రివ్యూ: ‘డెవిల్’ ఇచ్చిన థ్రిల్ ఎంత‌?

తెలుగు360 రేటింగ్ 2.5/5

సీక్రెట్ ఏజెంట్ క‌థ‌లు, ఇన్వెస్టిగేష‌న్ డ్రామాలూ, దేశ భ‌క్తి గాథ‌లూ… అన్నీ వేర్వేరు జోన‌ర్లు. అన్నింటికీ మంచి స‌క్సెస్ రేటు ఉంది. మ‌రి ఈ మూడు జోన‌ర్ల‌నీ క‌ల‌గ‌లిపి కొడితే… హిట్టు రావ‌డం ఈజీ క‌దా? ఇదే న‌మ్మ‌కంతో ‘డెవిల్‌’ స్టోరీ త‌యారు చేసుకొన్నార‌నిపిస్తోంది. ఎందుకంటే… పైన చెప్పిన మూడు పార్శ్వాలూ ‘డెవిల్‌’ క‌థ‌లో ఉన్నాయి. మ‌రి క‌ల్యాణ్ రామ్ పెట్టుకొన్న న‌మ్మ‌కాన్ని ‘డెవిల్‌’ నిల‌బెట్టిందా? సీక్రెట్ ఏజెంట్ మొద‌లెట్టిన మ‌ర్డ‌ర్ మిస్ట‌రీలో… సుభాష్ చంద్ర‌బోస్ ఎందుకొచ్చాడు? ఈ ప్ర‌శ్న‌ల లోతుల్లోకి వెళ్తే..

1945 నాటి క‌థ ఇది. బ్రిటీష్ ప్ర‌భుత్వం అజ్ఞాతంలో ఉన్న సుభాష్ చంద్ర‌బోస్ కోసం అన్వేషిస్తుంటుంది. ఈలోగా సుభాష్ చంద్ర‌బోస్‌కి సంబంధించి ఓ వార్త‌… బ్రిటీష్ అధికారుల‌కు అందుతుంది. మ‌రోవైపు మ‌ద్రాస్ రాష్ట్రంలో రాస‌పాడు జ‌మిందారు సంస్థానంలో ఓ హ‌త్య జ‌రుగుతుంది. జ‌మిందారు కుమార్తెను ఎవ‌రో చంపేస్తారు. ప‌ని మ‌నిషి కూడా మాయం అవుతుంది. ఈ కేసుని ఇన్వెస్టిగేష‌న్ చేయ‌డానికి బ్రిటీష్ ప్ర‌భుత్వం సీక్రెట్ ఏజెంట్ డెవిల్ (క‌ల్యాణ్ రామ్‌)ని నియ‌మిస్తుంది. ఓ మామూలు హ‌త్య కేసుని బ్రిటీష్ ప్ర‌భుత్వం సీక్రెట్ ఏజెంట్ చేతులో పెట్ట‌డానికి గ‌ల కార‌ణం ఏమిటి? ఇంత‌కీ సుభాష్ చంద్ర‌బోస్ గురించి బ్రిటీష‌ర్ల‌కు తెలిసిన నిజం ఏమిటి? సుభాష్ చంద్ర‌బోస్ కుడిభుజం త్రివ‌ర్ణ ఎవ‌రు? ఇదంతా… ‘డెవిల్‌’ చూస్తే అర్థ‌మ‌వుతుంది.

పైన చెప్పిన‌ట్టు ఓ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ, దేశ‌భ‌క్తి క‌ల‌గ‌లిపిన క‌థ ఇది. దానికి తోడు సీక్రెట్ ఏజెంట్ త‌తంగం ఎలానూ ఉండ‌నే ఉంది. ఈ మూడు జోన‌ర్ల‌నీ మిక్స్ చేయాల‌న్న ఆలోచ‌న మంచిదే. ఎందుకంటే.. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీలూ, దేశ భ‌క్తి క‌థ‌లూ చూసీ చూసీ జ‌నం విసిగిపోయారు. వీటికి సీక్రెట్ ఏజెంట్ క‌థ‌తో లాక్ చేయ‌డం, దానికి 1945 నేప‌థ్యం సెట్ చేయ‌డం, సుభాష్ చంద్ర‌బోస్ క‌థ‌తో ముడి పెట్ట‌డం ఆస‌క్తి క‌లిగించే విష‌యాలు. తొలి స‌న్నివేశం నుంచే క‌థ‌లోకి వెళ్లే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు. ఈ క‌థ సుభాష్ చంద్ర‌బోస్ ఉనికి గురించి సాగుతుంద‌న్న విష‌యాన్ని ముందే చెప్పేశాడు. ఆ వెంట‌నే మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ మొద‌ల‌వుతుంది. అయితే ఆ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీకీ, సినిమా ప్రారంభంలో చెప్పిన సుభాష్ చంద్ర‌బోస్ ఎపిసోడ్ కీ ఉన్న సంబంధం ఏమిట‌న్న‌ది అంతుప‌ట్ట‌దు. ఆ ఇన్వెస్టిగేష‌న్ కూడా చాలా నిదానంగా సాగుతుంది. మ‌ధ్య‌లో.. పాట‌లు పెట్టి మ‌రింత డ్రాగ్ చేశాడు.

త్రివ‌ర్ణ ఎవ‌రు? అనే ప్ర‌శ్న‌కు స‌మాధానం తెలుసుకోవాల‌న్న ఆస‌క్తి ప్రేక్ష‌కుల్లో క‌లిగే లోగా.. ఆ పాత్ర‌ని ప్ర‌వేశ పెట్టి, ఆ ఉత్సాహంపైనా నీళ్లు చ‌ల్లాడు. అయితే త్రివర్ణ పాత్ర‌కు సంబంధించిన ఓ ట్విస్ట్ చివ‌ర్లో రివీల్ చేయ‌డం బాగుంది. ఆ త‌ర‌వాత వచ్చే యాక్ష‌న్ స‌న్నివేశం కూడా మాస్‌ని ఆక‌ట్టుకొనేదే. అయితే క‌థ అక్క‌డితో ముగియాల్సింది. కానీ ”క్లైమాక్స్ ఫైట్ బాకీ ఉంది, ఆల్రెడీ ఫైట‌ర్ల‌కు కూడా అడ్వాన్స్ ఇచ్చేశాం” అనుకొన్నారేమో? క‌థ‌ని ఇంకాస్త సాగ‌దీసి, మ‌రో ఫైటు జోడించి శుభం కార్డు వేశారు. నిజానికి త్రివర్ణ ఎవ‌రో తెలిసిన చోటే ఈ క‌థ‌కు ముగింపు ప‌ల‌కొచ్చు.

మ‌ర్డ‌ర్ మిస్ట‌రీని స‌గంలో ఆపేసి, సుభాష్ చంద్ర‌బోస్ క‌థ‌లోకి వెళ్లిపోవ‌డం ద‌ర్శ‌కుడి లిబ‌ర్టీ. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీని ఎక్క‌డ కావాలంటే అక్క‌డ వాడుకొని, త‌న‌కు న‌చ్చిన‌ట్టుగా స్క్రీన్ ప్లే మ‌ల‌చుకొన్నాడు. కొన్నిచోట్ల లాజిక్‌ని కూడా వ‌దిలేశాడు. సుభాష్ చంద్ర‌బోస్ నేప‌థ్యంలో చాలా క‌థ‌లొచ్చేశాయి. ఇప్పుడు మ‌ళ్లీ అదే పాయింట్ ప‌ట్టుకోవ‌డంలో నావ‌ల్టీ లేదు. కాక‌పోతే.. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీతో ఈ క‌థ‌ని మొద‌లెట్టి, ఆ త‌ర‌వాత సుభాష్ చంద్ర‌బోస్ ఎపిసోడ్ లోకి వెళ్ల‌డ‌మే ఈ క‌థ‌లో కొత్త‌ద‌నం. ఆమ‌ర్డ‌ర్ మిస్ట‌రీ, దాని చుట్టూ సాగే ఇన్వెస్టిగేష‌న్ చ‌ప్ప‌గా సాగ‌డంతో… ద‌ర్శ‌కుడి ఆలోచ‌న‌కు త‌గిన ప్ర‌తిఫ‌లం ద‌క్క‌లేదు.

క‌ల్యాణ్ రామ్ క‌థ‌ల ఎంపిక విష‌యంలో ఎప్పుడూ అసంతృప్తికి గురి చేయ‌లేదు. ఈసారీ అంతే. త‌న న‌ట‌న‌లో కొత్త‌ద‌నం చూసే అవ‌కాశం లేదు కానీ, పాత్ర ప‌రంగా మాత్రం క‌ల్యాణ్ రామ్ కి కొత్తే! సీరియ‌స్‌గా ప‌లికే సంభాష‌ణ‌ల్లో, క‌ల్యాణ్ రామ్ మాడ్యులేష‌న్ బాగుంది. రెగ్యుల‌ర్ హీరోయిజంని వ‌దిలి, అప్పుడ‌ప్పుడూ ఈ త‌ర‌హా ప్ర‌య‌త్నాలు చేయ‌డం అభినందించ ద‌గిన విష‌యం. సంయుక్త మీన‌న్ ది కూడా రెగ్యుల‌ర్ హీరోయిన్ పాత్ర కాదు. త‌న వ‌ర‌కూ హుందాగా, ప‌ద్ధ‌తిగా క‌నిపించింది. మాళ‌విక నాయ‌ర్ పాత్ర స‌ర్‌ప్రైజింగ్ గా ఉంటుంది. త‌న‌కు త‌గిన పాత్ర ద‌క్కింది. స‌త్య ఉన్నా, కామెడీ పండ‌లేదు. పాత్ర అలాంటిది.

1945 నాటి క‌థ ఇది. ఆ వాతావ‌ర‌ణాన్ని సృష్టించ‌డానికి టెక్నిక‌ల్ టీమ్ బాగా క‌ష్ట‌ప‌డింది. ఆర్ట్ విభాగం ప‌ని తీరు బాగుంది. నేప‌థ్య సంగీతం హ‌ర్ష‌వ‌ర్థ‌న్ రామేశ్వ‌ర్ ప‌నిత‌నం క‌నిపిస్తుంది. పోరాట ఘ‌ట్టాల్లో తాను ఇచ్చిన బీజియ‌మ్స్ వ‌ల్ల ఎలివేష‌న్లు బాగా కుదిరాయి. క‌థ‌, స్క్రీన్ ప్లే, సంభాష‌ణ‌ల బాధ్య‌త శ్రీ‌కాంత్ విస్సా చూసుకొన్నారు. క‌థ ఎలా ఉన్నా, క‌థ‌నంలో ప‌ట్టు అనుకొన్నంత‌గా కుద‌ర్లేదు. ఓ థ్రిల్ల‌ర్‌ని దేశ‌భ‌క్తి జోన‌ర్‌కి మిక్స్ చేయాల‌న్న ఆలోచ‌న బాగున్నా – ఆచ‌ర‌ణ‌లో అనుకొన్నంత స‌ఫ‌లీకృతం కాలేక‌పోయారు. ఈ సినిమా ద‌ర్శ‌క‌త్వం క్రెడిట్స్ విష‌యంలో ఓ వివాదం చెల‌రేగింది. ఈ సినిమా ఫ‌లితం చూశాక‌.. అది పూర్తిగా స‌ద్దుమ‌ణిగే అవ‌కాశం ఉంది. పెద్ద‌గా అంచ‌నాల్లేకుండా థియేట‌ర్ల‌కు వెళ్తే ‘డెవిల్’ ఓకే అనిపిస్తాడు. టైటిల్‌, కాన్సెప్ట్, జోన‌ర్లు ఇవ‌న్నీ చూసి ఆశ ప‌డి థియేట‌ర్ల‌కు వెళ్తే.. నిరాశ త‌ప్ప‌దు.

-అన్వర్

తెలుగు360 రేటింగ్ 2.5/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close