కొట్లాట స‌భ‌కు అన్ని పార్టీలూ మ‌ద్ద‌తు ఇస్తాయా..?

ఎట్టుకేల‌కు కొలువుల కొట్లాట స‌భ తేదీ ఖారారు అయింది. ఇప్ప‌టికే రెండుసార్లు ఈ సభ వాయిదా ప‌డింది. స‌భ నిర్వ‌హ‌ణ‌కు అనుమ‌తులు కావాలంటూ పోలీసుల్ని టీజేయేసీ కోరుకుతున్నా… వేర్వేరు కార‌ణాలను చూపిస్తూ అనుమ‌తులు ఇవ్వ‌లేదు. కానీ, ఎట్టుకేల‌కు డిసెంబ‌ర్ 4న స‌భ నిర్వ‌హించుకునేందుకు పోలీసులు అనుమ‌తి ఇచ్చారు. దీంతో కొలువుల కొట్లాట స‌భ‌ను భారీ ఎత్తున నిర్వ‌హించాల‌ని టీజేయేసీ ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తోంది. దీని కోసం కోదండ‌రామ్ అధ్య‌క్ష‌త‌న స్టీరింగ్ క‌మిటీ స‌మావేశం జ‌రిగింది.

నిజానికి, ఈ స‌భను దిగ్విజ‌యం చేసుకోవ‌డం జేయేసీకి అత్య‌వ‌స‌రం అని చెప్పాలి. ఎందుకంటే, గ‌డ‌చిన కొన్ని నెల‌లుగా తెలంగాణ‌లో జేయేసీ చాలా యాక్టివ్ గా క‌నిపిస్తోంది. అమ‌ర‌వీరుల స్ఫూర్తి యాత్ర అంటూ కొన్ని జిల్లాల్లో కోదండ‌రామ్ ప‌ర్య‌టించి వ‌చ్చారు. త‌మ స‌భ‌ల‌కు ఎలాంటి జ‌న స‌మీక‌ర‌ణ చేయ‌క‌పోయినా, మంచి స్పంద‌న వ‌చ్చింద‌నే ఆత్మ‌విశ్వాసం జేయేసీ వ‌ర్గాల్లో నిండింది. ఈ ద‌శ‌లోనే జేయేసీని రాజ‌కీయ పార్టీగా మార్చాల‌నే చ‌ర్చ కూడా తెర‌మీదికి వ‌చ్చింది. జేయేసీలో చాలామంది కోరిక ఇదే అని కూడా అన్నారు. దీంతో జేయేసీకి ప్ర‌జ‌ల్లో పెద్ద ఎత్తున ఆద‌ర‌ణ ల‌భిస్తోంద‌నే సంకేతాలు వెలువడ్డాయి. ఇలాంటి నేప‌థ్యంలో జ‌రుగుతున్నదీ కొలువుల కొట్లాట స‌భ‌. దీన్ని విజ‌యవంతం చేసుకుంటే.. జేయేసీ బ‌లం మ‌రింత పెరిగిన‌ట్టే అవుతుంది.

స‌భ నిర్వ‌హ‌ణ‌లో అన్ని రాజ‌కీయ పార్టీల‌నూ భాగ‌స్వామ్యం చేయాల‌ని కోదండ‌రామ్ నిర్ణ‌యించారు. దీన్లో భాగంగా వామ‌ప‌క్షాల నేత‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. నిరుద్యోగుల స‌మీక‌ర‌ణ‌లో లెఫ్ట్ పార్టీల మ‌ద్ద‌తు కోరారు. వీరితోపాటు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్‌, భాజ‌పా, తెలుగుదేశం పార్టీకి చెందిన ప్ర‌ముఖ నేత‌లను కూడా కోదండ‌రామ్ క‌లుసుకోబోతున్నారు. ఈ స‌భా వేదిక‌పై అన్ని పార్టీల నాయ‌కుల‌కూ స్థానం క‌ల్పించ‌బోతున్నారు. స‌భ‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతోపాటు, నిరుద్యోగుల‌ను స‌మీక‌రించే విష‌యంలో కూడా పార్టీల మ‌ద్ద‌తు కోరేందుకు కోదండ‌రామ్ సిద్ధ‌మౌతున్నారు. అయితే, ఒక ద‌శ‌లో రాజ‌కీయ పార్టీలతో సంబంధం లేకుండా సొంతంగా ఈ కొలువుల కొట్లాట స‌భ నిర్వ‌హించాల‌ని అనుకున్నారు. కానీ, దీనిపై జేయేసీలోనే భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ఈ స‌భ ద్వారా కేసీఆర్ స‌ర్కారుపై ఉన్న వ్య‌తిరేక‌త‌ను భారీ ఎత్తున ప్ర‌ద‌ర్శించాలంటే సొంత శ‌క్తి స‌రిపోద‌నీ, భారీ ఎత్తున నిరుద్యోగుల స‌మీక‌ర‌ణ చేయాలంటే రాజ‌కీయ పార్టీల స‌హ‌కారం అవ‌స‌రం అనే అభిప్రాయం స్టీరింగ్ క‌మిటీ మీటింగ్ లో వ్య‌క్తం కావ‌డంతో వ్యూహం మార్చుకున్నారు.

కోదండ‌రామ్ స‌భకు మ‌ద్ద‌తు ఇచ్చేందుకు రాజ‌కీయ పార్టీ నాయ‌కులు ముందుకు రావ‌డం ఖాయం. కేసీఆర్ స‌ర్కారుకు వ్య‌తిరేకంగా స‌భ‌లు పెడితే కాద‌నేవారు తెరాస యేత‌ర రాజ‌కీయ పార్టీల్లో ఎవ‌రుంటారు చెప్పండీ. అయితే, నిరుద్యోగుల స‌మీక‌ర‌ణ విష‌యంలో కూడా రాజ‌కీయ పార్టీల సాయాన్ని కోదండ‌రామ్ ఆశిస్తున్నారు క‌దా! మ‌రి, జేయేసీ స‌భ‌కు ఇత‌ర పార్టీల నాయ‌కులు జ‌న‌స‌మీక‌ర‌ణను ఏమాత్రం చిత్త‌శుద్ధితో చేస్తారో చూడాలి. ఎందుకంటే, ఎంత భారీ ఎత్తున నిరుద్యోగుల‌ను త‌ర‌లించినా.. చివ‌రికి అది కోదండ‌రామ్ నాయ‌క‌త్వంలో జేయేసీ నిర్వ‌హించిన స‌భే అవుతుంది క‌దా!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.