తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్రకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ముద్దాడ రవిచంద్ర 1996 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, విభజనానంతర ఏపీలోనూ పలు కీలక బాధ్యతలను ఆయన సమర్థవంతంగా నిర్వహించారు. గతంలో విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌గా, సంక్షేమ శాఖ కార్యదర్శిగా, ఆర్థిక శాఖలో కీలక బాధ్యతల్లో పనిచేశారు. ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్నారు.
పరిపాలనపై పట్టు, వివాదరహితుడనే పేరున్న రవిచంద్రను తిరుమల వంటి సున్నితమైన యంత్రాంగంపై పర్యవేక్షణ కోసం ప్రభుత్వం ఎంచుకుంది. పూర్తిస్థాయి ఈవోను నియమించే వరకు ఆయన ఈ అదనపు బాధ్యతలను నిర్వర్తించనున్నారు. అశోక్ కుమార్ సింఘాల్ ప్రస్తుతం ఈవోగా ఉన్నారు. ఆయతే ఆయన వైసీపీ హయాంలోనూ ఈవోగా ఉన్నారు. కానీ ఆ సమయంలో కల్తీ నెయ్యి స్కాం జరిగినా.. పట్టించుకోలేదని సిట్ తేల్చింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సిట్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.
సిట్ చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసిన వారిలో మాజీ ఈవో ధర్మారెడ్డితో పాటు బాలాజీ ఉన్నారు. వీరు ఇప్పటికే రిటైర్ అయ్యారు. సర్వీసులో ఉన్న సింఘాల్ ఇప్పుడు యాధృచ్చికంగా మరోసారి టీటీడీలోనే ఉండటంతో బదిలీ చేయక తప్పలేదు.
