జ‌గ‌న్ తో పొత్తుపై మంత్రి కామినేని మాట ఇదీ..!

ఏ పార్టీకైనా ఒక‌టే అజెండా ఉంటుంది. ఇత‌ర పార్టీలూ లేదా నాయ‌కుల‌పై స్పందించాలనుకున్నప్పుడు కొన్ని స్థిర‌మైన అభిప్రాయాలు ఉంటాయి, ఉండాలి కూడా! కానీ, ఏపీ భాజ‌పా నేత‌లు మాత్రం ఎవ్వ‌రికీ అర్థం కారు. అంద‌రూ ఒక పార్టీ నేత‌లే.. కానీ, ఒక్కొక్క‌రిదీ ఒక్కో ర‌క‌మైన అభిప్రాయం. టీడీపీ స‌ర్కారులో మంత్రులుగా ఉంటున్న ఆ ఇద్ద‌రివీ రెండు ర‌కాల అభిప్రాయ‌లుగా ఇప్పుడు క‌నిపిస్తున్నాయి. అదేనండీ.. మంత్రి కామినేని శ్రీ‌నివాసరావు, మ‌రో మంత్రి మాణిక్యాల‌రావు! తెలుగుదేశంతో పొత్తుపై మొన్న‌నే మంత్రి మాణిక్యాల‌రావు కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. కొండ‌కు వెంట్రుక క‌ట్టామ‌నీ, తెగిపోతే త‌మ‌కు పోయేదేం లేద‌నీ, త‌మది జాతీయ పార్టీ కాబ‌ట్టి కొన్ని పార్టీలు బ‌య‌ట‌కి వెళ్లినా కొత్త‌వి వ‌చ్చి చేరుతాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. కొత్త‌వి అన‌గానే.. ఏపీ వ‌ర‌కూ టీడీపీతో పొత్తు తెగితే చేరేందుకు అవ‌కాశం ఉన్న‌ది వైకాపా మాత్ర‌మే క‌దా! మంత్రి మాణిక్యాలరావు మ‌నోగ‌తం ఇలా ఉంటే.. కామినేని అభిప్రాయం దీనికి పూర్తి భిన్నంగా ఉంది.

అవినీతిప‌రుడైన జ‌గ‌న్ తో భాజ‌పా పొత్తు పెట్టుకుంటుంద‌ని తాను భావించ‌డం లేద‌ని కామినేని తాజాగా అభిప్రాయ‌ప‌డ్డారు. వైకాపాతో భాజ‌పా పొత్తు ఊహించుకోలేం అన్నారు. ఇక‌, భాజ‌పా అధిష్టానం ఆదేశిస్తే తానూ రాజీనామాకు సిద్ధంగా ఉన్నాన‌ని కామినేని చెప్పారు! ఇదే సందర్భంలో మంత్రి మాణిక్యాల రావు చేసిన వ్యాఖ్య‌ల్ని ప్రస్థావిస్తే.. వాటిని తీవ్రంగా ప‌రిగణించాల్సిన అవ‌స‌రం లేద‌ని చాలా ఈజీగా కాట్టిపారేశారు.

నిజానికి, వైకాపాతో భాజపా పొత్తు అనే అంశంపై కామినేని మొదట్నుంచీ స్థిర‌మైన అభిప్రాయంతోనే ఉన్నారు. మోడీ అవినీతి ర‌హిత‌మైన పాల‌న అందిస్తున్నార‌నీ, అలాంటిది అవినీతి కేసుల్లో ఇరుక్కుని కోర్టుకు విచార‌ణ‌కు వెళ్తున్న జ‌గ‌న్ తో పొత్తు ఎలా సాధ్య‌మ‌ని గ‌తంలో కూడా అభిప్రాయ‌ప‌డ్డారు. ఒకే పార్టీకి చెందిన ఇద్ద‌రు నాయ‌కులు వైకాపాతో పొత్తు గురించి రెండు ర‌కాలుగా మాట్లాడుతూ ఉండ‌టం విశేషం. అయితే, ఏపీ భాజ‌పాలో రెండు వ‌ర్గాలున్నాయ‌నీ, ఒక‌టి చంద్ర‌బాబు అనుకూల వ‌ర్గ‌మైతే, మ‌రొకటి వ్య‌తిరేకించే వ‌ర్గం అనే ప్ర‌చారం ఉంది. ఇక‌, కామినేని విష‌యానికొస్తే మొద‌టి వర్గంలో ఉంటార‌నే కామెంట్స్ కూడా చాలా ఉన్నాయి. ఏదేమైనా, ఏపీ భాజ‌పా నేత‌లది తలోదారి అనేది ఎప్ప‌టిక‌ప్పుడు నిరూపితం అవుతూనే ఉంటుంది. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌ను దాటి, రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు ప్రాధాన్య‌త ఇచ్చే వైఖ‌రి వారిలో క‌నిపించ‌డం లేదు..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.