రాజకీయాల్లోకి రావాలంటే పదవి మీద ఎంత వ్యామోహం ఉండాలో తెలీదు కానీ, నిబంధనల ముందు మాత్రం ఎంతటి వారైనా తలవంచాల్సిందేనని నిజామాబాద్ ఘటన నిరూపించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి మేయర్ రేసులో ఉన్న శమంత నరేందర్ రెడ్డి, తన రాజకీయ భవిష్యత్తు కోసం ఏకంగా రూ. 8,16,65,000 ఆస్తి పన్నును ఏకకాలంలో చెల్లించి అందరినీ విస్మయానికి గురిచేశారు. 2009 నుంచి అంటే దాదాపు 17 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను, ఎన్నికల నోటిఫికేషన్ పుణ్యమా అని మున్సిపల్ ఖజానాకు చేర్చారు.
హైకోర్టు మెట్లెక్కినా తప్పని చెల్లింపు
నగరంలోని ఒక ప్రముఖ హోటల్లో డైరెక్టర్‌గా ఉన్న నరేందర్ రెడ్డి భార్యకు కార్పొరేటర్‌గా పోటీ చేసేందుకు నో డ్యూ సర్టిఫికేట్ అనివార్యమైంది. బకాయిలు చెల్లిస్తేనే సర్టిఫికేట్ ఇస్తామని అధికారులు తెగేసి చెప్పడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అయితే, అర్ధరాత్రి 12 గంటల వరకు సాగిన వాదనల అనంతరం, చట్టం ముందు అందరూ సమానమేనని, బకాయిలు చెల్లించాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో చేసేదేం లేక, తన రాజకీయ లక్ష్యం కోసం ఆరు భారీ డీడీల రూపంలో ఆ మొత్తాన్ని మున్సిపల్ అధికారులకు సమర్పించారు.
మున్సిపల్ ఖజానాకు కాసుల వర్షం
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చరిత్రలో ఒక వ్యక్తి నుంచి ఇంత భారీ మొత్తం పన్ను రూపంలో రావడం ఇదే మొదటిసారి. సాధారణంగా సామాన్యుల దగ్గర వందల రూపాయల పన్ను కోసం కఠినంగా వ్యవహరించే యంత్రాంగం, ఇన్నాళ్లుగా కోట్ల రూపాయల బకాయిని వసూలు చేయలేకపోవడంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా, ఎన్నికలు వస్తేనే బకాయిలు వసూలవుతాయి అనే కొత్త సూత్రాన్ని ఈ ఘటన నిజం చేసింది.
పదవి మిస్ కాకూడదని కోట్ల చెల్లింపు
మేయర్ సీటు మహిళలకు రిజర్వ్ కావడంతో నరేందర్ రెడ్డి కోట్లు కట్టేశారు. రేపు ఎన్నికల్లో ఇంకెంత ఖర్చు చేస్తారు అని సామాన్యులు చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న ఆయనకు ఈ పన్ను చెల్లింపు రాజకీయంగా మైలేజ్ ఇస్తుందా లేక విమర్శలకు దారితీస్తుందా అన్నది వేచి చూడాలి. ఏదేమైనా, కార్పొరేషన్ ఖజానా మాత్రం ఒక్క రాత్రిలో కళకళలాడింది. మేయర్ అయితే ఆ దంపతులు అంతకు అంత సంపాదించుకునేందుకు ప్రయత్నించకుండా ఉండరు.
