హైదరాబాద్ మహానగరం ఇప్పుడు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ముఖ్యంగా పశ్చిమ హైదరాబాద్‌లోని నార్సింగి, కోకాపేట పరిసర ప్రాంతాలలో ఆకాశహర్మ్యాల నిర్మాణం సరికొత్త పుంతలు తొక్కుతోంది. తాజాగా హెచ్ఎండీఏ మరో ఐదు మెగా ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేసింది. ఇవన్నీ 50 నుంచి 60 అంతస్తుల మధ్య ఉండేలా డిజైన్ చేయడంతో, ఈ ప్రాంతం త్వరలోనే గ్లోబల్ సిటీల మాదిరిగా కనిపించనుంది.
నిర్మాణ రంగంలో వస్తున్న ఈ విప్లవాత్మక మార్పుల వల్ల ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లుక్ పూర్తిగా అంతర్జాతీయ స్థాయికి చేరుకోనుంది. 60 అంతస్తుల వరకు భవనాలు నిర్మించడం వల్ల కేవలం నివాస అవసరాలే కాకుండా, కమర్షియల్ హబ్‌గా కూడా ఈ ప్రాంతం తన పట్టును పటిష్టం చేసుకుంటోంది. ముఖ్యంగా కోకాపేట నియోపోలిస్ మాస్టర్ ప్లాన్ అమల్లోకి రావడం, రోడ్ల విస్తరణ , మెట్రో అనుసంధానం మెరుగుపడటం ఈ భారీ ప్రాజెక్టులకు వరంగా మారింది.
హైదరాబాద్ ఇప్పుడు కేవలం సాఫ్ట్వేర్ హబ్ మాత్రమే కాదు, వర్టికల్ డెవలప్మెంట్ లో కూడా దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తోంది. ఇటువంటి మెగా టవర్లలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన స్కై విల్లాస్ , హెలిప్యాడ్లు , గ్రీన్ బిల్డింగ్ టెక్నాలజీని వాడుతున్నారు. ఐటీ నిపుణులు , గ్లోబల్ ఇన్వెస్టర్లు ఈ ప్రాంతంలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతుండటంతో, భూముల ధరలు, ఫ్లాట్ల విలువలు గణనీయంగా పెరుగుతున్నాయి.
ప్రభుత్వం కూడా ఈ తరహా భారీ నిర్మాణాలకు అవసరమైన అనుమతులను బిల్డ్ నౌ వంటి అత్యాధునిక సింగిల్ విండో సిస్టమ్ ద్వారా వేగంగా మంజూరు చేస్తోంది. టీడీఆర్ నిబంధనలలో సడలింపులు ఇవ్వడం వల్ల డెవలపర్లు మరిన్ని అంతస్తులు నిర్మించేందుకు అవకాశం కలిగింది. రాబోయే రెండు మూడేళ్లలో నార్సింగి, కోకాపేట స్కైలైన్ దుబాయ్ లేదా సింగపూర్ తరహాలో గగనతలాన్ని తాకుతూ నగర వాసులకు కనువిందు చేయనుంది.
