సోషల్ మీడియాలో మూకస్వామ్యం చొరబాటు!

భారత ప్రధాని నరేంద్రమోదీ ఒక ట్వీట్ పోస్టు చేశారంటే 1కోటీ87 లక్షల మంది నేరుగా చదువుతారు…దాన్ని ఎందరు రీట్వీట్ చేస్తే ఆ అందరికీ ఎందరెందరు ఫొల్లొవెర్స్ వున్నారో వారందరి టైమ్ లైన్ మీద కూడా ఆట్వీట్ ప్రత్యక్షమౌతుంది. ఇదికాక మోదీ కి ఫేస్ బుక్ పేజి, యూట్యూబ్ మొదలైన సోషల్ మీడియా నెట్ వర్క్ లో మరో 2 కోట్ల 80 లక్షల మంది ఫొల్లొవెర్స్ వున్నారు.

2014 ఎన్నికల నాటికి దేశవ్యాప్తంగా 260 లోక్ సభా నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేయగల సాధనంగా ఫేస్ బుక్ వుంది. ఆ 260 సీట్లో రాజమండ్రితో సహా అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో 16 స్ధానాలు వున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో టికెట్ కావాలంటే ”నీ ఫేస్ బక్ పేజీకి కనీసం 25 వేల లైకులు వున్నాయా” అని కొందరు అభ్యర్ధుల్ని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆరా తీశారని వార్తలు వచ్చాయి. నవ్వులాటగానే ఈ ప్రశ్నను అడిగి వుండవచ్చు. కానీ, ఆ ప్రస్తావన రాజకీయాల్లో సోషల్ మీడియా అనివార్యతను సూచిస్తోంది.

ఈజిప్టులో విప్లవమొచ్చినా, నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చినా అందుకు అనుగుణంగా వ్యక్తుల్ని మలచడానికి కమ్యూనికేటర్ గా కీలక పాత్ర నిర్వహిస్తున్నది సోషల్ మీడియానే…ఇంత శక్తివంతమైన సమాచార సాధనంలో రెండోవాదనను అంగీకరించని అసహన శక్తులు చొరబడి సమాజన్ని ఉద్దేశ్య పూర్వకంగా దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నాయి.

పాకిస్తాన్ లో వున్న టర్రరిస్టుల పట్ల శత్రుభావం వుంటే అర్ధం చేసుకోవచ్చు. పాకిస్తాన్ ప్రజలను శత్రువులు గా చూడటం అర్ధం లేదు. ఈ విషయమే ప్రశ్నిస్తే నువ్వు దేశద్రోహివి పాకిస్తాన్ వెళ్ళిపో అని అనేకమంది ట్వీట్ లతో ముంచెత్తు తున్నారు. ఇది కేవలం మూర్ఖత్వం మాత్రమే కాదు. ఒక భావను ప్రవేశపెట్టే మూకస్వామ్యం…ఫాసిజం…

ఇందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. టీవీ తెరపై చూపించిందే నిజమని ప్రజలు భావిస్తారు. వీడియోలను మార్ఫింగ్‌ చేసిన దుష్పలితాన్ని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వ విద్యాలయంలో జరిగిన సంఘటనలో చూశాం. మొబైల్‌ ఫోన్‌లో చిత్రీకరించిన దృశ్యాలను మార్చి ఎక్కడో ఇవ్వబడిన నినాదాలను ఈ మార్చబడిన వీడియోకు సంబంధించినవిగా జతచేస్తూ అక్కడి విద్యార్ధులను దేశద్రోహులుగా ముద్ర వేశారు. ఈ వీడియోలు చాలా వేగంగా ప్రజల్లోకి వెళ్ళి, ప్రజలు ఈ తప్పుడు చిత్రాల గురించి తెలుసు కునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న ఈ విధమైన మోసాలకు రుజువులున్నప్పటికీ ఏ విధమైన శిక్షా లేకుండా పోతోంది. తమకు శత్రువులుగా భావించిన వారి పట్ల ప్రజల్లో గందరగోళం, భయం సృష్టించేందుకు బలమైన ఫాసిస్ట్‌ శక్తులు ఈ రకంగా సంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తున్నాయి.

ప్రభుత్వం మౌనం పాటించడంద్వారా ఈ ధోరణులను పెంచి పోషిస్తోంది.అల్లరిమూకలు ప్రభుత్వానికి నచ్చని అభిప్రాయాలు వ్యక్తం చేసే వారిపై దాడులు చేస్తూ వారిని లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ దాడుల స్థాయిని ప్రదర్శించే ప్రేరేపకులు, హింసానేరాలకు పాల్పడే వారికి ఏ విధమైన శిక్షలు లేకపోవడమే ఆశక్తులకు ఊపిరి.

నరేంద్రమోదీ తన సోషల్‌ మీడియా ద్వారా అద్భుతమైన భావాలను వెలిబుచ్చుతూంటారు. ఆయన సమర్ధకులు మాత్రం స్వీయ నియంత్రణను కోల్పోతుంటారు. దేశ శత్రువులుగా ముద్రవేయబడిన వారికి వ్యతిరేకంగా తిట్ల దండకాలతో దాడులు చేసే విధంగా ప్రజల మధ్య చిచ్చు రగిల్చే కేంద్రాలుగా సోషల్‌ మీడియా తయారయింది. కొద్దిగా భిన్నాభిప్రాయం వ్యక్తంచేసేవారిపై పచ్చి అబద్ధాలతో సోషల్‌ మీడియా ద్వారా దాడులు చేస్తున్నారు. ఈ అత్యుత్సాహంతో చేసే దాడులు రెండు లక్ష్యాలను నెరవేరుస్తాయి. ఒకటి ఒకే భావాలు కలిగిన వారిని ఐక్యం చేసి ప్రేరేపించడం, రెండవది వారి శత్రువులను భయకంపితులను చేయడం.

భారత్‌లో ఏం జరుగుతోందో టర్కీ, థాయ్ లాండ్‌, ఈజిప్ట్‌ దేశాలలో కూడా అలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఈ దేశాలలో అధికార యంత్రాంగం భిన్నాభిప్రాయాలు వెలిబుచ్చినవారిని, ప్రతిపక్షాలకు చెందినవారిని అణచివేసే చర్యలు చేపట్టింది. బెదిరింపుల ద్వారా, న్యాయపరమైన చర్యల ద్వారా అవసరమైన సందర్భంలో వారిని కట్టడి చేసే ప్రయత్నం చేసింది. భారత్‌లో మాదిరిగా ఈ దేశాల్లో కూడా ‘జాతీయవాదం’ పేరిట నియంతృత్వ పాలన కొనసాగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com