉండేది. ప్ర‌తిప‌క్షాలు కూడా ఆ సంద‌ర్భానికి మ‌రింత ప్రాధాన్య‌త క‌ల్పించి విమ‌ర్శ‌లు చేసేవి. తీవ్రంగా కార్యక్రమాలు చేపట్టేవి. కానీ, ఆ అవ‌కాశాం ఇప్పుడు లేకుండా పోయింది.

టీడీపీ, కాంగ్రెస్ లు క‌లిసి ప‌నిచేయ‌డం అనేది తెలంగాణ‌లో మొద‌ట‌గా జ‌రిగిపోయింది. ఇప్పుడు, ఆంధ్రాలో కూడా చంద్ర‌బాబు, రాహుల్ క‌లిసి స‌భ‌లు పెట్టినా… అదేదో ప్ర‌త్యేక‌మైన సంద‌ర్భంగానో, విచిత్ర‌మైన క‌ల‌యిక‌గానే క‌నిపించ‌దు. ఎందుకంటే, ఏపీ ప్ర‌జ‌ల‌కు ఈ క‌ల‌యిక‌ను ముందుగానే చూసేశారు. ఓర‌కంగా చెప్పాలంటే… ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌లు వ‌చ్చేనాటికి… టీడీపీ, కాంగ్రెస్ ల మ‌ధ్య పొత్తు అనేది ఒక సాధార‌ణ‌మై విష‌యంగా ప్ర‌జ‌లకు క‌నిపించేందుకు అవ‌స‌ర‌మైన ఒక వాతావ‌ర‌ణాన్ని తెలంగాణ ఎన్నిక‌లు క‌ల్పించాయ‌నీ చెప్పొచ్చు. ‘ఇదేం కొత్త విష‌యం కాదు క‌దా’ అనే ఒక ర‌క‌మైన స్పంద‌న ఏపీ ప్ర‌జ‌ల‌కు క‌లిగేలా చేసింది. దీంతో… ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌, టీడీపీల పొత్తు అనే అంశంపై ప్ర‌తిప‌క్షాలు ఎంత పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసినా ఆ స్థాయిలో లాభ‌ప‌డే అవ‌కాశాలు త‌గ్గాయ‌నే చెప్పొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.