రాజకీయాల్లో మతం, నైతికత, నిజాయితీ అనేవి ఎప్పుడూ చర్చనీయాంశాలే. తమిళనాడు ఎన్నికల్లో టీవీకే అధినేత విజయ్ సాధించిన విజయాన్ని వైసీపీ నేతలు జగన్ ఘనతగా చెప్పుకుంటున్నారు. దీంతో చాలా అంశాలు చర్చకు వస్తున్నాయి. వాటిలో ఒకటి మతం. క్రైస్తవ మతానికి చెందిన విజయ్, తన మతాన్ని దాచుకోకుండా, బహిరంగంగా చర్చికి వెళ్తూ, మోకాళ్లపై నడిచి ప్రార్థనలు చేస్తూనే ప్రజల మద్దతు కోరారు. ఎక్కడా ఎవర్నీ మోసం చేయకుండా, తన అస్తిత్వాన్ని చాటుకుంటూనే ఆయన చేసిన నిజాయితీ రాజకీయాల కే తమిళ ప్రజలు పట్టం కట్టారు.
అస్తిత్వాన్ని చాటుకున్న విజయ్.. అటూ ఇటూ జగన్?
విజయ్ తన పేరును సి. జోసెఫ్ విజయ్ అని గర్వంగా చెప్పుకుంటూ, తన మత విశ్వాసాలకు అనుగుణంగా నడుచుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలోనూ ఆయన ఎక్కడా హిందూ ఓట్ల కోసం తన మతాన్ని దాచలేదు. దీనికి భిన్నంగా ఏపీలో జగన్ మోహన్ రెడ్డి వ్యవహారశైలిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జగన్ తాను క్రైస్తవుడనని తెలిసే ప్రజలు 2019లో ఓట్లేశారనే సంగతిని మర్చిపోయారు. ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం హిందూ దేవాలయాల సందర్శనలు, హోమాల్లో పాల్గొనడం వంటివి చేసి హిందువులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. విజయ్ నుండి నేర్చుకోవాల్సింది ఫోటోలు పెట్టుకోవడం కాదు, రాజకీయాల్లో ఉండాల్సిన కనీస నైతికత , నిజాయితీ. తన మత ధృవీకరణ విషయంలో విజయ్ చూపిన ధైర్యం, జగన్‌లో ఎందుకు లేదనే ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తోంది.
నైతికత లేని అధికారం నిలబడదు!
విజయ్ 108 స్థానాల్లో గెలిచి ఒంటరి పోరాటం ద్వారా తన సత్తా చాటారు. ఆయన మైనారిటీల ఓట్లతో పాటు అన్ని వర్గాల ఆదరణ పొందడానికి కారణం ఆయన మాటల్లోని స్పష్టత. జగన్ తన రాజకీయ ప్రస్థానంలో అన్ని మతాలను సమానంగా గౌరవిస్తున్నామని చెబుతున్నప్పటికీ, అది కేవలం ఓట్ల కోసమేనా అనే అనుమానాలు ప్రజల్లో కలిగాయి. అందుకే 2024 ఎన్నికల్లో ఆయనకు ఘోర పరాజయం ఎదురైందని, కనీసం ఇప్పటికైనా విజయ్ లాంటి కొత్త తరం నాయకుడి నుండి ఓపెన్ పొలిటికల్ ఐడెంటిటీ ని జగన్ నేర్చుకోవాల్సింది. తన మతాన్ని దాచేసుకుని హిందూ అని నమ్మించే ప్రయత్నం కన్నా.. తన ప్రభువు బిడ్డలని ధైర్యంగా చెప్పుకుంటేనే నిజాయితీగా ఉంటుంది. నైతికతగా ఉంటుంది.
మార్పు మొదలైంది!
దక్షిణాది రాజకీయాల్లో కేవలం గ్లామర్ ఉంటే సరిపోదని, ప్రజలకు నాయకుడిపై నమ్మకం కలగాలంటే నిజాయితీ ఉండాలని విజయ్ నిరూపించారు. జగన్ రెడ్డి తన రాజకీయ వ్యూహాలను మార్చుకుని, తన మత విశ్వాసాలను దాచుకోకుండా లేదా మభ్యపెట్టకుండా నిజాయితీగా రాజకీయాలు చేస్తేనే ప్రజలు మళ్లీ ఆదరిస్తారనేది బహిరంగ సత్యం. మరి విజయ్ నుండి జగన్ నైతిక పాఠాలు నేర్చుకుంటారా? లేక కేవలం క్రెడిట్ చోరీకే పరిమితమవుతారా అన్నది వేచి చూడాల్సిందే.


