సివిటి టెక్నాలజీకి ”గేరు” మార్చుకుంటున్న ‘చిన్న’ కార్ల సెగ్మెంట్

ఇంధనాన్ని మండించడం వల్ల పుట్టే శక్తిని మోటారు వాహనాల చక్రాల్లోకి బదలాయించే టెక్నాలజీలలో అత్యంత అధునాతనమైనది, శక్తి వంతమైనదీ అయిన CVT (కంటిన్యువస్ వేరియబుల్ ట్రాన్స్ మిషన్) ఆడీ, బిఎండబ్ల్యూ లాంటి ‘పెద్ద’ కార్ల నుంచి నిస్సాన్ మైక్ర లాంటి ‘చిన్న’ కార్లకు చేరుకోడానికి పదిహేను సంవత్సరాలు పట్టింది.

నిరంతర రీసెర్చ్ అండ్ డెవలప్ మెంటు వల్లా, వాటి ఫలితాల వినియోగం విస్తరిస్తూండటం వల్లా టెక్నాలజీలు ఖరీదు తగ్గిపోతూంటుంది. ఏ సెగ్మెంటులోనైనా వినియోగదారులు హెచ్చుగా వుండే ఇండియా మార్కెట్ అప్ డేటెడ్ టెక్నాలజీలకి కూడా పెద్ద మార్కెట్ గానే రూపాంతరం చెందుతోంది.

ఇక్కడ చిన్న కార్ల సెగ్మెంట్ మాన్యువల్ గేర్ నుంచి ఆటోమేటిక్ గేర్ ను పక్కన పెట్టేసి ఆతరువాత వచ్చిన సివిటి లోకి నేరుగా మారిపోయినా ఆశ్చర్యంలేదని మార్కెట్ ప్రిడిక్ట్ చేస్తోంది.

ముందుగానే చెప్పినట్టు శక్తిని క్రమబద్ధం చేయగలిగితేనే అది ప్రజలకు ఉపయోగపడగలుగుతుంది. మోటారు వాహనాల్లో ఇంజన్ నిమిషానికి 6500 సార్లు తిరుగుతుంది. చక్రాలు అదేసమయంలో రెండున్నర వేల సార్లకు మించి తిరగలేవు.

ఇంజన్ వేగాన్ని చక్రాల్లోకి కంట్రోల్డ్ గా పంపడానికి వినియోగించే పళ్ళ చక్రాలను అవసరాన్ని బట్టి డ్రైవ్ చేసే వ్యక్తి మార్చుకుంటూ పోయే (మాన్యువల్) గేర్ల స్ధానంలో AT (ఆటో గేర్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్) మోటారు వాహనాలు వచ్చాయి.

ఆటో గేర్ వాహనాల్లో డ్రయివర్ చేసే పనిని కంప్యూటరైజ్డ్ కంట్రోల్ యూనిట్ చేయడం మినహా మరే మార్పూలేదు. డ్రైవ్ చేసే వ్యక్తికి కొంత సౌకర్యమే తప్ప ప్రయాణంలో అదనపు సౌకర్యమేదీ లేదు. పైగా పెట్రోల్ / డీజిల్ / గ్యాస్ వినియోగం పెరిగి ”ఆటోగేర్” ఆర్ధిక భారమైపోయింది.

రోడ్ మీద అనుకూలతలు అవకాశాలను బట్టి వేగంలో హెచ్చు తగ్గులను ( వారియేషన్లు) అదుపు చేయడానికి సాధారణంగా నాలుగు లేదా ఐదు గేర్లు వుంటాయి. ఎన్ని వేరియేషన్లనైనా మనిషి లేదా మిషన్ ఈ నాలుగైదు గేర్లలోనే ఏదో ఒక గేర్ లో నే సర్దేస్తూ వుండాలి. ఈ మెకానికల్ విధానంలో మరికొన్ని గేర్లు ను విస్తరించ వచ్చునేమో గాని వేరియేషన్లకు అనుగుణంగా లెక్కలేనన్ని గేర్ వీల్స్ అమర్చడం సాధ్యం కాదు.

ప్రతీ వేరియేషన్ కూ అనుగుణంగా మొత్తం ప్రయాణాన్ని అదుపు చేయడానికి గేర్ వీల్సే తొలగించి వాటి స్ధానంలో బెల్టులు వేయడమే స్ధూలంగా CVT (కంటిన్యువస్ వేరియబుల్ ట్రాన్స్ మిషన్) టెక్నాలజీ.

ఈ టెక్నాలజీతో వాహన ప్రయాణం మెత్తగా సాగిపోతుంది. డ్రైవర్ కి శ్రమ వుండదు. ఓనర్లే వాహనాలు నడుపుకునే మధ్యతరగతి, చిన్న కార్ల సెగ్మెంట్ లో CVT కారు ఒక అద్భుతమైన ఫీల్. అంతకు మించి ఈ టెక్నాలజీలో ఫ్యూయల్ కన్సంప్షన్ మాన్యువల్ గేర్ వెహికల్ వినియోగం కంటే కొద్దిగా తక్కువేనని కంటిపూడి నిస్సాన్ సంస్ధ సేల్స్ మేనేజర్ ఖాన్ చెప్పారు.

నిజమే ఫీల్ అయితే ఆయన చెప్పినట్టు గానే వుంది. సువిశాలమైన గ్రామీణ భారతంలో రోడ్లు ఈ టెక్నాలజీకి ఏమాత్రం అనుకూలంగా వుంటాయి. సివిటి వాహనాలు మాన్యువల్ గేర్ వాహనాల కంటే ఎక్కువ మైలేజి ఇవ్వగలవా అన్నది ఏ కారు షోరూమ్ లో అయినా ” మైలేజి ఎంత” అని మొదటి ప్రశ్న వేసే వినియోగదారుల అనుభవాలే తేల్చేస్తాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com