సంతోష్ శోభన్ టాలెంట్ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. చాలా సహజంగా నటిస్తాడు. పక్కింటి కుర్రాడు పాత్రలకు పర్ఫెక్ట్. కానీ హిట్లే పడడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొంత గ్యాప్ తీసుకొని సంతోష్ చేసిన సినిమా ‘కపుల్ ఫ్లెండ్లీ’. తెలుగు తమిళ భాషల్లో ఈ సినిమాను ఈనెల 14న విడుదల చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. యువ నిర్మాత ధీరజ్ మొగలినేని భాగస్వామి.
సంతోష్ కెరీర్‌కి చాలా కీలకమైన సినిమా ఇది. యూవీ క్రియేషన్స్ కి కూడా హిట్టు కొట్టడం చాలా అవసరం. అందుకే అన్నిరకాలుగా జాగ్రత్తలు తీసుకొన్నారు. ఈ సినిమా కంటెంట్ పై చిత్రబృందం చాలా నమ్మకంగా ఉంది. అందుకే రెండు రోజుల ముందే ప్రీమియర్లు వేయాలని ఫిక్సయ్యారు. 12 నుంచి పెయిడ్ ప్రీమియర్లు మొదలైపోతాయి. 13న రాత్రి ఆటలతో ఈ సినిమాని విడుదల చేసేస్తున్నారు. రెండు రోజుల ముందే ఇలా హడావుడి చేస్తున్నారంటే అది నిర్మాతల గట్ ఫీలింగ్ అని చెప్పొచ్చు. ”ప్రీమియర్లలో రిస్క్ తో పాటు లాభమూ ఉంటుంది. సినిమా బాగుంటే మౌత్ పబ్లిసిటీ పెరుగుతుంది. చిన్న సినిమాలకు అది చాలా కీలకం. సినిమా బాగోలేకపోయినా అలాంటి టాకే వస్తుంది. ఈ సినిమాపై మాకు నమ్మకం ఉంది. కాబట్టి.. రెండు రోజుల ముందే విడుదల చేస్తున్నాం” అన్నారు ధీరజ్ మొగలినేని. తమిళంలోనూ ఈ సినిమాని వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో విడుదల చేయాలన్నది ప్లాన్.
