పీడ పండుగ కాదు… ఓట్ల పండుగ !

సీమాంధ్ర ప్రాంతంలో సంక్రాంతి పెద్ద పండుగ. కానీ మొదటి నుచీ తెరాస అధినేత కేసీఆర్ ఇది మనకు పెద్ద పండుగ కాదని కామెంట్ చేసేవారు. అది పీడ పండుగ. మనకు పెద్ద పండుగ కాదు. ఆంధ్రా వాళ్లకే పండుగ అనే వారు. సంక్రాంతికి ఎక్కువ రోజులు సెలవులకు కూడా ఆయన వ్యతిరేకంగా ఉండేవారు.

ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సీమాంధ్రుల ఓట్లు కావాలి కాబట్టి కేసీఆర్ కు, ఆయన కుటుంబ సభ్యులకు, ప్రభుత్వానికి సంక్రాంతి పెద్ద పండుగ అయింది. హటాత్తుగా వైఖరి మారింది. ప్రభుత్వం చాలా ఉదారంగా సంక్రాంతి సెలవులు ఇచ్చింది. ఫ్యామిలీ ప్యాకేజీ లాగా కేసీఆర్, కేటీఆర్, కవితలు సంక్రాంతి సుద్దులు వల్లెవేస్తున్నారు.

భోగి సందర్భంగా కేసీఆర్ పుత్రిక కవిత తెల్లవారు ఝామున చాలా ఓపిక చేసుకుని బయటకు వచ్చారు. భోగి మంటల కార్యక్రమంలో ఓపిగ్గా పాల్గొన్నారు. అందరితో కలివిడిగా భోగి సంబరాలు పంచుకున్నారు. ఓటు చాలా విలువైంది. బలమైంది. కేసీఆర్ కంటే ఓటే పవర్ ఫుల్ అని మరోసారి రుజువైంది.

ఈసారి ఎన్నికల్లో సీమాంధ్రుల ఓట్లే కీలకం. పాత నగరాన్ని మినహాయిస్తే, మిగతా ప్రాంతాల్లో సగానికి పైగా డివిజన్లలో వీరి ఓట్లే నిర్ణాయకం. వీరు ఎటు ఓటు వేసే అటు విజయం ఖాయం. ఈ ఓట్లన్నీ గంప గుత్తగా టీడీపీ, బీజేపీ ఖాతాలోకి పోతాయేమో అని తెరాస భయం. మొన్నటి దాకా సీమాంధ్రులను ముప్పు తిప్పలు పెట్టింది కేసీఆర్ సర్కార్. కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయగానే స్థానికతకు సంబంధించి తెచ్చిన జీవో సీమాంధ్రులను టెన్షన్ పెట్టింది. చివరకు హైకోర్టు మొట్టికాయలు వేసి ఆ ఉత్తర్వులను నిలిపివేసింది. ఇటీవలే సీమాంధ్రులకు చెందిన 25 లక్షల ఓట్లను తొలగిస్తారని తీవ్రంగా ప్రచారం జరిగింది. అది నిజమో కాదో గానీ, తెరాస నేతల మాటలు వింటే నిజమేనేమో అనుకోవాల్సి వచ్చింది

ఇప్పుడు ఓట్ల కోసట ఫీట్లు మొదలయ్యాయి. సంక్రాంతి ఎంతో శుభకరమైన, చాలా పే….ద్ద పండుగ అన్నట్టు కేసీఆర్ అండ్ ఫ్యామిలీ తెగ ఇదైపోతుంది. ఇదంతా చూసి సీమాంధ్ర ప్రజలు కారు గుర్తుకు ఓటెయ్యక పోతారా అని ఆ ఫ్యామిలీ గంపెడాశతో ఉన్నట్టుంది. ఇంతకీ వారి ఆశ నెరవేరుతుందో లేదో చూద్దాం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com