హైదరాబాద్ వెస్ట్ జోన్, ముఖ్యంగా కోకాపేట, తెల్లాపూర్ వంటి హాట్ స్పాట్లలో ప్రీ-ల్యాంచ్ విక్రయాల వ్యవహారం ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో అతిపెద్ద చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా రెరా నిబంధనల ప్రకారం, ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే విక్రయాలు జరపాలి. కానీ, మార్కెట్లో పేరున్న కొన్ని బడా సంస్థలు కూడా నిబంధనలను తుంగలో తొక్కి సాఫ్ట్ ల్యాంచ్, ప్రీ-ల్యాంచ్ పేరుతో భారీగా నిధులు వసూలు చేస్తున్నాయి. ఈ సంస్థలకు ఎలాంటి ప్రత్యేక అనుమతులు ఉండవు సదా, కేవలం తమ బ్రాండ్ ఇమేజ్ను అడ్డం పెట్టుకుని ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి.
చట్టం ముందు చిన్న సంస్థలైనా, బడా డెవలపర్లైనా సమానమే. అయితే, పెద్ద సంస్థలు విక్రయించే సమయంలో ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్స్, షేర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ వంటి క్లిష్టమైన చట్టపరమైన లొసుగులను వాడుకుంటూ, అవి నేరుగా ఫ్లాట్ విక్రయాలు కావని నమ్మిస్తాయి. దీనివల్ల సాంకేతికంగా రెరా పరిధి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాయి. ఇదే సమయంలో, ఈ సంస్థల వెనుక ఉండే రాజకీయ అండదండలు , ఆర్థిక బలం కారణంగా అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
బిల్డర్ల అసోసియేషన్లు ఇప్పుడు ఈ ధోరణిపై సీరియస్ గా ఉన్నాయి. ప్రీ-ల్యాంచ్ ఆఫర్ల వల్ల ప్రాజెక్టులు సకాలంలో పూర్తికాకపోవడమే కాకుండా, మార్కెట్ మొత్తం అస్థిరతకు లోనవుతుందని అవి హెచ్చరిస్తున్నాయి. బడా సంస్థలు ఒక ప్రాజెక్ట్ నుంచి వసూలు చేసిన నిధులను మరో కొత్త ప్రాజెక్ట్ కోసం భూములు కొనడానికి మళ్లించడం వల్ల, పాత ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి సంస్థలపై కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా, వారి లైసెన్సులను రద్దు చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
తక్కువ ధరకే వస్తోంది కదా అని బడా బ్రాండ్లను నమ్మి ప్రీ-ల్యాంచ్ లో ఇన్వెస్ట్ చేయడం పెద్ద రిస్క్ తో కూడుకున్న పని. ఎంతటి పెద్ద సంస్థ అయినా రెరా రిజిస్ట్రేషన్ నంబర్ లేకుండా చేసే విక్రయాలు చట్టవిరుద్ధమే. ప్రభుత్వం , రెరా యంత్రాంగం పారదర్శకతను పెంచకపోతే, భవిష్యత్తులో ఐటీ కారిడార్లో రియల్ ఎస్టేట్ కుప్పకూలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, నిబంధనలు ఉల్లంఘించే కార్పొరేట్ సంస్థలపై కూడా కఠిన చర్యలు తీసుకున్నప్పుడే సామాన్య కొనుగోలుదారుడికి భరోసా లభిస్తుంది.


