ఓ గొప్ప అవ‌కాశాన్ని జ‌గ‌న్‌ వ‌దులుకున్న‌ట్టే..!

ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర చేస్తున్నారు. కాబ‌ట్టి, వైకాపా ఎమ్మెల్యేలంతా ఆయ‌న‌కు అందుబాటులో ఉండాలీ, ఏర్పాట్లు చూసుకోవాలి. అస‌లు కార‌ణం ఇదైతే, ఫిరాయింపు నేత‌ల‌పై చ‌ర్య‌లు తీసుకునే వ‌ర‌కూ అసెంబ్లీలో అడుగుపెట్టేది లేదంటూ తాజా స‌మావేశాల‌ను ప్ర‌తిప‌క్షం గుండుగుత్తంగా బ‌హిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌జా స‌మ‌స్య‌ల్ని ప్ర‌జ‌ల్లోనే ప్ర‌జ‌ల‌తోనే మాట్లాడ‌తాం అంటూ స‌భ‌కు రాలేదు. అయితే, ఈ రాష్ట్రానికి ప్ర‌తిప‌క్షం అవ‌స‌రం లేద‌ని నిరూపించ‌డం కోసం అన్న‌ట్టుగా తాజా స‌మావేశాల‌ను అధికార పార్టీ నిర్వ‌హించుకొస్తోంద‌న‌డంలో సందేహం లేదు. తాము స‌భ‌కు వెళ్ల‌క‌పోవ‌డానికి గ‌ల కార‌ణం ఫిరాయింపులే అని పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ చెప్పుకుంటూ ఉన్నా.. ప్రజా స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించే ఓ గొప్ప అవ‌కాశాన్ని ప్ర‌తిప‌క్షం చేజేతులా జార‌విడుచుకుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మౌతోంది!

చంద్ర‌బాబు నాయుడు ఇచ్చిన‌ ఎన్నిక‌ల హామీల్లో అత్యంత కీల‌క‌మైన కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించ‌డం. ఇన్నాళ్లూ దీనిపై వైకాపా చాలా విమ‌ర్శ‌లు చేసింది. టీడీపీ కూడా చేయాల్సిన తాత్సారం చేసింది. కానీ, ఇవాళ్టి ప‌రిస్థితి ఏంటంటే… మంజునాథ‌న్ క‌మిటీ నివేదిక ఇచ్చేసింది. కాపుల‌కు 5 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించే ప్ర‌తిపాద‌నను తీర్మానించేందుకు స‌భ కొలువైంది. ఈ అంశంపై స‌భ‌లో విస్తృత చ‌ర్చ జ‌రుగుతుంది. ఇలాంటి కీల‌క‌మైన అంశంపై మాట్లాడేందుకు ప్ర‌తిప‌క్షం స‌భ‌లో లేక‌పోవ‌డం.. అది వారు జార‌విడుచుకున్న అవ‌కాశ‌మే. ఇదే కాదు… ఎన్నిక‌ల హామీల్లో మరో కీల‌క‌మైన అంశం నిరుద్యోగ భృతి, దీని గురించి కూడా తాజా స‌మావేశాల్లోనే విధివిధానాలు ఖ‌రారు చేయాల‌నే ఆలోచ‌నతో ప్ర‌భుత్వం ఉంది. నిరుద్యోగ భృతిని ఏవిధంగా ఇవ్వాలీ, ఇచ్చిన‌వారితో ఎలాంటి ప‌నులు చేయించుకోవాల‌నే క‌స‌ర‌త్తు కూడా జ‌రుగుతోంది. దీంతోపాటు తాజాగా పోల‌వ‌రం ప్రాజెక్టు వ్య‌వ‌హారం. కేంద్రం అనుస‌రిస్తున్న వైఖ‌రిపై ముఖ్య‌మంత్రి ఆవేద‌న చెంద‌డం, అయినాస‌రే, భాజ‌పా భాగ‌స్వామ్య ప‌క్షం కాబ‌ట్టి సామర‌స్య‌ పూర్వ‌కంగానే కేంద్రంతో ప‌నులు చేయించుకోవాల‌ని చెప్ప‌డ‌మూ చూస్తున్నాం. ఈ అంశంపై కూడా ప్ర‌తిప‌క్ష పార్టీ స‌భ‌లో ఉంటే ప్ర‌భావంతమైన చ‌ర్చకు ఆస్కారం ఉండేది. ప్ర‌భుత్వాన్ని మ‌రింత తీవ్రంగా నిల‌దీసే అవ‌కాశం ఉండేది.

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేందుకు, అంశాలవారీగా ప్ర‌భుత్వాన్ని నిల‌దీసేందుకు స‌రైన వేదిక అసెంబ్లీ. రాష్ట్రానికి అత్యంత ప్ర‌ధాన‌మైన అంశాలు, వివాదాస్ప‌ద అంశాలు, టీడీపీని ఇరుకున పెట్టే అవకాశం ఉన్న అంశాల ఈ స‌మావేశాల్లో చ‌ర్చకు వ‌స్తున్నాయి. ఈ లెక్క‌న తాజా స‌మావేశాలు బ‌హిష్క‌రించి వైకాపా సెల్ఫ్ గోల్ చేసుకుందనే అభిప్రాయం కొన్ని వ‌ర్గాల నుంచి వ్య‌క్త‌మౌతోంది. అయితే, వైకాపా స‌భ‌లో లేదు కాబ‌ట్టే ఇలాంటి అంశాల‌ను స‌భ‌లో ప్ర‌వేపెట్టార‌నే అభిప్రాయాన్ని ఆ పార్టీ వ్య‌క్తం చెయ్యొచ్చు. కానీ, అలా మాట్లాడితే మరో సెల్ఫ్ గోల్ అవుతుంది. ప్ర‌తిప‌క్షం కోసం ఆగాల్సిన అవ‌స‌రం అధికార పార్టీకి ఉండ‌దు క‌దా! అసెంబ్లీలో టీడీపీ మెజారిటీ పార్టీ. వైకాపా స‌భ్యులు రానంత మాత్రాన శాస‌న ప్ర‌క్రియ ఆపాల‌నే రూల్ ఏమీ లేదు. పైగా, వైకాపా స‌భ్యుల‌ను రావొద్ద‌ని టీడీపీ శాసించ‌లేదు, స‌భ నుంచి వేటు వెయ్య‌లేదు. అది వైకాపా సొంత విచక్షణతో తీసుకున్న నిర్ణ‌యం క‌దా!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.