తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా బీఆర్ఎస్లో కవిత క్రమంగా భయం కలిగిస్తున్నారు. పాత పార్టీ పేరుతో వస్తానని కవిత హింట్ ఇవ్వడం సంచలనంగామారింది. ఆమె టీఆర్ఎస్ పేరుతో కొత్త ప్రాంతీయ పార్టీని ప్రకటిస్తే ఎలా ఉంటుందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో జోరందుకుంది. ఇది జరిగితే గనుక, అది కేవలం కాంగ్రెస్, బీజేపీలకే కాకుండా.. సాక్షాత్తూ కేసీఆర్, కేటీఆర్‌లకే ఒక మాస్టర్ స్ట్రోక్ అవుతుందన్న అంచనాలు ప్రారంభమయ్యాయి.
తెలంగాణ సెంటిమెంట్ – ఖాళీగా ఉన్న స్పేస్
ప్రస్తుతం తెలంగాణలో ఒక విచిత్రమైన రాజకీయ శూన్యత కనిపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీలు జాతీయ పార్టీలు కాగా, కేసీఆర్ తన టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడంతో రాష్ట్రంలో ప్రత్యేక ప్రాంతీయ పార్టీ అనే ముద్ర పోయింది. కేటీఆర్ ఎన్నిసార్లు బీఆర్ఎస్ తెలంగాణ పార్టీ అని మొత్తుకుంటున్నా, ప్రజల్లో ఆ ఓన్లీ తెలంగాణ అనే ఎమోషన్ మునుపటిలా పండటం లేదు. ఈ క్రమంలో కవిత మళ్లీ తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరుతో రంగంలోకి దిగితే, అది తెలంగాణ ఆత్మగౌరవానికి కేరాఫ్‌గా మారే అవకాశం ఉంది. ఎమోషనల్ పాలిటిక్స్‌లో కవితకున్న పట్టు, ముఖ్యంగా తెలంగాణ జాగృతి ద్వారా ఆమె నిర్మించుకున్న నెట్వర్క్ ఈ వ్యూహానికి బలాన్ని ఇస్తాయి.
కేటీఆర్, కేసీఆర్‌లకు మొదటి షాక్!
ఒకవేళ కవిత సొంతంగా టీఆర్ఎస్ పార్టీని పెడితే, అది బీఆర్ఎస్ కోలుకోలేని దెబ్బ అవుతుంది. పార్టీ కేడర్ రెండుగా చీలిపోయే ప్రమాదం ఉంది. బీఆర్ఎస్లో అసంతృప్తిగా ఉన్న పాత టీఆర్ఎస్ నేతలందరూ కవిత వైపు మొగ్గు చూపే అవకాశం మెండుగా ఉంది. కేసీఆర్ జాతీయ రాజకీయాల కలల కోసం తెలంగాణ అస్తిత్వాన్ని పణంగా పెట్టారనే వాదనను కవిత తెరపైకి తెస్తే, అది సొంత కుటుంబంలోనే పెద్ద రాజకీయ చీలికకు దారితీస్తుంది. కేటీఆర్ నాయకత్వాన్ని వ్యతిరేకించే వర్గానికి కవిత ఒక ప్రత్యామ్నాయ శక్తిగా మారి, వారిద్దరి అంచనాలను తలకిందులు చేయగలదు.
కవిత సైలెంట్ ఆపరేషన్
కవిత రాజకీయ వ్యూహాలను తక్కువ అంచనా వేయలేరు. ఢిల్లీ లిక్కర్ కేసు వంటి క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడిన తర్వాత, ఆమె తన రాజకీయ భవిష్యత్తును వెతుక్కునే క్రమంలో ఈ రీ-బ్రాండింగ్ వ్యూహాన్ని ఎంచుకునే అవకాశం ఉంది. నాన్న పెట్టిన పార్టీని, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడటానికే నేను మళ్లీ టీఆర్ఎస్ను తెచ్చాను అనే ఎమోషనల్ కార్డ్ ప్లే చేస్తే, తెలంగాణ ఓటర్లు మళ్లీ అటువైపు మళ్లే ఛాన్స్ ఉంది. తెలంగాణకు ఇప్పుడు కావాల్సింది ఒక బలమైన ప్రాంతీయ గొంతుక. కాంగ్రెస్, బీజేపీలు ఢిల్లీ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో, తెలంగాణ పార్టీ అనే ముద్రతో వచ్చే ఎవరికైనా ఇక్కడ ఆదరణ లభిస్తుంది. కవిత ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటే, అది బీఆర్ఎస్కు పెను గండంగా మారుతుంది.


