బ‌దిలీలకు బ‌హుమ‌తులు!

ఆంధ్ర ప్ర‌దేశ్‌లో ప్ర‌స్తుతం ప్ర‌భుత్వోద్యోగుల బ‌దిలీల ప‌ర్వం సాగుతోంది. బ‌దిలీ కావాలంటే పోస్టును బ‌ట్టీ రేటు నిర్ణ‌యించేశార‌ని ఆరోప‌ణ‌లు గుప్పుమంటున్నాయి. ప్ర‌తిప‌క్షం ఊరుకుంటుందా! ఆ పోస్టుకు ఇంత‌, ఈ ఊరికైతే అంత అంటూ నాలుగు ఎక్కువ చేసి, మ‌రీ ప్ర‌చారంలోకి తెచ్చేస్తోంది. వీరి ఆరోప‌ణ‌లు నిజ‌మో కాదో తెలియ‌దు (ఎందుకంటే దీన్ని దేవుడు కూడా నిరూపించ‌లేడు కాబ‌ట్టి) కానీ .. ఇదే నిజ‌మైతే పార‌ద‌ర్శ‌క‌త‌కు పాత‌రేసేసిన‌ట్లే భావించ‌వ‌చ్చు. ప్ర‌భుత్వోద్యోగుల బ‌దిలీల‌ను సాధార‌ణంగా మూడేళ్ళకోసారి ప‌రిపాల‌న ప్ర‌క్రియ‌లో భాగంగా చేప‌డుతుంటారు. వీటిలో ప‌నిష్మెంట్ ట్రాన్స్ఫ‌ర్లు, కారుణ్య బ‌దిలీలూ, భార్య‌భ‌ర్త‌ల‌ను ఒకేచోట చేర్చేందుకు వీలుగా బ‌దిలీలు జ‌రుగుతుంటాయి. ఇక్క‌డే బ‌దిలీ చేసే అధికారికో.. సంబంధిత మంత్రికో ఎందుకు ఊరికే చేయాల‌నే తెగులు పుట్టింద‌నుకోండి. క్విడ్‌ప్రోకో తెర‌మీద‌కొస్తుంది. నీకు కోరిన‌ చోటికి బ‌దిలీ చేస్తే.. నాకేమిస్తావ్ అంటూ చేయి జాస్తారు. స‌రే సొంతూళ్ళో ప‌డుండ‌చ్చు క‌దా అనే ఆశ‌తో చేయి త‌డుపుతాడు అవ‌త‌లి ఉద్యోగి. ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉంటుంది. డ‌బ్బులు కురిపించే సీట్లు కొన్నుంటాయి. రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యాల్లోనూ, ఎక్స‌యిజ్ కార్యాల‌యాల్లోనూ బ‌దిలీలకు ఎక్కువ రేటు ప‌లుకుతోందంటున్నారు. వాటికి డిమాండ్ బాగా ఉంటుంది. 25 నుంచి 30 ల‌క్ష‌ల వ‌ర‌కూ ప్ర‌స్తుతం డిమాండ్ చేస్తున్నార‌ని వినిపిస్తోంది. ఇది టీడీపీ ప్ర‌భుత్వానికే ప‌రిమిత‌మా అని ప్ర‌శ్నించుకోవ‌డం అమాయ‌క‌త్వ‌మ‌వుతుంది. కాంగ్రెస్ పాల‌న‌లోనూ ఇలాంటి బ‌ల్ల కింద వ్య‌వ‌హారాలు ముమ్మ‌రంగా సాగాయి. ఇచ్చే వాడు పుచ్చుకునే వాడు అని రెండే ర‌కాలు బ‌దిలీల్లో. అంతే ప్ర‌జా ప్ర‌యోజ‌నం ఎంత‌మాత్ర‌ముండ‌దు. ఈ త‌ర‌హా అవినీతిని ఎవ‌రు ప‌ట్టుకోగ‌ల‌రు? ఎవ‌రు అదుపుచేయ‌గ‌ల‌రు? స‌్వీయ నియంత్ర‌ణ ఉంటేనే త‌ప్ప ఇది సాధ్యం కాదు. ఈ బ‌దిలీ వ‌ల్ల ఆ ఉద్యోగికి ఇంత లాభ‌మ‌నే ఆలోచ‌నే దీనికి కార‌ణం. మంత్రులు కూడా ఇలాంటి ప‌నుల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆరోప‌ణ‌లు వినిపిస్తుండ‌డం దేనికి సంకేతం. ఇక ప్ర‌జాసేవ అనే మాట‌కు అర్థ‌మేమిటి? ఇందుకేనా వారు ప‌దవుల కోసం కాట్లాడుకునేది? ఇందుకేనా వారు ప్ర‌తిప‌క్షంలో నెగ్గి.. అధికార పార్టీలోకి వ‌చ్చేందుకు పోటీప‌డేది? య‌థా రాజా త‌థా ప్ర‌జా అంటారు. ఈ సూత్రం మంత్రివ‌ర్గానికీ వ‌ర్తిస్తుందా. వ‌ర్తిస్తే మంత్రివ‌ర్గ అధినేత‌ను అనుమానించాల్సి ఉంటుంది. అధినేత అయిన ముఖ్య‌మంత్రి దీనికి అడ్డుక‌ట్ట వేయాలి. క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాలి. అప్పుడే ప్ర‌మాణ స్వీకారోత్స‌వ స‌మ‌యంలో చేసిన‌, ప్ర‌జా సంక్షేమానికి క‌ట్టుబ‌డి ఉంటాను అన్న ప్ర‌తిన‌కు అర్థం చెప్పిన‌ట్ల‌వుతుంది. కాదంటారా!

-సుబ్ర‌హ్మ‌ణ్యం విఎస్ కూచిమంచి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com