మావోయిస్టు అగ్రనేతలు తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి వంటి వారు జనజీవన స్రవంతిలోకి రావడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. అయితే, తాము పోలీసులకు లొంగిపోలేదని, అనారోగ్య కారణాల వల్ల చికిత్స కోసం వస్తుండగా పోలీసులు అరెస్టు చేశారని వారు చెబుతున్నారు. నిజానికి వారు చెబుతున్నట్లుగా అది అరెస్టు అయితే, చట్ట ప్రకారం వారిని కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపాలి. కానీ ప్రభుత్వం వారిని లొంగిపోయిన వారిగా పరిగణించి, భారీ నగదు బహుమతులు అందజేసి మీడియా ముందుకు పంపడం వెనుక ఉన్న రాజకీయం ఆసక్తికరంగా మారింది.
సరెండర్కు..అరెస్టుకు తేడా తెలియదా?
మావోయిస్టు నేతలు అరెస్టు అని ఎందుకు నొక్కి చెబుతున్నారంటే, దశాబ్దాల పాటు నమ్మిన సిద్ధాంతాన్ని వీడి లొంగిపోవడం పార్టీ పరంగా ద్రోహం గా పరిగణిస్తారు. ఇప్పటికీ అడవిలో ఉన్న కేడర్ , జైళ్లలో మగ్గుతున్న సహచర మావోయిస్టుల నుండి విమర్శలు రాకుండా ఉండేందుకు వారు ఈ అరెస్టు డ్రామాను తెరపైకి తెస్తున్నట్లు కనిపిస్తోంది. లొంగిపోయినట్లు ఒప్పుకుంటే పార్టీ ఆశయాలను తాకట్టు పెట్టారనే ముద్ర పడుతుందని, అదే అరెస్టు అంటే పోలీసుల చేతికి చిక్కామనే సానుభూతి లభిస్తుందని వారి వ్యూహం.
రాజకీయాల్లో చేరేందుకు ఉత్సాహం
ఈ అగ్రనేతలు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం మావోయిస్టులు ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయ పార్టీలు పెట్టి ఎన్నికల్లో పోటీ చేయవచ్చని ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో, అగ్రనేతలు తమపై ఉన్న కేసుల నుండి విముక్తి పొంది, పునరావాస ప్యాకేజీల ద్వారా ఆర్థికంగా స్థిరపడి, భవిష్యత్తులో ప్రధాన స్రవంతి రాజకీయాల్లో కీలకం కావాలని ఆశిస్తున్నారు. అందుకే తాము సిద్ధాంతం వీడలేదని, కేవలం నిర్బంధం వల్ల బయటకు వచ్చామని కార్యకర్తలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.
పోలీసులతో చాలా కాలంగా టచ్లో ఉన్న నేతలు
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, ఈ నేతలు చాలా కాలంగా పోలీసులతో టచ్లో ఉన్నారని, ఒక పద్ధతి ప్రకారమే ఈ లొంగుబాటు ప్రక్రియ జరిగిందని తెలుస్తోంది. కేవలం ప్రజల్లో , పార్టీ వర్గాల్లో పరువు కాపాడుకోవడానికే అరెస్టు అనే పదాన్ని వాడుతున్నారని స్పష్టమవుతోంది. లొంగిపోయిన వారికి ఇంటర్వ్యూలు ఇవ్వడానికి, స్వేచ్ఛగా తిరగడానికి ప్రభుత్వం కల్పిస్తున్న వెసులుబాటును చూస్తుంటే, ఇది ముందస్తు ఒప్పందంలో భాగమేనని అర్థమవుతోంది. మొత్తానికి మావోయిస్టు అగ్రనేతల ఈ అరెస్టు వర్సెస్ లొంగుబాటు వాదనల వెనుక పెద్ద రాజకీయ క్రీడే దాగి ఉంది.
