భారత మాజీ సైన్యాధిపతి జనరల్ ఎం.ఎం. నరవణె ఆత్మకథ ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆయుధంగా మారింది.దాన్ని పట్టుకుని రాహుల్ గాంధీ పార్లమెంట్ లో పోరాటంచేస్తున్నారు. అయితే అసలు ఆ బుక్ అధికారికం కాదని బీజేపీ అంటోంది. నిజంగానే ఆ బుక్ మార్కెట్ లోకి రాలేదు. కానీ అనధికారికంగా సర్క్యూలేట్ అవుతోంది.
పుస్తకంలో ఏముంది?
జనరల్ నరవణె తన సర్వీసు కాలంలోని కీలక పరిణామాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. ముఖ్యంగా 2020లో తూర్పు లడఖ్‌లో భారత్-చైనా మధ్య జరిగిన గాల్వన్ లోయ ఘటన , ఆ సమయంలో భారత నాయకత్వం తీసుకున్న నిర్ణయాలు, అగ్నిపథ్ పథకం ప్రవేశపెట్టే ముందు జరిగిన అంతర్గత చర్చల వంటి సున్నితమైన అంశాలను ఆయన ఇందులో ప్రస్తావించారు. దేశ భద్రతకు సంబంధించిన అత్యున్నత స్థాయి నిర్ణయాల వెనుక ఉన్న వాస్తవాలను ఆయన తన కోణంలో వివరించారు.
వివాదానికి కారణం ఏమిటి?
2023 చివరలో ఈ పుస్తకంలోని కొన్ని భాగాలు బయటకు వచ్చాయి. ఆ సమయంలో చైనా సరిహద్దు ఉద్రిక్తతలపై ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై నరవణె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అప్పటికే రాజకీయంగా సెన్సిటివ్ ఉన్న ఈ అంశాలపై ఒక మాజీ సైన్యాధిపతి బహిరంగంగా రాయడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. దీనిపై ప్రతిపక్షాలు, ముఖ్యంగా రాహుల్ గాంధీ పార్లమెంటులో ప్రస్తావించడంతో వివాదం మరింత ముదిరింది.
పుస్తకాన్ని ఎందుకు ఆపేశారు?
పుస్తకంలోని అంశాలు బయటకు వచ్చిన వెంటనే, భారత సైన్యం దీనిపై సమీక్ష రంభించింది. పబ్లిషర్లు ఈ పుస్తక ప్రచురణను ప్రస్తుతానికి నిలిపివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అధికారికంగా ఈ పుస్తకాన్ని నిషేధించనప్పటికీ, పరిపాలనాపరమైన జాప్యం పేరుతో దీనిని క్లియరెన్స్ ఇవ్వకుండా పెండింగ్‌లో ఉంచారు. రక్షణ శాఖ నుంచి అవసరమైన అనుమతులు రాకపోవడమే దీనికి ప్రధాన కారణం.
ప్రభుత్వ వైఖరి వ్యతిరేకం కాదు !
ప్రభుత్వం ఈ పుస్తకాన్ని నేరుగా తప్పు పట్టడం లేదు, అలాగని ప్రచురణకు అనుమతించడం లేదు. పుస్తకంలోని విషయాలు అబద్ధమని కానీ, దేశ భద్రతకు ముప్పు అని కానీ ప్రభుత్వం స్పష్టంగా చెప్పలేదు. కేవలం అనుమతుల ప్రక్రియను సాగదీయడం ద్వారా ఆ సమాచారం ప్రజల్లోకి వెళ్లకుండా చేస్తోంది. పార్లమెంటులో కూడా పుస్తకం ఇంకా అధికారికంగా విడుదల కాలేదు కాబట్టి దాని గురించి చర్చించలేం అనే సాంకేతిక కారణం చూపి చర్చను అడ్డుకుంటున్నారు.
ఒక మాజీ సైన్యాధిపతి తన అనుభవాలను రాసుకోవడం ప్రజాస్వామ్యంలో సహజమే అయినప్పటికీ, అది రాజకీయంగా ఇబ్బందికరంగా మారినప్పుడు వ్యవస్థలు ఎలా స్పందిస్తాయనేదానికి ఈ ఉదంతం ఒక ఉదాహరణగా నిలుస్తోంది.
