ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు అటు దివ్వెల మాధురీతో కలిసి సోషల్ లైఫ్, రీల్స్ , చీరల వ్యాపారంతో పాటు ఇటు రాజకీయాలు కూడా ఒకే సమయంలో చక్కబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైసీపీ నుంచి సస్పెండ్ చేసినా ఇంకా ఆ పార్టీలో తనకు అవకాశం ఉంటుందని జగనన్న తన శ్రమను గుర్తిస్తాడని ఆశలు పెట్టుకుంటున్నాడు. అందుకే జగన్ పుట్టిన రోజున ఓ వీడియో కూడా విడుదల చేశారు.
ఇప్పుడు రాజకీయంగా మరోసారి తాను యాక్టివ్ గా ఉన్నానని గుర్తు చేసేందుకు.. టెక్కలికి వెళ్లే నేషనల్ హైవేపై ఓ వీడియో చేశారు. దివ్వెల మాధురికి తన అనుచరుడు అయిన అప్పన్న అనే వ్యక్తి ఫోన్ చేశారని ధర్మాన కృష్ణదాస్ తనపై దాడికి ప్లాన్ చేశారని చెప్పారని ఆ వీడియోలో చెప్పారు. తాను చావుకు భయపడే వ్యక్తిని కాదని.. తనపై దాడికి రావాలని సవాల్ చేశారు. ఆయన మాట్లాడుతూంటే దివ్వెల మాధురీ వీడియో తీసినట్లుగా ఉంది.
దువ్వాడను గత ఎన్నికల వరకూ సీరియస్ గా నే తీసుకునేవారు. కానీ ఆయన తన వివాహేతర బంధాన్ని బయట పెట్టుకుని రోడ్డున పడ్డప్పటి నుండి ఆయనను కామెడీగానే చూస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయన ట్రోల్ స్టఫ్ గా మారిపోయాయి. దివ్వెల మాధురీతో కలిసి ఆయన చేసే వీడియోలు.. రీల్స్ అన్నీ ఆయన ఇమేజ్ మార్చేశాయి. ఇప్పుడు పొలిటికల్ గా కూడా ఆయనను ఎవరూ సీరియస్ గా తీసుకోవడం లేదు. ఆయినా ఆయన తన ప్రయత్నం తాను చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాల్లోనూ దివ్వెల మాధురీ మార్కే కనిపిస్తోందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.
