చినికి చినికి గాలివానగా కృష్ణారావు తొలగింపు?

ఆంధ్ర ప్రదేశ్‌ బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి నుంచి మాజీ ఎపి ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు తొలగింపు చినికి చినికి గాలివానగా మారిన ఒక పరిణామం. రాజకీయాల్లో కులాల వారీ వ్యూహాలు పెరిగిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు బ్రాహ్మణ పరిషత్తులను ఏర్పాటు చేసి వారికి సహాయం చేసి ఆకట్టుకోవడానికి నిధులు కేటాయించాయి. విభజన సమయంలో పొడగింపుపై కార్యదర్శిగా కొనసాగిన ఐవైఆర్‌ను పదవీ విరమణకు ముందే చైర్మన్‌ పదవిలో నియమించారు. అయితే ఆయనకు అప్పటికే ఒక స్థాయి వుండటం వల్ల పరిషత్తు వల్ల జరిగే పనులతో తెలుగుదేశం పార్టీకి రావలసిన రాజకీయ ప్రయోజనం జరగడం లేదని చాలా రోజులుగా ఒక దుమారం నడుస్తున్నది. ఇదంతా అలా వుంటే సోమవారం(జూన్‌19)న టిడిపి మిత్రులు ఒక పోస్టు పెట్టారు. తన సోషల్‌ సైట్‌లో ఐవైఆర్‌ ప్రభుత్వాన్ని విమర్శించారని సోదాహరణంగా వెల్లడించారు. తర్వాత అదే సమాచారం ఎబిఎన్‌ ఆంధ్రజ్యోతికి కూడా చేరింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు, లోకేశ్‌కు కూడా చేరింది. అయితే అది ఐవైఆర్‌ అధికారికంగా నడుపుతున్న సైటేనా కాదా తెలుసుకోవడానికి ఆయనకే అజ్ఞాతంగా ఫోన్లు చేస్తే దురుసుగా సమాధానమిచ్చారని వారంటారు. మొత్తంపైన ఇది నిజమేనని తేలిపోయాక అంతకుముందున్న ఫిర్యాదులు కూడా కలిపి తొలగింపుకోసం ఒత్తిడి పెరగడం, రెండరోజుకు అది జరిగిపోవడం పూర్తయ్యాయి. ఇది సోషల్‌ మీడియాలో ప్రజాస్వామ్య హక్కులకు భంగకరమని ఒక వాదన, ఐవైఆర్‌ తనకు పదవి ఇచ్చిన వారికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం తప్పని మరో వాదన నడుస్తున్నాయి. అది వారి వారి ఇష్టం.

ఇప్పుడు ఐవైఆర్‌ మాట్టాడింది చూస్తే ఆరునెలలుగా ముఖ్యమంత్రి కలవకపోవడం వంటివి యాదృచ్చికం కాదని స్పష్టమవుతుంది. వైసీపీ టిడిపి లబ్దిదారులంటూ వుండరని ఆయన చేసే వాదన కూడా ఒకేనే. అయితే బిజెపి తరపున ప్రచారం చేయడం మాత్రం సమర్థించుకోలేనిది. ఒక ఫైలు విషయంలో ముఖ్యమంత్రి సహకరించకపోయినా బిజెపి మంత్రి తోడ్పడ్డారు గనక వెళ్లానని చెబుతున్నారు గాని అది అతికేది కాదు. ముఖ్యమంత్రి భజన చేయలేనని కూడా కుండ బద్దలు కొట్టేశారు. ఆయన లాజిక్కులో మరో ముఖ్యమైన అంశం- టిడిపి నేతలు ఇంతమంది వివాదాలు సృష్టిస్తే చర్యలు తీసుకోని వారు నాపై వేటు వేయడం ఏమిటన్న ప్రశ్న రాజకీయంగా ఆలోచించదగిందే. మీరు లగడపాటి రాజగోపాల్‌ను కలవొచ్చు గాని నేను కోన రఘపతిని కలవకూడదా అనేది రాజకీయ సామాజిక సవాలే. ఇక శాతకర్ణి సినిమాపై పెట్టిన పోస్టు చరిత్రకు సంబంధించిందనీ, ఇంటూరి రవి కిరణ్‌ అరెస్టు విషయంలోనూ తనకు రాజకీయాలు లేవని ఆయన అంటున్నారు.

మొత్తంపైన ఏ విషయంలోనూ ఐవైఆర్‌ వెనక్కు తగ్టినట్టు కనిపించలేదు. ఇక దీని ప్రభావం సామాజిక కోణంలో ఎలా వుంటుందో వూహించవలసిందే. అందుకే ఈ లోగానే వేమూరి ఆనంద సూర్య పేరు వదలడం ద్వారా సంబంధిత వర్గంలో ఒక భాగాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.